Anantapur Politics: ప్రతి నాయకుడు ఓ రాజకీయ పార్టీలో ఉంటాడు. అయితే.. పార్టీలో ఉండటానికి, ఓ పదవిలో ఉండటానికి చాలా తేడా ఉంది. అందులోనూ.. అధికార పార్టీలో ఉంటే.. ఆ లెక్కే వేరు. అందుకే.. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడిందట. కాస్త పేరున్న నాయకులంతా.. అధ్యక్ష పదవి మీదే ఆశలు పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. మరి.. పార్టీ ఏం చేస్తోంది? సామాజిక వర్గాల ఆధారంగా లెక్కలేస్తోందా? అసలేం.. జరుగుతోంది?
ఎల్లో స్వింగ్ ఉంటే దుమ్ముదులిపే తెలుగుదేశం
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట లాంటిది. పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినా.. ఎన్నో కొన్ని స్థానాలు గెలిపించి పరువు నిలబెడతారు ఇక్కడి ప్రజలు. అదే.. ఎల్లో స్వింగ్ ఉంటే మాత్రం.. తెలుగుదేశం దుమ్ము దులిపేస్తుంది. 2014 ఎన్నికల్లో 14 స్థానాలకు గానూ 12 గెలిచి రికార్డ్ సృష్టించింది. ఇక.. వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికల్లోనూ.. రెండు సీట్లు గెలిచింది. మొన్నటి ఎన్నికల్లో.. ఏకంగా 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని.. తన రికార్డ్‌ని తానే తిరగరాసింది టీడీపీ. ఇలా.. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి మంచి పట్టున్న జిల్లాగా పేరొందింది. అయితే.. జిల్లాల విభజన తర్వాత.. ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేసింది అధిష్టానం. గుంతకల్ నియోజకవర్గానికి చెందిన వెంకటశివుడు యాదవ్‌ని.. అనంతపురానికి, వడ్డే అంజనప్పని సత్యసాయి జిల్లాకు అధ్యక్షులుగా ఎంపిక చేశారు.. పసుపు దళపతి చంద్రబాబు. చిన్నాచితక సమస్యలు మినహా.. ఈ ఇద్దరు నేతలు వేరే ఇబ్బందులు లేకుండానే పార్టీని ముందుండి నడిపించారు. ఇప్పుడు.. మరోసారి జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం.. టీడీపీ అధిష్టానం ముగ్గురు రాష్ట్ర నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల.. రెండు జిల్లాల్లో ఆ కమిటీ అధ్యక్ష పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దాంతో.. రెండు జిల్లాల నుంచి అధ్యక్ష పదవుల కోసం ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉందట.
పార్టీలో 15 ఏళ్లు పనిచేసి ఉండాలనే షరతు
ప్రధానంగా సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే.. అధిష్టానం మాత్రం జిల్లా అధ్యక్ష పదవిని ఆశించే వారెవరైనా.. పార్టీలో సుమారు 15 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి ఉండాలనే షరతు విధించిందట. సత్య సాయి జిల్లా నుంచి.. మాజీ మంత్రి పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్.. పల్లె రఘునాథ్ రెడ్డి.. జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే.. 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతూ.. అనేక పదవులు చేపట్టారు. 1999లో నల్లమాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత.. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో.. పల్లె రఘునాథ్ రెడ్డి విజయం సాధించారు. 2014 టర్మ్‌లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు.. మూడేళ్ల పాటు మంత్రిగా, చీఫ్ విప్‌గా పనిచేశారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనూ.. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. అలా.. రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన పల్లె రఘునాథ్ రెడ్డి.. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచారు.
చాలా ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న కురుబ కృష్ణమూర్తి
మరోవైపు.. పెనుకొండ నియోజవర్గానికి చెందిన కురుబ కృష్ణమూర్తి కూడా చాలా ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. వారి కుటుంబం కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తోంది. కృష్ణమూర్తి కూడా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేపట్టారు. ప్రస్తుతం.. ఆయన జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. గతంలో జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా కృష్ణమూర్తి పనిచేశారు. ఇప్పుడు.. సత్య సాయి జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులుగా.. భారీ పరిశ్రమల శాఖ మంత్రి, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీరికి.. జిల్లా అధ్యక్ష పదవి కావాలని కోరుతూ.. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కురుబ కృష్ణమూర్తి వినతి పత్రాలు అందజేశారు.
Also Read: బీ అలర్ట్..! మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
జిల్లా ప్రెసిడెంట్ రేసులో గుండుమల తిప్పేస్వామి
మడకశిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా జిల్లా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ఆయన గతంలో జడ్పీ ఛైర్మన్‌గానూ, ఎమ్మెల్సీగానూ పనిచేశారు. ఈయన కూడా మరోసారి అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని అధిష్టానాన్ని, మంత్రి టీజీ భరత్‌ని కోరారు. ఎంఎస్ రాజు.. తిప్పేస్వామి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఇక.. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంకు చెదిన సామకోటి ఆదినారాయణ.. తనని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని.. మంత్రి టీజీ భరత్‌కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం.. ఆయన సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పార్టీలో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ జిల్లాలో అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మరి.. తెలుగుదేశం అధిష్టానం.. ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
Story By Anup, Bigtv