BigTV English

Telangana BJP: నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ

Telangana BJP: నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ

Telangana BJP: లేక లేక ఓ కొత్త కమిటీ వేస్తే.. దానిపైనా పంచాయతీ మొదలైంది తెలంగాణ బీజేపీలో! కొత్త కమిటీల్లో.. పదవులు ఇచ్చుకున్నారా? పంచుకున్నారా? ఈ నూతన కమిటీల కూర్పులో.. అధ్యక్షుడు రాంచందర్ రావు తన మార్క్ చూపించారా? లేక.. వీటిలో ఆ ఇద్దరి కీలక నేతల హవానే కొనసాగిందా? ఆ ఇద్దరి కోసమే రాష్ట్ర కమిటీ కూర్పు జరిగిందా? కమిటీల కొర్రీ.. కమలం పార్టీని ఏం చేయబోతోంది?
కమిటీ కుంపటి చల్లారేనా?


నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ

మొన్నటి దాకా అధ్యక్షుడి పంచాయితీ, ఇవాళ కమిటీ పంచాయితీ, రేపు ఏ పంచాయితీ రాబోతుందననే భయాందోళనలో కమలం పార్టీ వర్గాలు ఉన్నాయట. ప్రస్తుతం.. రాష్ట్ర బీజేపీలో పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయ్. సరే.. అదలా ఉంచితే, ఎట్టకేలకు బీజేపీ కొత్త స్టేట్ కమిటీని ప్రకటించింది. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, కోశాధికారి, సహాయ కోశాధికారి, చీఫ్ అధికార ప్రతినిధితో పాటు 7 మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించింది నాయకత్వం. ఇందులో.. 11 మంది ఓసీలు, 7 మంది బీసీలు, ఓ ఎస్టీ, ముగ్గురు ఎస్సీలు ఉన్నారు. ఈ కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ప్రకటించిన కమిటీపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయట. పార్టీ లెక్కల ప్రకారం ప్రస్తుత కమిటీల్లో 40 శాతం పాత వారికి, 60 శాతం కొత్త వారికి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రకటించిన జిల్లా కమిటీల్లో.. ఆ నిబంధనలేవీ ఇంప్లిమెంట్ అవ్వలేదని పలువురు నేతల నుంచి, పార్టీ కేడర్ నుంచి అసంతృప్త గళాలు బలంగా వినిపిస్తున్నాయట. జిల్లాల కమిటీల్లో పాత వారిదే పైచేయిగా ఉంది. తాజాగా ప్రకటించిన రాష్ట్ర కమిటీలోనూ పాత నేతల హవా కొనసాగిందనే టాక్ నడుస్తోంది.


29 మంది ఉన్న కమిటీలో 12 మంది సికింద్రాబాద్ నుంచే..

బీజేపీ ప్రకటించిన కొత్త రాష్ట్ర కమిటీతో పాటు, 7 మోర్చాల అధ్యక్షులను కలుపుకుంటే 29 మందికి చేరుకుంటుంది. 29 మంది ఉన్న కమిటీలో 12 మంది సికింద్రాబాద్ నుంచే ఉండటం.. ఇప్పుడు పార్టీలో పెద్ద దుమారమే లేపుతోంది. అంతేకాదు.. అది రాష్ట్ర కమిటీనా? సికింద్రాబాద్ కమిటీనా అంటూ ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన రాజాసింగ్ లాంటి వారైతే ఏకంగా ఆది కిషన్ రెడ్డి కమిటీనా? లేక రాంచందర్ రావు కమిటీనా? అసలైన బీజేపీ కమిటీ ఏది అంటూ ఫైర్ అవుతున్నారు. కేవలం.. సికింద్రాబాద్‌లో ఉన్నవారే బీజేపీనా? గోషామహల్‌లో ఉన్నోళ్లు బీజేపీ కాదా? హిందూ బిడ్డలు కారా? కాషాయ జెండా ఎత్తుకునే కార్యకర్తలెవరూ గోషమహల్‌లో కనిపించలేదా? అంటూ నిలదీశారు.

స్టేట్ కమిటీ విషయంలో దుమ్మెత్తి పోస్తున్న నేతలు

పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగే కాదు మిగతా నేతలు కూడా ఈ కొత్త కమిటీ విషయంలో.. రాష్ట్ర నాయకత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. బీసీ నినాదం ఎత్తుకొని.. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి.. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ప్రకటించి.. కొత్త కమిటీలో మాత్రం.. ఏడుగురు బీసీలకే అవకాశం కల్పించడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయ్. అంతేకాదు.. ఆ ఏడుగురిలోనూ ఇద్దరు మహిళలే ఉండటంపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ప్రధానంగా.. కమిటీల కూర్పులో.. రాంచందర్ రావు మార్క్ అసలే లేదని.. పాత అధ్యక్షుల మార్క్ మాత్రమే ఉందనే టాక్ జోరుగా నడుస్తోంది. జిల్లాల కమిటీలతోనే పార్టీ తలనొప్పులతో సతమతమవుతుంటే ఇకరాష్ట్ర కమిటీ ఏర్పాటు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. కేవలం ఆ ఇద్దరి కోసమే రాష్ట్ర కమిటీ కూర్పు జరిగిందా? ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా.. రామచందర్‌రావు డమ్మీ ప్రెసిడెంటేనా? నడిపేదంతా వాళ్లేనా? అనే చర్చ నడుస్తోందట.

