Penugonda Politics: అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెనుగొండ తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టున్న నియోజకవర్గం.. అలాంటి చోట వైసీపీ అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో మొట్టమొదటి సారి బోణీ కొట్టగలిగింది. దాంతో పెనుగొండ ఎమ్మెల్యేకి మంత్రి పదవి కూడా దక్కింది. మరి ఏమైందో ఏమో వైసిపి గత ఎన్నికల్లో ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది.. ఉన్న ఒక బలమైన అభ్యర్థిని మార్చి మరో అభ్యర్థిని తెచ్చిపెట్టింది.. ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం పెనుకొండ వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న ఆ నేతను కూడా మారుస్తార్న ప్రచారం జరుగుతుంది.. అసలే బలహీనంగా ఉన్నచోట జగన్ పార్టీ ఎందుకు ఇన్ని ప్రయోగాలు చేస్తోంది? అసలు ఎన్నికలకు నాలుగేళ్లకు పైగా సమయం ఉన్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడి లెక్కలేంటి?
పెనుగొండలో ఒక్కసారి మాత్రమే గెలిచిన వైసీపీ
శ్రీ సత్య సాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. పెనుగొండ నుంచి టిడిపి అనేకసార్లు అప్రహతిహంగా గెలిచి ఆ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత అక్కడ కాంగ్రెస్ రెండు సార్లు.. వైసీపీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించాయి. పెనుగొండ నుంచి పరిటాల రవీంద్ర మూడు సార్లు వరుసగా విజయం సాధించారు. ఆయన దారుణ హత్య తర్వాత రవి భార్య పరిటాల సునీత ఒక్కసారి పెనుగొండ నుంచి గెలుపొందారు. మొత్తంగా ఇప్పటివరకు 8 సార్లు పెనుగొండ నుంచి టీడిపి విజయం సాధించింది.
ఉషాశ్రీచరణ్‌ను పెనుగొండకు మార్చిన జగన్
2019 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర నారాయణ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి శంకర నారాయణని కాదని కళ్యాణదుర్గం నుంచి వలస వచ్చిన మరో మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్ టికెట్ కేటాయించారు. కానీ 2024 లో ఉష శ్రీ చరణ్ ఘోర పరజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి పెనుగొండలో ఉషశ్రీచరణ్ వైసీపీ ఇన్చార్జ్‌గా హడావుడి చేస్తూ పార్టీపై పట్టు పెంచుకోవడానికి నానా పాట్లు పుడుతున్నారు.
పెనుగొండ వైసీపీ ఇన్చార్చ్ పదవి ఆశిస్తున్న శంకరనారాయణ
మరోవైపు వైసీపీ నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శంకరనారాయణ.. తిరిగి పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ పదవి ఆశిస్తూ పావులు కదుపుతున్నారంట. అందులో భాగంగా మండల స్థాయిలో తన వర్గీయులతో సమావేశాలు పెట్టి మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారంట. పార్టీ అధ్యక్షుడు జగన్, ఇతర పార్టీ పెద్దల వద్దకు వెళ్లి నియోకవర్గ ఇన్చార్జ్ పదవి శంకర్ నారాయణకే ఇవ్వాలని పెనుగొండ సెగ్మెంట్ పరిధిలోని మండలాల నేతలు వత్తిడి తెస్తున్నారంట. అందులో భాగంగా సోమందేపల్లి, గోరంట్ల తదితర మండలాల్లో శంకరనారాయణ వర్గీయులు రహస్యంగా సమావేశం నిర్వహించి.. తమ డిమాండ్‌ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది
నారాయణ వర్గీయుల్ని సస్పెండ్ చేయించిన ఉషాశ్రీచరణ్
ఈ నేపథ్యంలో ఉష శ్రీ చరణ్ హైకమాండ్ దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ శంకరనారాయణ వర్గీయుల్ని కొందర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దాంతో పెనుగొండలో వారద్దరి మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా తయారైందంటున్నారు . ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం వారిద్దరు అలా కుస్తీ పడుతుంటే.. ఇటీవల వారిద్దరికి పోటీగా మూడో వ్యక్తి సీన్లోకి వచ్చి ఇన్చార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారంట. ఉషాశ్రీ, శంకరనారాయణలను పెనుగొండ వైసీపీలో సైడ్ చేయడానికి శిల్పా అనే కొత్త నాయకురాలు ప్రయత్నిస్తున్నారంట.
