BigTV English

Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్ సాధ్యమేనా? అడ్డంకులు ఉండవా?

Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్ సాధ్యమేనా? అడ్డంకులు ఉండవా?

Jamili Elections: దేశంలో ఇప్పుడు మళ్లీ జమిలి ఎన్నికల టాపిక్ హైవోల్టేజ్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే కేంద్రమంత్రి వర్గం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సెషన్ లోనే బిల్లును పార్లమెంట్ ముందుకు తెస్తున్నారు కూడా. జనంలో అవగాహన కల్పించాలని ప్రధాని మోడీ సహచర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సో ఇవన్నీ జమిలి ఎన్నికల వ్యవహారాన్ని హాట్ డిబేట్ గా మారుస్తున్నాయి. ఇంతకీ వన్ నేషన్, వన్ ఎలక్షన్ సాధ్యమేనా? అడ్డంకులు ఉండవా?


జమిలి సాధ్యమేనా అన్న చర్చ

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు దేశమంతా జరుగుతున్న చర్చ ఇదే. అసలు సాధ్యమవుతుందా.. మోడీ ప్రభుత్వానికి అసలు సంఖ్యాబలం ఉందా? రాజ్యాంగ సవరణలు అంత ఈజీనా.. రాష్ట్రాలు ఒప్పుకుంటాయా.. భవిష్యత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మళ్లీ అసెంబ్లీ డిజాల్వ్ అవ్వాలంటే కుదురుతుందా.. అసలు జమిలి వస్తే ఎప్పుడు వస్తుంది.. ప్రస్తుత లోక్ సభకు 2029 వరకు అవకాశం ఉంది. మరి అప్పటిదాకా ఆపుతారా.. ముందే ఎన్నికలు పెడుతారా ఇలాంటివన్నీ డౌట్లే ఉన్నాయి. అయితే సాధ్యాసాధ్యాలేంటన్నది ఇప్పుడు డీకోడ్ చేద్దాం.


జమిలి విషయంలో 2 బిల్లులకు క్యాబినెట్ ఆమోదం

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని ఏకకాలంలో చేసేలా ఒకటి, ఢిల్లీ సహా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఒకే విధమైన సవరణలు చేసేందుకు వీలుగా ఒకటి రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఈనెల 12న ఆమోదం తెలిపింది. డిసెంబర్ 20న శీతాకాల సమావేశాలు ముగిసేలోపే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత పరిశీలన, విస్తృత చర్చ కోసం పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరగకుండా చూసుకోవడానికి, కోవింద్ కమిటీ లోక్‌సభ కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 83కి అలాగే రాష్ట్ర అసెంబ్లీ కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172కి సవరణలు చేయాలని సిఫార్సు చేసింది.

ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కి సవరణలకు సిఫార్సు

వన్ నేషన్ వన్ ఎలక్షన్ రియాల్టీలోకి రావాలంటే మూడు బిల్లులు ఉంటాయి. క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లుల్లో కేవలం రెండు మాత్రమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఆ రెండు బిల్లులు లోక్‌సభ అలాగే రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించేలా రాజ్యాంగాన్ని సవరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎన్నికల ప్రక్రియలను సులభతరం చేయడానికి ఆర్టికల్ 82A, 83(2), 327లను సవరించడానికి, లోక్‌సభ అలాగే రాష్ట్రాల అసెంబ్లీలకు నిబంధనల ముగింపు వాటి రద్దుకు సంబంధించిన మార్పులు ఈ సవరణలలో ఉన్నాయి. ఆర్టికల్ 327ని కూడా సవరించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పదాన్ని చేర్చుతారు. ఇక మూడో బిల్లు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే అధికారాలను సవరిస్తారు.

324Aని చేర్చడం ద్వారా స్థానిక సంస్థలకు జమిలి అమలు

కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ చేసిన అసలు ప్రతిపాదన రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్ 324Aని చేర్చడం ద్వారా మున్సిపాలిటీలు మరియు పంచాయతీలతో సహా స్థానిక సంస్థలకు జమిలి విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ నిబంధనకు కనీసం సగం రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం కాబట్టి వాయిదా వేశారు. లోక్‌సభ అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు EC ఒకే ఓటర్ల జాబితాను ఉపయోగిస్తోంది. ఈ దశలో ఈ బిల్లులో ఉమ్మడి ఓటర్ల జాబితా లేదా స్థానిక సంస్థల ఎన్నికల బిల్లును ప్రస్తావించలేదంటున్నారు. రాజ్యాంగం 129 సవరణ బిల్లు అనే పేరుతో వచ్చే వారమే బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