పార్టీ పదవులపై వ్యతిరేక గళవ విప్పుతున్న ఈటల వర్గం

డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ నుంచి వ్యక్తమైన అసహనాలు కూడా నిజమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. ఇటీవలి కాలంలోనే పార్టీలో, పార్టీ పదవులలో తమకెలాంటి చోటు లేదని ఈటల వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేక గళం విప్పిన పరిస్థితులున్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంతేకాదు.. రాంచందర్ రావు ప్రెసిడెంట్‌ అయ్యాక.. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ లాంటి.. ఉమ్మడి జిల్లాల్లో కీలక నేతల మధ్య విభేదాలు భగ్గుమన్న సందర్భాలు ఉన్నాయట. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడి ముందే బాహాబాహికి దిగిన పరిస్థితులున్నాయి. ఇంత జరుగుతున్నా.. కీలక నేతల ఆలోచనలను, అభిప్రాయాలను పట్టించుకోకుండా వార్ వన్ సైడ్ అన్నట్టు రాష్ట్ర కమిటీనీ ప్రకటించడం పట్ల మరోసారి కీలక నేతల మధ్య ముసలం పీక్ స్టేజీకి చేరే అవకాశాలు ఉన్నట్టు టాక్ నడుస్తోందట.

కొత్తగా చేరిన వారికి అన్యాయం జరిగిందనే టాక్

అయితే.. కొత్త కమిటీలో ఒకరిద్దరు పాత కమిటీ సభ్యులకే మళ్లీ అవకాశం ఇవ్వడం మినహాయిస్తే.. మెజారిటీ కొత్త ముఖాలే ఉన్నాయ్. అయినప్పటికీ.. పార్టీకి సంబంధించిన పాత వారే ఎక్కువగా ఉన్నారు. కొత్తగా చేరిన వారి పూర్తిగా అన్యాయం జరిగిందనే టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఆ ఇద్దరి నేతల ఇష్టానుసారమే కమిటీ కూర్పు జరిగిందని, వారికి సంబంధించిన వారికే కమిటీలో అవకాశం ఇచ్చారని, రాంచందర్ రావు మార్క్ ఎక్కడా లేదనేది.. ఇప్పుడు బీజేపీలో రచ్చ లేపుతోందట. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వకుండా, పాకులాడే వారికి పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. కేవలం ఒకరిద్దరి నేతలకు పెద్ద పీట వేసి, మిగతావారికి మొండి చేయి చూపడం పట్ల.. పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారనే చర్చ.. ఇటు పార్టీలోనూ, అటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ జరుగుతోంది. నిత్యం పంచాయితీలతో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీ.. ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.

Also Read: అనంతపురం జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరంటే..!

జిల్లా అధ్యక్షులతో పాటు కమిటీలను మార్చాలనే రచ్చ

జిల్లా కమిటీల కూర్పులో ఆ ఇద్దరు ఎంపీలను మినహాయిస్తే.. మిగతా ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యేల అభిప్రాయాలను రాష్ట్ర నాయకత్వం లెక్కచేయలేదనే చర్చ జరుగుతోంది. దాంతో.. జిల్లా అధ్యక్షుడితో పాటు కమిటీలను మార్చాలనే రచ్చ నడుస్తోంది. కొత్త రాష్ట్ర కమిటీలోనూ ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యేల అభిప్రాయాలను, అభ్యర్థనలను లెక్కచేయలేదనే టాక్ వినిపిస్తోందట. ఇలాగైతే తమను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేమనే అసహనాలు.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే.. అధ్యక్షుడి ఎన్నిక, రాజాసింగ్ రాజీనామా, కొత్త, పాత నేతల మధ్య వర్గపోరు లాంటి పంచాయితీల కుంపట్లే.. చల్లారలేదు. కానీ.. కొత్త కమిటీల రూపంలో.. రాజుకున్న మరో కుంపటి ఎప్పటికి చల్లారుతుందనేది సస్పెన్స్‌గా మారింది. ఈ కమిటీల పంచాయితీ.. నాంపల్లి ఆఫీసులోనే సద్దుమణుగుతుందా? లేక.. కేంద్ర నాయకత్వం దాకా వెళ్తుందా? సైలెంట్‌గా లైట్ తీసుకుంటారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

Story By Anup, Bigtv

Related News

Anantapur Politics: అనంతపురం జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరంటే..!

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

Big Stories

×