Special Story on Chakali Ailamma on Death Anniversary: అది దేశమంతా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సమయం. స్వాతంత్య్ర పోరాట వీరులకు జనం నీరాజనాలు పడుతున్నారు. కానీ, ఇటు దక్కన్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ, అది చేపట్టిన కార్యక్రమాల మీద తీవ్రమైన నిర్భంధం అమలైంది. నిజాంను వ్యతిరేకించే ఏ వ్యక్తి, సంస్థనైనా క్రూరంగా అణిచివేయటమే లక్ష్యంగా రజాకార్లు పనిచేశారు. గ్రామాల్లోని దొరల చేతుల్లో చిన్నకులాల ప్రజలు, చేతి వృత్తిదారులు అరిగోస పడుతున్న కాలమది. తెలంగాణ పల్లెల్లోని దేశ్‌ముఖ్‌లు, దొరలంతా నిజాం అనుచరులుగా ఉంటూ అక్కడి భూమితో బాటు ప్రజల మీదా పెత్తనం చేసేవారు. దీంతో వారి దయమీదనే గ్రామంలోని శ్రామిక వర్గాల ప్రజల బతకాల్సిన దుస్థితి. ఆ సమయంలో ఆ దొరల దుర్మార్గాలను ధైర్యంగా నిలదీసి, వారందరికీ దన్నుగా నిలిచిన నిజాంకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించి పోరుబాట పట్టించిన వీరనారి.. ఐలమ్మ.
ఆకలికి అతి చేరువలో ఉండే చాకలి కులంలో 1895లో మల్లమ్మ, సాయిలు దంపతులకు ఐలమ్మ జన్మించింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం ఈమె పుట్టిన ఊరు. అతిపిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సింహతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుటుంబం కావడంతో పూటగడవడం కష్టంగా ఉండేది. వృత్తి పని చేసినా సరైన భుక్తి లేకపోయేది. దీంతో బట్టలు ఉతకటంతో బాటు కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఆ సమయంలోనే 1944లో భువనగిరిలో రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. నల్ల నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి నేతలంతా కలిసి 1945లో పాలకుర్తి కేంద్రంగా ఆంధ్ర మహాసభ శాఖను ఏర్పరిచారు. స్థానిక నేతల మీద నిర్బంధం ఉండటంతో వీరంతా ఐలమ్మ ఇంటినే కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగించేవారు. తొలిరోజుల్లో నేతలు, కార్యకర్తలకు తన ఇంట ఆశ్రయమిచ్చి, భోజన వసతి కల్పించటమే ఐలమ్మ బాధ్యతగా ఉండేది. తర్వాతి రోజుల్లో మహాసభకు గట్టి మద్దతుదారుగా మారింది.
ఆ సమయంలో పాలకుర్తి ప్రాంతానికి రజాకార్ల తరపున ఉపసేనానిగా ఉన్న విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో 60 గ్రామాలలో పాలన సాగేది. ఈ గ్రామాల్లోని వీరి ప్రతినిధులు.. ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకోవడం, ఎదురు తిరిగితే హత్య చేయటం, బాలింతల పాలను పిల్లలకు ఇవ్వకుండా పిండి పారబోయించడం, మహిళల బట్టలూడదీయించటం, వంటి హేయమైన పనులు చేసేవారు. రైతుల పంట పొలాలు, పశువులను లాక్కోవటం, వెట్టిచాకిరీ చేయించుకోవడం, గృహ దహనాలు, లూటీలూ సామాన్య విషయాలుగా ఉండేవి. తన భద్రత, తిరుగుబాటు చేసేవారిని అణిచివేసేందుకు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, విసునూరులో.. రజాకార్లతో