జమిలి బిల్లుపై ఉభయసభల్లో సంఖ్యాబలంపై ఉత్కంఠ

కేంద్రపాలిత ప్రాంతాల బిల్లుకు ఉభయ సభల్లో సాధారణ మెజారిటీ అవసరం కాగా, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ అలాగే రాజ్యసభ రెండింటిలోనూ మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్‌సభలో NDA ప్రస్తుత బలం 293. 542 మంది సభ్యులు, ఒక ఖాళీ స్థానంతో మూడింట రెండు వంతుల మెజారిటీ మార్క్ 361 కంటే తక్కువగా ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల మద్దతు ఉంది.

అటు రాజ్యసభలో అధికార కూటమికి 122 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాల ప్రక్రియ పూర్తయిన తర్వాత సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీకి 162 ఓట్లు అవసరం. ఈ పరిస్థితుల్లో బిల్లులు ముందుకెళ్లడం కష్టంగానే ఉంది. ఎన్‌డిఎయేతర పార్టీలను ఒప్పించగలిగితేనే ముందడుగు పడే ఛాన్స్ ఉంది. సో ఈ బిల్లుకు రాజ్యసభలో గండమైతే పొంచి ఉంది.

ప్రధాని మనసులో ఏముందోనని సందేహం

వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇందులో ఉపయోగాలున్నాయి. నష్టాలున్నాయన్న వాదనలు పెరుగుతున్నాయి. అధికార పక్షం జమిలికి జై కొడుతుండగా.. విపక్షం మాత్రం తప్పుబడుతోంది. అసలు ప్రధాని మనసులో ఏముందో అని ఇంకొన్ని పార్టీలు సందేహిస్తున్నాయి. సో మొదటగా అధికార పక్షం చెబుతున్న ఉపయోగాలు చూద్దాం. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుందంటున్నారు. మాటి మాటికి ఓట్లు వేయాల్సిన పని జనానికి తప్పుతుందంటున్నారు.

చాలా సమయం ఆదా అవుతుందన్న వాదన

అలాగే ప్రజలు, ప్రభుత్వం, అధికారుల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఎన్నికలు జరిగి ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే వారు. పాలసీ మేకింగ్ పై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టేందుకు ఛాన్స్ ఉంటుందంటున్నారు. మాటిమాటికీ వచ్చే ఎన్నికల కోడ్ తో అభివృద్ధి పనులకు బ్రేక్ పడకుండా ఉంటుందంటున్నారు. అంతే కాదు.. ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థలకు ఓటు వేయడం అంటే.. జనం కూడా ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు వస్తారని దీంతో ఓట్ల శాతం పెరుగుతుందన్న లాజిక్స్ వినిపిస్తున్నారు. ఇక వేర్వేరుగా జరిగే పోలింగ్ తో బ్లాక్ మనీ పెరుగుతుందని, జమిలితో ఆ నల్లధనం ప్రవాహానికి చెక్ పడుతుందంటున్నారు.

2023 సెప్టెంబర్‌ 2న కోవింద్‌ నేతృత్వంలో కమిటీ

2023 సెప్టెంబర్‌ 2న కోవింద్‌ నేతృత్వంలో జమిలీపై కమిటీ వేసింది మోడీ సర్కార్. 191 రోజులు అందరితో కమిటీ సంప్రదింపులు జరిపింది. మార్చి 14న 18,626 పేజీల రిపోర్ట్ ను కోవింద్ కమిటీ రాష్ట్రపతికి సమర్పించింది. ఈ ప్రక్రియలో మొత్తం 62 పార్టీల అభిప్రాయం కోరింది కోవింద్ కమిటీ. ఇందులో 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి. అందులో 32 పొలిటికల్ పార్టీలు జమిలికి జై కొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఎటూ తేల్చుకోలేని పార్టీలు 15 ఉన్నాయి.

సో కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం 2 దశల్లో దేశంలో ఎన్నికలు నిర్వహించాలి. మొదటి దశలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం, వంద రోజుల్లోలోపే రెండో దశలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి. అన్ని దశల ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా సిఫార్సు చేసింది కమిటీ. ఒకవేళ ప్రభుత్వాలు మధ్యలో కూలితే మిగితా కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యలో పెడితే మధ్యంతర ఎన్నికలుగానే పరిగణించేలా సిఫార్సులు చేశారు.

