నోబెల్ శాంతి బహుమతి. ప్రపంచ శాంతికోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తులకు ఇచ్చే పురస్కారం. అలాంటి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇస్తే ఇక దాని విలువ ఏముంటుంది చెప్పండి. ట్రంప్ వ్యవహార శైలి తెలిసిన ఎవరైనా అనేమాట ఇదే. కానీ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ ఆయన్ ను పాకిస్తాన్ నామినేట్ చేయడం ఇక్కడ విశేషం. గత కొన్నిరోజులుగా ఈచర్చ జరుగుతున్నా.. ఇప్పుడిది అధికారికంగా మారింది. ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైజ్ కోసం పాకిస్తాన్ అధికారికంగా నామినేట్ చేసింది. అసలు నోబెల్ ప్రైజ్ కి ట్రంప్ ని నామినేట్ చేయడమే దారుణం అనుకుంటే, ఆయన్ను నామినేట్ చేసిన దేశం పాకిస్తాన్ కావడం మరింత విచారకరమైన విషయం. నిత్యం పొరుగు దేశంలో అలజడి రేపాలని చూస్తున్నా పాకిస్తాన్, భారత్ లోకి తీవ్రవాదుల్ని పంపి అరాచకం సృష్టించాలనుకుంటున్న పాకిస్తాన్, కాశ్మీర్ ని రావణకాష్టంలా మార్చి రచ్చ చేయాలనుకుంటున్న పాకిస్తాన్.. ఇలా ఒక నాయకుడిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం అత్యంత దురదృష్టకరమైన విషయం.
కాకా పడుతున్నట్టేనా..?
ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ పై ఎప్పట్నుంచో మనసుంది. ఆ విషయం పాకిస్తాన్ కి కూడా తెలుసు. అందుకే ఇటీవల పాకిస్తాన్ కూడా ట్రంప్ కి నోబెల్ ఇవ్వాలంటూ లీకులిచ్చింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ని వాషింగ్టన్ కి పిలిపించి మరీ విందు ఇచ్చారు ట్రంప్. ఈ విందుకి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇరాన్ పై యుద్దం చేయాలనుకుంటున్న అమెరికా ముందుగానే పాక్ లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ట్రంప్ కుటుంబ సభ్యులు చేపట్టిన బిట్ కాయిన్ వ్యాపారానికి కూడా పాక్ సహకారం అవసరం. ఈ అన్ని కారణాలతో ట్రంప్, పాక్ సైనికాధికారిని వాషింగ్టన్ కి పిలిపించి విందు ఇచ్చారు. తనకంటే చాలా చిన్నస్థాయి వ్యక్తితో ఆయన వేదిక పంచుకున్నారు. ఈ మీటింగ్ తర్వాత కూడా నేరుగా పాకిస్తాన్ స్పందించలేదు. అయితే తాజాగా ట్రంప్ మళ్లీ నోబెల్ పీస్ ప్రైజ్ పై ఓ సుదీర్ఘ పోస్టింగ్ పెట్టారు. తనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకివ్వరు అంటూ లాజిక్ తీశారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్టింగ్ వెలువడిన వెంటనే పాకిస్తాన్ ఆయన్ను నామినేట్ చేస్తూ ప్రకటన విడుదల చేయడం విశేషం.
ట్రంప్ పిల్ల చేష్టలు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి నోబెల్ అవార్డుపై ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన చాలాసార్లు పలు వేదికలపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన మరింతగా నోబెల్ కోసం తాపత్రయ పడుతున్నారు. పదే పదే భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానని చెప్పేవారు. దాదాపు 14సార్లు ఆయన ఈ తరహాలో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా అందుకే వేలు పెట్టారు ట్రంప్. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా తానే ఆపేస్తానంటూ గొప్పలు చెప్పుకున్నా అది ఆయనకు సాధ్యమయ్యేలా లేదు. గతంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామాకు నోబెల్ శాంతి ఇవ్వడం ట్రంప్ కి ఏమాత్రం ఇష్టం లేదు. వారందరికీ ఇచ్చి, తనకి ఎందుకివ్వరు అంటూ ఆయన లాజిక్ తీస్తున్నారు. తాను ఆ అవార్డుకి పూర్తిస్థాయి అర్హుడిని అని చెప్పుకునేవారు ట్రంప్.
కాకా పడుతున్న పాక్..
ట్రంప్ మనసు తెలుసుకున్న పాకిస్తాన్, పదే పదే ఆయన్ను కాకాపట్టడానికి ప్రయత్నిస్తోంది. భారత్-పాక్ యుద్ధానికి విరామం రావడానికి కారణం ట్రంప్ ఏమాత్రం కాదంటూ భారత అధికారులు చెబుతుండగా, పాకిస్తాన్ మాత్రం ట్రంప్ కే ఆ క్రెడిట్ ఇస్తోంది. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ ప్రైజ్‌కు పూర్తిగా అర్హుడంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాతే ఆయనకు ట్రంప్ విందు ఆహ్వానం అందింది. ఆ విందు రాజకీయం పూర్తయ్యాక, పాకిస్తాన్ అధికారికంగా ట్రంప్ ని నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడం విశేషం.
హవ్వ.. ట్రంప్ కి ఇచ్చేస్తారా..?
ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు కాదు, ఆయనకు యుద్ధోన్మాదిగా పేరుంది. ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ ని మట్టుబెట్టే కెపాసిటీ తమకుందంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. పన్నుల భారం పెంచుతూ ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధానికి తెరతీశారాయన. అమెరికా నుంచి విదేశీయుల్ని వెళ్లగొట్టే క్రమంలో శాంతిభద్రతల సమస్యకు సృష్టికర్తగా మారారు. అలాంటి తెంపరి ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి అంటే ఊహించడానికే దారుణంగా ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. అందులోనూ ట్రంప్ కి శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ నామినేట్ చేయడం మరింత దారుణం అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.