మాట్లాడి పోలీస్ స్టేషన్‌నూ పెట్టించాడు. దీంతో గ్రామాల్లోని దొరల బాధితులంతా.. ఆంధ్రమహాసభలో చేరటమో, మద్దతుగా ఉండటమో చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆ దేశ్‌ముఖ్ మహాసభను అంతం చేయాలని కంకణం కట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే 1945 ఫిబ్రవరిలో పాలకుర్తి జాతర వచ్చింది. ఈ జాతరకొచ్చే జనానికి ఆంధ్రమహాసభ ఎజెండాను తెలపాలనే ఉద్దేశంతో పాలకుర్తి కార్యకర్తలంతా ఆరుట్ల రామచంద్రారెడ్డిని అతిథిగా ఆహ్వనించారు. దీనికోసం వారు నిజాం ప్రభుత్వం నుంచి అనుమతీ పొందారు. కానీ, విసునూరు దేశ్‌ముఖ్ ఈ సభ విజయవంతమైతే, జనం తనమీద తిరగబడతారని భావించి, ఆరుట్ల రామచంద్రారెడ్డిని చంపేందుకు 60 మంది గూండాలను పాలకుర్తికి పంపాడు. వారంతా సభా ప్రాంగణంలో రచ్చ చేయటం, రక్షణ కల్పించాల్సిన పోలీసులు దేశ్‌ముఖ్ ఆదేశాల మేరకు మౌనం వహించటంతో ఆ సభ రద్దైంది. దీంతో అక్కడికి చేరిన నేతలు, కార్యకర్తలంతా తలోదిక్కు పోయారు. ఈ సమయంలో దేశ్‌ముఖ్ ప్రతినిధి ఒకరు.. మహాసభ వాలంటీర్ల రక్షణలో ఉన్న ఆరుట్ల రామచంద్రా రెడ్డి తలదాచుకున్న ఇంటిని గుర్తించి, రాత్రివేళ గుండాలతో వెళ్లి ఆ ఇంటిపై దాడిచేశారు. అయితే, వీరి రాకను ముందే గుర్తించిన వాలంటీర్లు ఆ గూండాలపై తిరగబడి,వచ్చిన దేశ్‌ముఖ్ ప్రతినిధి తల పగలగొట్టారు. దీనిపై దేశ్‌ముఖ్.. ఐలమ్మ భర్త నర్సింహ, ఆమె ముగ్గురు కొడుకులు, ఆరుట్ల రామచంద్రారెడ్డితో సహా 12మందిని నిందితులుగా చెబుతూ కేసు పెట్టగా, 10 మందిని అరెస్టు చేసి విసునూరు పోలీసు స్టేషన్‌కు తరలించగా, సుబ్బారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి పాలకుర్తి ప్రాంతంలోని కొండాపురంలోని గిరిజన ఇండ్లల్లో తలదాచుకున్నారు.
Also Read: తెలంగాణ తొలిపొద్దు.. కాళోజీ..!
ఆంధ్రమహాసభ నేతలు, కార్యకర్తలకు స్థానికంగా ఆశ్రయం కల్పిస్తున్న ఐలమ్మను పాలకుర్తిలో ఉండకుండా చేసేందుకు దేశ్‌ముఖ్ మరో ప్లాన్ వేశాడు. పాలకుర్తి గ్రామ పట్వారీని ఆమె ఇంటికి పంపి కుటుంబసమేతంగా నాగళ్లతో వచ్చి తమ పొలాల్లో పనిచేయాలని ఆదేశించాడు. దీనికి ఆమె నిరాకరించగా, రెచ్చిపోయిన పట్వారీ, పాలకుర్తిలోని ఆంధ్రమహాసభ నేతలు, కార్యకర్తల ఇళ్లన్నీ కూల్చివేయటమే గాక వారి పొలాలను స్వాధీనం చేసుకుంటానని బహిరంగంగా హెచ్చరించాడు. దీంతో రెచ్చిపోయిన మహాసభ నేతలు, కార్యకర్తలు గ్రామంలోని పట్వారీ ఇంటిని గునపాలతో కూల్చిపారేశారు. పట్వారీ వీరి దెబ్బకు ఊరు విడిచి పారిపోగా, కార్యకర్తలు ఆ ఇంటిస్థలాన్ని దున్ని మొక్కజొన్న విత్తనాలు నాటటమే గాక, ఆ పంటను ఊరంతా కలిసి ఉమ్మడిగా మంటల్లో వేసి కాల్చుకుతిన్నారు. దీంతో ఐలమ్మ కుటుంబంపై దేశ్‌ముఖ్ పగ మరింత పెరిగింది. ఆ రోజుల్లోనే ఐలమ్మ కులవృత్తి చేసుకుంటూనే, పాలకుర్తిలోని పొలాన్ని కౌలుకు తీసుకొని పంట వేసింది. ఆ పొలం పొరుగూళ్లో ఉండే కొండల్ రావుది.