కాలేశ్వరం బాబా సతీమణి శిల్పా
సడన్‌గా ఈ శిల్పా ఎవరు అనుకుంటున్నారా… పదేళ్ల క్రితం పెనుగొండలో ఒక వెలుగు వెలిగిన కాళేశ్వరం బాబా సతీమణే ఈ శిల్ప . పెనుకొండలో సాయికాళేశ్వర్ ఉన్నప్పుడు మంచి క్రేజ్ ఉండేది.. ఆయన షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్టు చైర్మన్ గా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.. ఆ సేవా కార్యక్రమాలు సాయి కాళేశ్వర్ ఆశయాలను మరింత విస్తృత పరచాలి అంటే రాజకీయాలే సరైన వేదిక అని శిల్ప నిర్ణయించుకున్నారంట .. త్వరలో వైసీపీలో చేరి ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ఆమె పావులు కదుపుతున్నారని శిల్ప అనుచరులు చెప్తున్నారు.
స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉండి, ఆర్థికంగా బలమైన శిల్ప
ఇప్పటికే పెనుగొండ ఇద్దరు మాజీ మంత్రులు శంకర్ నారాయణ , ఉష శ్రీ చరణ్ లు రెండు వర్గాలుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయితే ఇన్చార్జ్‌గా ఉష శ్రీ చరణ్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారని పార్టీ క్యాడర్ ఆరోపణలు గుప్పిస్తోంది .. ఆ క్రమంలో ఇటు కడప, అనంతపురం జిల్లాలతో అనుబంధం ఉండి, స్థానికంగా మంచి ఫాలోయింగ్, ఆర్థికంగా చాలా బలమైన శిల్ప వైపు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతోందంట … అయితే ఇప్పుడు మాజీ మంత్రి శంకరనారాయణను వైసీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్‌గా తీసుకోవడంతో ఉష శ్రీ చరణ్ కాస్త రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు…
ఉషాశ్రీ చరణ్ పై పెనుగొండ వైసీపీలో వ్యతిరేకత
ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న పెనుగొండ వైసీపీ ఇన్చార్జ్ ఉషాశ్రీకి శిల్ప రూపంలో మరో తలనొప్పి ఎదురైందంటున్నారు.. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఆమె పెద్దగా ప్రభావం చూపించడం లేదన్నది బహిరంగ రహస్యం అని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారట… ఆ క్రమంలో శిల్పా పోటీలోకి రావడంతో ఉష శ్రీ చరణ్ పెనుగొండ్ టికెట్‌పై తెగ టెన్షన్ పడుతున్నారట.. అదలా ఉంటే పెనుగొండ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ లోనే ఉంటానని శంకర్ నారాయణ చెప్తున్నారు.. ఉషాశ్రీ చరణ్ మాత్రం పెనుగొండలో అవకాశం దక్కకపోతే బీజేపీలో చేరి కర్ణాటక నుండి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంట.
Also Read: గోశాల వివాదం.. భూమన పాత రికార్డులు ఎక్కడ?
శిల్పను వైసీపీ ఇన్చార్జ్‌గా స్వాగతిస్తున్న క్యాడర్
ఏమైనా శిల్పకు వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని పెనుకొండ వైసీపీ శ్రేణులు అంటున్నాయి.. అయితే వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారాన్ని శిల్ప ఖండిస్తున్నారంట.. తాను కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తాననిచ రాజకీయాల్లోకి ఇప్పుడేరానని తన అనుచరుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది.. మరి చూడాలి పెనుగొండ వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు జగన్ ఎవరికి కట్టబెడతారో?