BigTV English

Gaddar Awards: గద్దర్ అవార్డులకు అర్హుడు కాదా? అసలు కథ ఇదే..

Gaddar Awards: గద్దర్ అవార్డులకు అర్హుడు కాదా? అసలు కథ ఇదే..

జీవితమంతా ప్రజా చైతన్యానికే అంకితం

నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరో.. అంతకాలం ఈ తిరుగుబాటు పాడుతూనే ఉంటాను. నా జాతి.. నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఇదీ గద్దర్ తాను నమ్మిన.. తాను ఆచరించిన సిద్ధాంతం.. తెలంగాణ గోస.. అక్రమ ఎన్‌కౌంటర్లు.. పీడిత పక్షాల అణచివేత.. ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తన గళంతో జనవాణిని పాలకులకు వినిపించాడు. భుజాన గొంగళి వేసుకొని మీ పాటనై వస్తున్నానమ్మో అంటూ.. తెలంగాణ పల్లెల్లో కలియ తిరిగాడు.


అమ్మా తెలంగాణమా అంటూ.. ఆకలి కేకలగానం

పొడుస్తున్న పొద్దోలే.. అణిచివేతకు గురైన బతుకులకు పోరుబాట చూపాడు. పొద్దు తిరుగుడు పువ్వూ పొద్దును ముద్దాడే అంటూ.. చితికిన బతుకులకు తిరుగుబాటును నేర్పాడు. అమ్మా తెలంగాణమా అంటూ.. ఆకలి కేకల గానాన్ని వినిపించాడు. ఒక్కటేమిటి గద్దర్ అంటే అంతో

చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై ఆసక్తి 

ప్రశ్న ఆయనే. జవాబు కూడా ఆయనే. నేనెవరు అని అడిగే వాళ్లకు ఆయన పాట సమాధానం. ఆయన మాట సమాధానం. ఆయన తత్వం సమాధానం. అవును గద్దర్ ఎవరు అని అడిగిన వాళ్లకు ఆయన చేసిన పోరాటం, మలుపు తిప్పిన పాటలు, చైతన్యం చేసిన మాటలే సమాధానం. 1949లో గద్దర్‌ జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. మేస్త్రీ కొడుకుకు రావు అని ఎందుకు అంటూ స్కూళ్లో విఠల్‌గా మార్చారు. చిన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై గద్దర్‌ ఆసక్తిగా ఉండేవారు. సమాజంలో జరిగే పరిణామాలపై స్పందించే గుణం గద్దర్‌ నైజం.

తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలకం గద్దర్

చిన్నతనంలో తన గ్రామంలో వివక్ష అనుభవించారు గద్దర్. పొలాలకు నీరు అందని వాళ్లంతా దొరల పొలాలకు కూలిపనికి పోయేవాళ్లు. అలా చిన్నప్పటి నుంచే సామాజిక పరిస్థితులపై గద్దర్‌కు అవగాహన ఏర్పడింది. ఇక గద్దర్ తాడిత పీడిత వర్గాల్లో చైతన్యం కోసం చేసిన ప్రయత్నాలతో పాటే తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు. బుర్రకథ ద్వారా తెలంగాణ వాదాన్ని ప్రజలకు వివరించారు.

తెలంగాణ పేరు పలకలేని పరిస్థితుల్లో గళం

తెలంగాణ రాష్ట్ర సాధన.. ఓ మహత్తర విజయం. ఈ విజయం వెనుక ఎందరో పోరాటయోధుల త్యాగాలు ఉన్నాయి. అందులో తొలి వరుసలో నిలిచే వ్యక్తి ప్రజాయుద్ధ నౌక గద్దర్‌. 1990వ దశకంలో తెలంగాణ పేరు కూడా పలకలేని పరిస్థితులు ఉండేవి. అలాంటి తీవ్ర నిర్బంధంలోనూ తెలంగాణ తిరుగుబాటు జెండా ఎగరేసిన ధీశాలి గద్దర్‌. తెలంగాణ ఉద్యమానికి తొవ్వ చూపారు. ఆ తర్వాత ఎంతో మంది ఉద్యమంలో మమేకమయ్యారు.

తెలంగాణ పోరాటంలో చెరిగిపోని సంతకం

ఇక మలి దశ తెలంగాణ పోరాటంలో తిరుగులేని, చెరిగిపోని సంతకంగా నిలిచారు గద్దర్. తెలంగాణ తల్లి ముద్దు బిడ్డగా రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చడంలో తన పాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందరినీ కదిలించాయి. అడుగు ముందుకే వేయించాయి. పాటలకే పరిమితం కాకుండా ప్రజా పోరాటాలు నిర్మించారు. తెలంగాణ ఉద్యమం గాడి తప్పుతున్న ప్రతీసారి.. తన గొంతు వినిపించారు. గద్దర్‌ ఒక పిలుపు ఇస్తే.. తెలంగాణ సమాజం ఐక్యం అవుతూ.. ఉద్యమ బాట పట్టింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గద్దర్‌ గొంతు వినిపించారు. అందులో మొదటి పాట పొడుస్తున్న పొద్దు మీద అన్నదే.

