Ex-Minister Narayanaswamy: ప్రస్తుతం రాష్ట్రంలో లిక్కర్ కేసులో అరెస్టుల హాట్ టాపిక్‌గా మారాయి . జగన్ సన్నిహితుల దగ్గర నుంచి అప్పట్లో పనిచేసిన అధికారులకు వరకు అందరూ క్యూ కట్టినట్టుగా ఒకరి తరువాత ఒకరు అరెస్టు అవుతున్నారు. ఓవైపు బెయిల్ పిటిషన్లు.. మరోవైపు కస్టడీ పిటిషన్లుతో నానా రచ్చ జరుగుతుంటే.. ఈ స్కాంలో అసలు పెద్దాయన, ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామి ఎక్కడా? అని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆయన కంటే ముందు చెవిరెడ్డి అరెస్ట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోందంట.
ఏపి లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ దూకుడు
వేల కోట్ల రూపాయల ఏపి లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల కస్టడీల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు. వారితో పాటు మరో 39 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. తాజాగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లను లిక్కర్ కేసులో అరెస్టు అయ్యారు. లిక్కర్ స్కామ్‌లో వచ్చిన ముడుపులను చంద్రగిరి నియోజకవర్గంలో పంచారని చెవిరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఫోకస్ అయిన ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామి
ఈ లిక్కర్ స్కాంలో ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఏ4 నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జిల్లాలో ముందు నుంచి లిక్కర్ స్కాంలో మిధున్ రెడ్డి పేరే ఫోకస్ అయింది. తర్వాత జిల్లాలో ఆ స్థాయిలో ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణ స్వామి పేరు వినిపించింది. వరుసగా ఐదేళ్లపాటు ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి… ఎన్నికల్లో తన కుమార్తె ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారంట. ఫలితాల తర్వాత కుటుంబ సభ్యులతోనే ఆయన గడుపుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు టార్గెట్ గా నోరు పారేసుకున్న నేతల్లో నారాయణస్వామి ముందుండే వారు.
కుమార్తే ఓటమి తర్వాత మౌనంగా ఉంటున్న నారాయణస్వామి
గత ఐదెళ్ళుగా కూటమి నేతలపై అడ్డుఅదుపు లేకుండా విమర్శలు చేసిన నారాయణ స్వామి వదిలి పెట్టే పరిస్థితి లేదంటున్నారంట టీడీపీ నేతలు. కుమార్తె ఓటమి తర్వాత మౌనంగా ఉంటున్న నారాయణస్వామి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో మరింత జాగ్రత్వ పడుతున్నారంట. జిల్లాలో వరుసగా అవినీతి ఆరోపణలు, ఇతర ఘటనలపై పెద్దిరెడ్డి, భూమన, రోజాల చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తోంది. ఇక వంశీ, కాకాణి సహా ఇతర కీలక నేతల అరెస్టుతో ఎందుకొచ్చిన గొడవలే అని నారాయణస్వామి ఇంట్లో నుంచి బయటకు రావడం లేదంట.
ఓటమి తర్వాత జగన్‌ను కలవని నారాయణస్వామి
ఓటమి తర్వాత ఇప్పటివరకు పార్టీ అధ్యక్షుడు జగన్‌ని కూడా నారాయణస్వామి కలవలేదు. జిల్లా వైసీపీ నేతలకు కూడా దూరంగా ఉంటున్నారంట. పెద్దిరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండే నారాయణస్వామి ఆయనపై వరుస విచారణలు జరుగుతుండటంతో ఎక్కడా కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా నోరు విప్పడం లేదంట.. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా చెవిరెడ్డి అరెస్టుతో ఒకసారిగా వైసిపి నేతలంతా ఉలిక్కి పడుతున్నారు. అటు కూటమినేతలకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంట.
Also Read: చికెన్ కర్రీతో నాన్నను సర్‌ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ..
నారాయణస్వామిని టచ్ చేయని సెట్ అధికారులు
ఎక్సైజ్ శాఖ మంత్రిగా అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నడుచుకున్న నారాయణస్వామి చుట్టూ ఉచ్చు బిగిస్తుందని అందరూ భావించారు . అయితే ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ విచారిస్తున్న సీట్ సైతం నారాయణస్వామిని టచ్ చేయలేదు. దాంతో ఎందుకు , ఏంటి అనే ప్రశ్నలు ఇటు వైసీపీలోనూ, అటు కూటమి నేతల్లోను పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. అప్పటికి మంత్రిగా కీలక నిర్ణయాలు అమలు చేసిన ఆయన మెడకు లిక్కర్ స్కాం చుట్టుకోవడం గ్యారెంటీ అనుకుంటే… అందుకు భిన్నంగా జిల్లాకు చెందిన చెవిరెడ్డి అరెస్టు అవ్వడం, ఆ కేసులో ఇంత వరకు నారాయణస్వామి ఊసే లేకపోవడం విచిత్రంగా ఉందంటున్నారు. జిల్లాలోని వైసిపి మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇదే చర్చించుకుంటున్నారంట. మొత్తానికి చెవిరెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా నారాయణస్వామి వ్యవహారం జిల్లా పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
Story By Apparao, Bigtv