సరిగ్గా పంట కోతకు వచ్చిన సమయంలో విసునూరు దేశ్‌ముఖ్ ఆ పొలం అసలు యజమానిని బెదరించి ఒక ఒప్పందం రాయించుకున్నాడు. ఆ పొలాన్ని తాను దేశ్‌ముఖ్‌కు కౌలుకివ్వగా, దానిని ఐలమ్మ ఆక్రమించుకుని పండించుకుంటోందన్నట్లు అందులో ప్రస్తావించారు. వెంటనే.. పట్వారీని బందోబస్తుతో పాలకుర్తి పంపి, ఐలమ్మ సాగుచేసే పొలం దేశ్‌ముఖ్ కింద ఉందని, కనుక ఈ పంటమీద హక్కు ఆయనదేనని చాటింపు వేయించాడు. దీన్ని ఐలమ్మ ఆంధ్రమహాసభ కేంద్ర కమిటీ పెద్దలకు చెప్పగా, వారు పంటను కాపాడేందుకు భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్ల ప్రతాప్ రెడ్డి , ఆరుట్ల రామచంద్రా రెడ్డిలను సూర్యాపేట నుంచి పాలకుర్తి పంపారు. వీరు మరో 15 మందితో ఐలమ్మ పొలానికి పోయి, అక్కడ మాటువేసి, పంటకోసేందుకు వచ్చిన దేశ్‌ముఖ్ గూండాల మీద కొడవళ్లు, కర్రలతో దాడిచేసి వారిని నిలువరించారు. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలు కోసి కట్టలు కట్టిన పంటను ఐలమ్మ ఇంటికి చేర్చారు. దొర గుండాలు ఐలమ్మ ఇంటిపై దాడిచేయగా, ఆమె రోకలి బండను చేతబుచ్చుకుని వారిపై తిరగబడటంతో వారంతా పలాయనం చిత్తగించారు.
దీంతో మరోసారి పరాభవానికి గురైన దేశ్‌ముఖ్ ఐలమ్మ కుటుంబీకులను, సూర్యాపేట నుంచి వచ్చిన ఆంధ్ర మహాసభ కార్యకర్తలను అరెస్టు చేయించి, చిత్రహింసలకు గురిచేసినా, ఐలమ్మ ఆంధ్రమహాసభ వెంటే నిలిచింది తప్ప దొరల ముందు తలొంచలేదు. ఈ ఘటనపై నమోదైన కేసును కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టులో వాదించి, ఐలమ్మకు అండగా నిలిచారు. నాడు ఐలమ్మ సాధించిన ఈ విజయం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నిజాం వ్యతిరేకుల్లో గొప్ప స్ఫూర్తిని నింపి హైదరాబాద్ సంస్థానం విముక్తికి బాటలు పరిచింది. నాటి పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు తన పుస్తకంగా వివరంగా ప్రస్తావించగా, దిగ్గజ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య తన జీవిత చరిత్ర ‘విప్లవ పథంలో నా పయనం’లోనూ ప్రస్తావించారు. నిజాంకు వ్యతిరేకంగా ఇంత పెద్ద పోరాటం చేసిన ఐలమ్మకు తర్వాత వచ్చిన ప్రభుత్వాల నుంచి ఎలాంటి గుర్తింపూ దక్కలేదు. చివరికి.. స్వాతంత్య్ర సమరయోధుల ఫించన్‌కూ ఆమె నోచుకోలేదు. ఒక సాధారణ రైతుగా, అత్యంత సామాన్య జీవితం గడిపిన ఐలమ్మ 1985 సెప్టెంబరు 10న.. తన 90వ ఏట కన్నుమూశారు.