తెలంగాణకు జరిగిన అన్యాయంపై పాటలు

పల్లెపల్లెన గద్దర్‌ గజ్జె కట్టి ఆడిపాడారు. అమ్మా తెలంగాణమా అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఆ పాటలో కళ్లకు కట్టినట్టుగా వివరించారు. ఉద్యమంలో ఆ పాట మార్మోగింది. అన్యాయాన్ని ఎదిరించే నైజం.. వివక్షను ప్రశ్నించే తత్వం.. గద్దర్‌ను ప్రజా ఉద్యమాల వైపు నడిపించాయి. పోరాటాల గడ్డ.. ఉస్మానియా యూనివర్సిటిలో చదువుతుండగానే ఆయన వామపక్ష భావజాలంపై వైపు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలోనే ప్రజా ఉద్యమాలను నిర్మించారు. తన జీవిత చరమాంకంలో బ్యాలెట్ పోరును నమ్మారు.

గద్దరిజం ఏంటి? ఆయన మేనరిజం ఏంటి?

పొగడాల్సిన వారిని పొగిడి తీరాల్సిందే. గౌరవం దక్కాల్సిన వారికి దక్కి తీరాల్సిందే. కానీ గద్దర్ విషయంలో అదే జరగడం లేదు. అందుకే గద్దరిజం ఏంటి.. ఆయన మేనరిజం ఏంటన్నది మరోసారి గుర్తు చేసే ప్రయత్నమే ఇది. లెఫ్ట్ భావజాలంతో అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత జన జీవన స్రవంతిలోకి వచ్చి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1997లో ఏప్రిల్‌ 6న ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపితే.. తన శరీరంలో ఒక బుల్లెట్‌ అలాగే ఉండిపోయింది. అది తీసేస్తే ప్రాణాపాయం అని డాక్టర్లు చెప్పడంతో దాన్ని చివరి శ్వాస వరకు అలాగే మోశారు. ఇదంతా ఎందుకోసం.. జనకోసం. వారి విముక్తి కోసం.

రాజ్యాంగం, అంబేద్కర్‌, పూలే స్ఫూర్తితో రాజకీయ యుద్ధం

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. గద్దర్‌ రాజకీయ అభిప్రాయాల్లో మార్పు ప్రకటించారు. తాను మావోయిస్టు పార్టీకి దూరమవుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశారు. రాజ్యాంగం, అంబేద్కర్‌, పూలే స్ఫూర్తితో రాజకీయ యుద్ధం చేస్తానని గద్దర్‌ తెలిపారు. ఇప్పుడు రావాల్సింది ఓట్ల యుద్ధం అంటూ అనేక వేదికలు, ఇంటర్వ్యూల్లో స్పష్టంచేశారు. చిన్నప్పటి నుంచే పాటల పట్ల మక్కువ కలిగిన గద్దర్‌ ఇంజినీరింగ్‌ లో ఉన్నప్పుడు తొలి ఉద్యమ గీతం రాశారు.

1985లో కారంచేడు దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం

మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో గద్దర్‌ నటించారు. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కలిగించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లోనూ గద్దర్‌ ప్రదర్శనలు ఇచ్చారు. గద్దర్ అంటే ఏంటి అన్న వారికి ఆయన జీవిత పోరాటమే సమాధానం.

గద్దర్ పోరాటాలకు బహుమానం కేసులు, నిర్బంధాలు

1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ భహిరంగ సభకు 2 లక్షల మంది హాజరయ్యారు. ఆయనలో ఏ శక్తీ లేకపోతే అంతమంది ఎందుకొస్తారు? గద్దర్‌ పాడిన పాటల్లో అమ్మా తెలంగాణమా అన్న పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని వనరులు, విధ్వంసంపై ఎవరూ మాట్లాడని రోజుల్లోనే గళమెత్తి చాటారు. ఇది చాలదా గద్దర్ కు ఉన్న అర్హత? ఇందుకు బహుమానం ఎన్నో కేసులు. మరెన్నో నిర్బంధాలు. అయినా సరే వాటన్నిటినీ ఛేదించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై గద్దర్ ఒత్తిడి ఉండేది. ఇందుకేనా అవార్డులు వద్దనేది?

గద్దర్ కూతురికి సాంస్కృతిక శాఖ చైర్‌ పర్సన్‌‌ పదవి

గద్దర్ గొప్పతనం తెలిసిన ప్రజాప్రభుత్వం ఆయనను అడుగుడుగునా గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. అంతే కాదు.. సినీ రంగంలో ప్రత్యేకంగా గద్దర్ అవార్డ్స్ తీసుకొచ్చారు. వారి కుటుంబీకులకు చట్టసభల్లో చోటు ఉండాలని కూతురికి టిక్కెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్‌‌గా గద్దర్ కుమార్తెను డాక్టర్‌ గుమ్మడి వెన్నెలను నియమించింది రేవంత్ ప్రభుత్వం.

ఇప్పుడు లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి

అంతెందుకు గద్దర్ చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ రాసిన లేఖ భావం తెలుసుకున్నా చాలా వరకు ఆయన చేసిందేమిటో అర్థమవుతుంది. గద్దర్ చనిపోయినప్పుడు అక్షరాలను పదాలుగా పేర్చి.. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలతో.. అక్షర నివాళులర్పించారు పవన్ కల్యాణ్. ఇది వరకు ధ్వనించే పాటవి.. ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి అంటూ జోహార్ చెప్పారు.. ఎందుకోసం? ఆయన ఉద్యమరూపం. అనంతం కాబట్టే.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×