BigTV English
Advertisement

అసమాన కలం యోధుడు.. షోయబ్ ఉల్లాఖాన్..!

అసమాన కలం యోధుడు.. షోయబ్ ఉల్లాఖాన్..!

హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని ఎందరో యోధులు తమదైన శైలిలో పోరాటాలు చేశారు. ఆ సమయంలో ‘నేను సైతం’ అంటూ ఇరవైళ్ల యువ పాత్రికేయుడు నిజాంపై అక్షరయుద్ధం ప్రారంభించాడు. ఆయనే షోయబ్ ఉల్లాఖాన్. అక్షరాన్ని అగ్నికణంగా మార్చి, నిరంకుశ నిజాం దమననీతిని, దుర్మార్గపు పాలన మీద తన ఉర్దూ పత్రికలో అగ్నిగోళాల వంటి వ్యాసాలు రాసి.. హైదరాబాద్ సంస్థానంలో జాతీయభావాలను రగిలించాడు. హైదరాబాద్ సంస్థానంలోని దొరల, దేశ‌ముఖ్‌ల, రజాకార్ల ఆగడాలను ఎలుగెత్తి చాటుతూ నిజాంను సవాల్ చేసిన ఆయన రచనలు.. హైదరాబాద్ సంస్థానపు యువతను స్వాతంత్ర పోరాటం దిశగా నడిపించాయి. ఒక పాత్రికేయుడు అన్నీ తానై నడిపే ఒక చిన్న పత్రిక తమ రాజ్యపు పునాదులను పెకలించే స్థితి రావటాన్ని తట్టుకోలేకపోయిన మతోన్మాద శక్తులు నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా ఆయనపై దాడి చేశాయి. ఆ ముష్కర మూకల వికృత దాడిలో 28 ఏండ్ల షోయబ్ ఉల్లాఖాన్ వాలిపోయాడు. నేడు ఆ మహనీయుని వర్థంతి.


షోయబ్ పూర్వీకులది ఉత్తర ప్రదేశ్. షోయబ్ తండ్రి హబీబుల్లా ఖాన్ నిజాం రైల్వేలో కానిస్టేబుల్‌. ఖమ్మం జిల్లా సుబ్రవేడులో నివాసముండేవారు. తల్లి లాయహున్నీసా బేగం. 1920 అక్టోబరు 17న మహాత్మాగాంధీ తన దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆగారు. ఆ సమయంలో.. అక్కడ డ్యూటీలో ఉన్న హబీబుల్లా ఖాన్‌కి జాతిపితను చూసే అవకాశం వచ్చింది. ఆ ఆనందంతో ఆ రోజు ఇంటికి వచ్చిన కాసేపటికే భార్య మగబిడ్డను కన్నది. దీంతో తండ్రి ముద్దుగా కుమారుడిని ‘షోయబ్ గాంధీ’ అని పిలుచుకునే వాడు. బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా ఉన్న షోయబ్.. ప్రతిదానినీ ప్రశ్నించేవాడు. బొంబాయిలో ఇంటర్, ఉస్మానియా వర్సిటీ నుంచి బిఎ జర్నలిజం చేశారు. ఉర్దూ రచయితగా, పాత్రికేయుడిగా అనతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా.. పొట్ట కూటి కోసం నిజాం సేవకుడిగా మారటం ఇష్టంలేక ప్రజల్లో చైతన్యం తేవడం కోసం పాత్రికేయుడిగా మారాడు.

అప్పట్లో ఒకటి రెండు తప్ప మిగిలిన పత్రికలన్నీ ఉర్దూలోనే ఉండేవి. వాటిలో 95 శాతం పత్రికలకు నిజాంను పొగడటమే పనిగా ఉండేది. తొలినాళ్లలో జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న ‘తేజ్’ ఉర్దూ పత్రికలో షోయబ్ సబ్ ఎడిటర్‌గా చేరి నిజాం నిరంకుశత్యం గురించి, వారి తాబేదార్లు ప్రజలపై సాగిస్తున్న అమానుష ఘటనలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. దీంతో నిజాం ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది. వెంటనే.. బూర్గుల రామకృష్ణారావు బావమరిది మందుముల నరసింగరావు నడిపే రయ్యత్‌ పత్రికలో చేరి అదే బాటలో పయనించాడు. దీంతో అధికారులు దానినీ మూసేయించారు. దీంతో తల్లి, భార్య నగలు అమ్మి, బూర్గుల సహకారంతో ఇమ్రోజ్ (అంటే ఈనాడు అని అర్థం) పత్రికను 1947 నవంబరు 15న ప్రారంభించాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నా లెక్కచేయక ఆ పత్రికను ప్రజల పత్రికగా తీర్చిదిద్దాడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంపాదకీయాలు రాసేవారు. ఏడుగురు ముస్లిం మేధావుల చేత విలీనానికి అనుకూలంగా తీర్మానాన్ని చేయించి, దాని పత్రికలో ప్రచురించాడు. సంస్థానంలో ఎక్కువ మంది ఉర్దూ చదువుకున్న వారు కావడంతో ఇమ్రోజ్‌ రాతలతో విలీనం కోసం ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోవటంతో నిజాం గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి.