2027లో గోవా, మణిపూర్, పంజాబ్, UP, ఉత్తరాఖండ్ పోల్స్

ఇక జమిలి ఎప్పటికి అమలులోకి వస్తుందన్నది ఉత్కంఠగా మారుతోంది. కొందరైతే 2027 అంటున్నారు. ఇంకొందరు లోక్ సభ టర్మ్ 2029 దాకా ఉంది కాబట్టి అప్పుడే ఎన్నికలు జరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నారు. సో ఈ రెండింట్లో ఏది నిజమైనా… ఇప్పటి నుంచి జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఏంటన్నది కీలకంగా మారింది. ఒకవేళ ఎన్నికలు జరిగిన 2 ఏళ్లలోనే జమిలి వస్తే ఆ శాసనసభలను డిజాల్వ్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు.

2025లో జార్ఖండ్, ఢిల్లీ, బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 2026 మేలో అసోం, కేరళ, TN, బెంగాల్, పుదుచ్చేరి పోల్స్, అలాగే 2027లో గోవా, మణిపూర్, పంజాబ్, UP, ఉత్తరాఖండ్ పోల్స్ ఉంటాయి. 2027 DECలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉండగా, 2028 మేలో మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక పోల్స్, ఆ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ఎలక్షన్లు ఉంటాయి. సో 2029 టర్మ్ కు దగ్గరగా ఉన్నవి అడ్జస్ట్ చేసే వీలు ఉంది. మిగితా వాటి పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే క్వశ్చన్ మార్కే.

జమిలికి చాలా మ్యాన్ పవర్ అవసరం

ఒకేసారి దేశమంతా ఎన్నికలంటే మాటలు కాదు. దీన్ని సరిగా నిర్వహించడానికి చాలా రోజుల ముందు నుంచి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్ లు రెడీ చేయడం ముఖ్యం. జమిలి పోలింగ్ కోసం చాలా మ్యాన్ పవర్ అవసరం. ఎన్నికల ఫలితాలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్న వాదన ఉంది. చిన్న చిన్న ఎలక్షన్లకే హింస కట్టడి చేయలేని పరిస్థితులు కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉంటున్నాయి. అతి సమస్యాత్మక ప్రాంతాలను ఈసీ ప్రత్యేకంగా గుర్తిస్తుంటుంది. అలాంటిది దేశమంతా ఒకేసారి పోలింగ్ అంటే సున్నిత ప్రాంతాల్లో సెక్యూరిటీ ఒక సమస్య అంటున్నారు.

అమెరికా వంటి దేశాలకే బెటర్ అన్న వాదన

నిజానికి జమిలి వంటివి అధ్యక్ష తరహా పాలన సాగే అమెరికా వంటి దేశాలకు మాత్రమే ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం పనికొస్తుందని కొందరు వాదిస్తున్నారు. అనేక జాతులు, మతాల వారుండే భారత్ కు ఇది పనికిరాదంటున్నారు. లోక్ సభ ఎన్నికలు అనగానే జనం ఒక మైండ్ సెట్ తో ఉంటారు. అసెంబ్లీ పోల్స్ అనగానే మరో లెక్కతో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీర్పు ఇస్తే లోక్ సభ ఎన్నికల్లో మరో తీర్పు ఇచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. సో దీనిపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రెండు చట్ట సభలకు ముడివేయడం ఎంత వరకు కరెక్ట్ అని మరికొందరు అంటున్నారు. నిజానికి జమిలి ఎన్నికలు కొన్ని దేశాల్లోనే అమలు అవుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పార్లమెంటరీ కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ, స్థానిక స్థానాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్‌లో కూడా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్, ప్రావిన్షియల్ లెజిస్లేచర్, స్థానిక సంస్థలకు సెప్టెంబర్ రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. బెల్జియం, నేపాల్ లోనూ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి.

సౌత్ ఆఫ్రికా, స్వీడన్, బెల్జియం, నేపాల్ లో జమిలి పోల్స్

తక్కువ గ్యాప్ లో ఎన్నికలు జరుగుతుంటే… దీర్ఘకాల లక్ష్యాలపై ప్రభుత్వాలు పని చేయవని, ఓటర్లను ఆకట్టుకునే తక్కువ ప్రయోజనాలు కల్పించే పనులు చేసేందుకే మొగ్గుచూపుతాయన్న వాదనను ఇంకొందరు వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల భారాన్ని 100%, అసెంబ్లీల ఎన్నికల భారాన్ని 50% భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికల భారాన్ని 50%, స్థానిక సంస్థల ఎన్నికల భారాన్ని 100% భరించాల్సి వస్తుంది. జమిలి జరిగితే ఈ లెక్కలు మారిపోనున్నాయి.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×