BigTV English

Places of Worship Act: ఆలయాలు, మసీదులపై సుప్రీ చెప్పిందేంటీ..

Places of Worship Act: ఆలయాలు, మసీదులపై సుప్రీ చెప్పిందేంటీ..

Places of Worship Act:  కొంత కాలంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న టెంపుల్ రన్‌కు సుప్రీం బ్రేక్ వేసింది. అయోధ్య రామాలయం తర్వాత దేశంలోని పలు మసీదులు కూడా హిందూ దేవాలయాలపై కట్టారంటూ ఇటీవల పిటీషన్లు పోటేత్తాయి. ఢిల్లీ, మధుర, కాశీ, సంభల్.. ఇలా ప్రాచీన కట్టడాల చరిత్ర అంతా కోర్టులు ముందు క్యూ కట్టాయి. ఇక, సర్వేలు చేయడంటూ స్థానిక కోర్టులు కూడా ఆదేశాలు పాస్ చేశాయి. దీనితో, ఒక వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో… అత్యున్నత న్యాయస్థానం సంచలన ఆర్డర్ జారీచేసింది. కాశీ-మధురా.. ఇతరత్రా కేసుల్లో భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ, సుప్రీం ఆర్డర్ చెప్పిందేంటీ..? దీనిపై, రెండు వైపుల వర్గాలు ఏమంటున్నాయి..?


దేవాలయాలు, మసీదుల్లో సర్వేలు చేపట్టొదన్న సుప్రీం కోర్టు

శతాబ్ధాల చరిత్ర.. దశాబ్ధాల వివాదాలు.. చరిత్రను తవ్వి తీసి, వివాదాలను పరిష్కరించాలనే ప్రయత్నాలు ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత.. కాశీ, మధుర, సంభల్, ఢిల్లీ, లక్నో.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన ప్రార్థనా స్థలాల వ్యవహారంలో చారిత్రక వివాదాలన్నీ కోర్టు మెట్లు ఎక్కాయి. భారత పురావస్తు శాఖ కింద ఉన్న మసీదుల్లోనూ సర్వేలు నిర్వహించాలని స్థానిక కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి.


దీనితో, ఇటీవల సంభల్ మసీదులో సర్వే నిర్వహించే క్రమంలో హింస చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపధ్యంలోనే తాజాగా సుప్రీం కోర్టు సంచలన ఆర్డర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏ రాష్ట్రంలోనూ దేవాలయాలు, మసీదుల్లో సర్వేలు చేపట్టరాదని స్పష్టం చేసింది.

కొనసాగుతున్న సర్వేలు తాత్కాలికంగా ఆపేయాలని వెల్లడి

భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో ప్రస్తుతం, కాశీ, సంభల్ దేవాలయాల్లో కొనసాగుతున్న సర్వేలను కూడా తాత్కాలికంగా ఆపేయాలని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ కోర్టు అయినా ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లను తీసుకోవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది.

1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు డిసెంబర్ 12న విచారణ చేపట్టింది. సుబ్రహ్మణ్య స్వామితోపాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర అహ్వాద్‌, శరద్‌ పవార్‌, మనోజ్‌ కుమార్‌ ఝా సహా పలువురు నేతలు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ కలిపి విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన స్పెషల్ బెంచ్.. ఆ సర్వే సంబంధిత అంశాలపై 4 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పెండింగ్‌ కేసుల్లో తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని స్పష్టం

ఈ కేసు విచారణ సందర్భంగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు, జిల్లా కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆర్డర్ జారీ చేసింది. ప్రార్థనా స్థలాల్లో సర్వేలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఎలాంటి తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జ్ఞానవాపి, మధుర షాహీ ఈద్గా, సంభల్‌ మసీదు కేసుల్లో విచారణ, సర్వేలకు సంబంధించిన విషయాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రార్థనా స్థలాల్లో సర్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేసేవరకు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు గానీ, నిర్ణయం గానీ తీసుకోలేమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.

అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

అయితే, సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాల‌ను హిందువుల త‌ర‌పున వాదిస్తున్న అనేక మంది లాయ‌ర్లు వ్యతిరేకించారు. త‌మ వాద‌న‌లు విన‌కుండా ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. అయితే, ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్నవాళ్లకు మరో నాలుగు వారాల అదనపు సమయాన్ని సుప్రీం కోర్టు కేటాయించింది. అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రార్థనా స్థలాల చట్టం లోని 2,3,4 సెక్షన్లను తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్‌ వేశారు.

సుప్రీం ఆదేశాలపై మాట్లాడుతూ… హిందువులు చేస్తున్న పోరాటంలో ఇది చాలా చిన్న అడ్డంకి మాత్రమే అంటూ స్పందించారు. మరోవైపు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ముస్లిం తరఫు వర్గాలన్నీ ఆహ్వానించాయి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదనీ.. యావత్ దేశంలో శాంతి నెలకొనడానికి ఈ తీర్పు సహకరిస్తుందని అన్నారు. గత కొన్ని రోజులు, మసీదులు, దర్గాలపై వేస్తున్న పిటీషన్లతో దేశవ్యాప్తంగా ఆందోళనలో ఉన్న ముస్లింలకు కాస్త ఊరట కలిగించిందని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు.. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా హామీ ఇస్తుందని పేర్కొన్నారు.

కాశీ, మధురతో కలిపి మూడు దేవాలయాలు చాలన్న హిందూ వర్గం

అయితే, బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి, 2019 నవంబర్‌లో భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన తర్వాత.. ఇతర హిందూ ప్రార్థనా స్థలాలు, ముఖ్యంగా వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గాల వ్యవహారంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదని కూడా వాగ్దానం చేసింది. ఇక, 2024 జనవరి 22.. రామజన్మభూమి అయోధ్యలో రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజుల తర్వాత… అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి, గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

“భారతదేశంలో ఆక్రమణకు గురైన, ఇతర దేవాలయాలను “విముక్తి” చేయాలనే కోరిక తమకు లేదని.. కాశీ, మధురతో కలిపి మూడు దేవాలయాలు విడిపిస్తే చాలని అన్నారు. ఇతర దేవాలయాల వైపు చూడాలని కూడా కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మూడు దేవాలయాలు లభిస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనీ.. శాంతియుతంగా మిగతా విషయాలన్నీ మరచిపోతాం అని అన్నారు.

ప్రార్థనా స్థలాలు మార్చకూడదని పార్లమెంటు ఏకగ్రీవంగా నిర్ణయం

అసలు, సుప్రీం కోర్టు సంరక్షించాలనుకున్న ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991 ఏం చెబుతోంది..? ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ అభిప్రాయం ప్రకారం చూస్తే… 1947 ఆగస్టు 15 నుండి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి మతపరమైన స్వభావం అలాగే ఉంటుంది. ఇక, వాటిని పరిరక్షించడానికి, ప్రార్థనా స్థలాల మార్చకూడదని పార్లమెంటు ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం.. ఒక నాటి వలసరాజ్యాల పాలనతో సంబంధం లేకుండా.. అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షిస్తాయనే విశ్వాసాన్ని అందించింది.

ఈ చట్టం దేశంలోని ప్రతి పౌరుడితో పాటు రాష్ట్రాలను కూడా ప్రస్తావిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం, ప్రార్ధనా స్థలాల చట్టం ద్వారా దేశానికి వెన్నెముకగా ఉన్న లౌకికవాదం పరిరక్షించబడుతుంది. తిరోగమనం అనేది దేశ పునాదులకు నష్టం వాటిల్లజేస్తుంది గనుక లౌకికవాదంపై నిబద్ధతతో ఉండే విధంగా చట్టాన్ని రూపొందించారు. లౌకికవాదంలో ప్రధాన అంశమైన ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలకు భంగం వాటిల్ల చేయకుండా ప్రార్థనా స్థలాల చట్టం, లౌకిక విలువలను కాపాడే శాసనపరమైన జోక్యంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు.

 

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×