Also Read: Achyutapuram Sez Blast: పెను విషాదం.. రియాక్టర్ పేలుడులో 16కు పెరిగిన మృతుల సంఖ్య..సీఎం దిగ్భ్రాంతి

మరోవైపు, 1947 ఆగస్టు 15న దేశమంతా దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంటే.. నాటి హైదరాబాద్ సంస్థానం మాత్రం త్రివర్ణ పతాకం మీద ఆంక్షలు కొనసాగాయి. యువత పోరాటాల మీద సర్కారు ఉక్కుపాదం మోపుతూ వచ్చింది. ఆ సమయంలో షోయబ్ పెన్ను.. గన్నయింది. ఇమ్రోజ్ పత్రికలో షోయబ్ రాసిన అక్షరాలు బులెట్లలా నిజాం గుండెల్లోకి దూసుకుపోయాయి. రజాకార్లకు ఆయన రాతలు వాతలు పెట్టాయి. దీంతో.. నిజాం, ఆయన అనుచరుడు ఖాసీం రజ్వీలు షోయబ్‌కు బెదిరింపు లేఖలు పంపటం మొదలుపెట్టారు. అయినా షోయబ్ అక్షరాలు తడబడలేదు. మరిన్ని అన్యాయాలను బయటకు తీసుకురావటం మొదలైంది. 1948 జనవరి 29 నాటి ఇమ్రోజ్‌ సంచికలో ‘పగటి ప్రభుత్వం- రాత్రి ప్రభుత్వం’ అను శీర్షికతో షోయబ్ రాసిన సంపాదకీయం వచ్చింది. పగలంతా వీధుల్లో ప్రజలు స్వాతంత్ర్యం కావాలని పోరాటాలు చేస్తుంటే.. చీకటి పడగానే నిజాం సేనలు వారిపై హింసకు పాల్పడుతున్న తీరును ఆ వ్యాసం కళ్లకు కట్టినట్లు వివరించింది. ఆ వ్యాసాన్ని విప్లవకారులు హైదరాబాద్ సంస్థానంలోని ప్రతి పల్లెకూ చేర్చటంతో పల్లెల్లోనూ నిజాం ప్రభుత్వానికి ప్రతిఘటన మొదలైంది.

ఢిల్లీలో 1948 నాటికి సంస్థానాల విలీన ప్రక్రియ వేగవంతం కావటంతో ఖాసిం రజ్వీ.. ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. తమ సేనలతో ఢిల్లీ ఎర్రకోట మీద నిజాం జెండాను ఎగరవేయటమే తన లక్ష్యమని రజ్వీ చేసిన ప్రకటనతో షోయబ్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆ పిలుపులో ప్రజలు భాగస్వాములు కావద్దంటూ వ్యాసాలు రాశాడు. తమకు వ్యతిరేకంగా రాతలు రాసే పాత్రికేయుల చేతులు నరికేస్తామని, అలాంటి పత్రికలను నాశనం చేస్తామని 1948 ఆగస్టు 19న ఖాసిం రజ్వీ బహిరంగంగానే హెచ్చరించాడు. కానీ షోయబుల్లాఖాన్ వెనకడుగు వేయలేదు. మర్నాడు.. అంటే ఆగస్టు 20న కూడా అదే హెచ్చరికతో ఒక ఆకాశరామన్న ఉత్తరాన్ని ఇమ్రోజ్ పత్రిక ఆఫీసుకు రాగా.. బూర్గుల వంటి మిత్రులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అయితే.. ఆగస్టు 21 అర్థరాత్రి కాచిగూడ చౌరస్తాలోని ఇమ్రోజ్ ఆఫీసులో పని పూర్తి చేసుకున్న షోయబ్, ఆయన బావమరిది ఇస్మాయిల్‌ ఖాన్‌ లింగంపల్లి చౌరాస్తాలోని తమ ఇంటికి బయలుదేరారు. చప్పల్ బజార్‌కు రాగానే పదిమంది నిజాం గూండాలు షోయబ్ మీద తుపాకి గుళ్ళ వర్షం కురిపించారు. అంతేకాదు.. ఆయన రెండు చేతులూ నరికేశారు. ఈ దాడిని అడ్డుకోబోయిన ఇస్మాయిల్ ముంజేతినీ దుండగులు దారుణంగా నరికి పారిపోయారు. తుపాకీ చప్పుళ్లు విని ఇళ్లనుండి బయటికి వచ్చి నెత్తుటి మడగులో ఉన్న షోయబ్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆగస్టు 22 న తెల్లవారుజామున ఆయన కాసేపు సృహలోకి వచ్చారు. ‘ఎంతటివారికైనా మరణం అనివార్యం. ఆ మరణం ఒక మంచి లక్ష్యం కోసమైతే వారు గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరంతా సంతోషించండి’ అని మిత్రులకు, సహచరులకు, భార్యతో చెబుతూనే.. ఆ 28 ఏళ్ల కలం యోధుడు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం కావాలని, మతమౌడ్యం లేని ప్రజాస్వామిక పాలన రావాలని పోరాడిన ఆ యోధుడి కల.. సెప్టెంబరు 17న ఆపరేషన్ పోలో ద్వారా నెరవేరింది. లౌకిక, ప్రజాస్వామిక విలువల స్థాపన కోసం చివరి క్షణం వరకు కృషి చేసిన ఆ మహనీయుడి 76వ వర్థంతి సందర్భంగా ఆయనకు అక్షర నివాళి.

Tags

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×