Tadipatri Politics: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇవాళ వచ్చింది… థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా గత 16 నెలలుగా ఉద్రిక్తతలు, టెన్షన్ వాతావరణం.. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రిలో ఎంట్రీకి కోర్డు అనుమతితో రెడీ అయ్యి పొలీసు భద్రతతో వచ్చారు పెద్దారెడ్డి, ఇక్కడి వరకు బానే ఉంది.. ఇకపై అక్కడ రాజకీయం ఎలా ఉండబోతుంది? జేసీ ప్రభాకరరెడ్డి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అసలు ఇంతలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి బయటకు ఎందుకు పంపారు?
ఎవరు అధికారంలో ఉన్న నిత్యం రగులుతూ ఉండే తాడిపత్రి
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా, రాజకీయంగా నిత్యం రగులుతూ ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ఇక్కడ యుద్ధం కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈ ఇద్దరి కుటుంబాల మధ్య రాజకీయ పోరాటం సాగుతోంది. 2019 ఎన్నికల వరకు జేసీ కుటుంబం తాడిపత్రి నియోజకవర్గంలో ఆధిపత్యం చూపేది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించడంతో ఈ రాజకీయ యుద్ధం ఉధృతమైంది.
తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ కుమారుడు అస్మిత్‌రెడ్డి విజయం
తాజా పరిస్థితుల నేపధ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా తాడిపత్రిలో విజయం సాధించినప్పటి నుంచి జేసీ కుటుంబానికి ప్రాధాన్యత పెరిగింది. వైసీపీ అధికారంలో ఉండగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై అనుచరులతో దాడి చేసి ఫర్నీచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో లేరు. కుటుంబం మొత్తం హైదరాబాద్ లో ఉన్నారు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య వైరం మరింత ముదిరింది. ఇక ఆ రోజు నుంచి ఇది ఇద్దరి నాయకుల మధ్య కాకుండా రెండు వర్గాల మధ్య వైరంలా మారింది. తాడిపత్రి లో నిత్యం రావణకాష్టంలా రగులుతోంది. 2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మారింది.. JC అస్మిత్ రెడ్డి గెలుపుతో పెద్దారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘర్షణల అనంతరం తాడిపత్రి పట్టణానికి దూరమైన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడానికి సుమారు 16 నెలల సుదీర్ఘ పోరాటం చేశారు.. ఎప్పుడు తాడిపత్రి పట్టణానికి వెళ్లాలి అనుకున్నా జెసి వర్గం అడ్డుకుంటామని ప్రకటించడం, ఆ తర్వాత పోలీసులు శాంతి భద్రతల సమస్యలతో ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు.
తాడిపత్రిలో ఎంట్రీకి పెద్దారెడ్డికి సుప్రీం ఆదేశాలు
వాస్తవానికి ఈ పరిస్థితి జిల్లాలో ఏ నాయకుడికి కూడా లేదు.. నెలకు నాలుగు సార్లు తాడిపత్రి పట్టణానికి వెళ్లాలనుకోవడం అడ్డుకోవడం షరా మామూలు అయింది. ఇక లాభం లేదనుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి ఆదేశాలు ఇవ్వడంతో ఇక తాడిపత్రి పట్టణం లోకి వెళ్లడం ఈజీ అనుకున్నారు. కానీ లాండ్ అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు రిస్క్ తీసుకోలేదు. ఇక ఈ హైకోర్ట్ ఆదేశాలపై జిల్లా ఎస్పీ డివిజన్ బెంచికెళ్లి సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే తీసుకొచ్చారు. దీంతో ఇక పెద్దారెడ్డి తాడపత్రి కి వెళ్లడం కష్టమే అని సొంత పార్టీ నేతలు అలాగే పెద్దారెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. కానీ సుప్రీంకోర్టు తలుపు తట్టడం ద్వారా తాడిపత్రిలో ఎంట్రీకి పెద్దారెడ్డి ఆదేశాలు తెచ్చుకోగలిగారు. దీంతో ఈసారి జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ అడ్డు చెప్పకుండా పెద్దారెడ్డిని సేఫ్‌గా తాడిపత్రిలోని సొంత ఇంటిలోకి అడుగుపెట్టేలా చేశారు.
పెద్దారెసడ్డి యాక్షన్ ప్లాన్ అమలులో సాధ్యమేనా?
ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇకపై తాడిపత్రి పట్టణంలో ఏం జరగబోతుంది అన్నది తీవ్ర ఉత్కంఠ గా మారింది. ఇన్నాళ్లు పట్టణంలో వైసిపి కేడర్ అంతా పెద్దారెడ్డి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసింది. ఇకపై పార్టీ కార్యక్రమాలు చేస్తానని ఆయన ప్రకటించారు.. ప్రకటించడం వరకు ఓకే కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. ఎందుకంటే బలమైన జెసి వర్గాన్ని తట్టుకొని పార్టీ కార్యకర్తలు ఎంతవరకు పెద్దారెడ్డి కార్యక్రమాలకు వస్తారనేది ప్రశ్నార్థకం అవుతోంది..
Also Read: విశాఖలో రెచ్చిపోయిన కీచకులు.. మూగ బాలికపై అత్యాచారం!
తాడిపత్రిలో ఉండేందుకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
ఇలాంటి తరుణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు. శనివారం తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించారు పోలీసులు. అయితే తాజాగా ఆదివారం తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డికి సూచించారు. ఈనెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలను ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రి రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. కేతిరెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అనంతపురం ఎస్పీ జగదీష్‌కు మెయిల్ ద్వారా లేఖ పంపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రి వస్తానని మెయిల్‌లో పేర్కొన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఏదేమైనా 24 గంటలకే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల సూచనలతో తాడిపత్రి నుంచి తన స్వగ్రామం తిమ్మంపల్లికి కేతిరెడ్డి వెళ్లిపోయారు.
Story By Rami Reddy, Bigtv