Supreme Court: ఈ దేశంలో ఎవరికీ లేనన్ని వెసులుబాట్లు ప్రజాప్రతినిధులకు ఉన్నాయి. చట్టాలు చేసే వారిగా చట్టసభ ప్రతినిధులుగా వారిదే ఫైనల్. చేసిందే చట్టం, చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంది. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా దోషిగా తేలి ఆరేళ్ల పాటు పోటీకి అనర్హత వేటు తర్వాత తిరిగి మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కుతోంది. ఇది ఎలా సాధ్యం? చట్టాలు ఉల్లంఘించిన వారికి మళ్లీ చట్టాలు చేసే పవిత్రమైన బాధ్యత ఎలా అప్పగిస్తారు? చట్టాలు చేసే వాళ్లు ఎంత పవిత్రంగా ఉండాలి? ఇదీ సుప్రీం కోర్టు ఆందోళన. మరి దేశంలో ఏం జరుగుతోంది?
నేరచరిత్ర ఉంటే పోటీకి లైఫ్ టైమ్ బ్యాన్?
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి నామినేషన్ వేయాల్సిందే. ఇలా సవాలక్ష రూల్స్ ఉంటాయి. అదే ప్రజాప్రతినిధి విషయమే తీసుకుంటే ఎమ్మెల్యేగా ఉంటే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీకి పోటీ చేయొచ్చు. ఇలా వీరికి సవాలక్ష వెసులుబాట్లు ఉంటాయి. ఒకరికి అలా.. ఒకరికి ఇలా.. ఎందుకిలా? రూల్స్ అన్నీ ఇతరులకే. కానీ చట్టసభలకు పోటీ చేసే వారికి మాత్రం ఇవేవీ లేవు. ఒకవేళ తప్పు చేసి కోర్టుల్లో దోషిగా తేలినా సరే ఆరేళ్ల బ్యాన్ ఉంటుంది.
ఆలోచింపజేస్తున్న సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు
ఆ తర్వాత షరా మామూలే. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయొచ్చు. మళ్లీ చట్టాలు చేసే చట్టసభల్లో అడుగు పెట్టొచ్చు. ఇదీ ఇప్పటి వరకు ఉన్న లెక్క. మరి రాబోయే రోజల్లో పరిస్థితి మారుతుందా? లేటెస్ట్ గా సుప్రీం కోర్టు ముందుకొచ్చిన మ్యాటర్ కీలకంగా మారింది. అత్యున్నత న్యాయస్థానం చేసిన కీలక వ్యాఖ్యలు కూడా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
దోషులుగా తేలిన వారిని బ్యాన్ చేయాలని పిల్
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా జరిగిన ఎంక్వైరీలో కీలక వాద ప్రతివాదాలు జరిగాయి. ఒక కొత్త చర్చకు తెరలేచింది.
ఆరేళ్ల తర్వాత పవిత్రంగా అవుతారా?
నేరాలు చేసి, దోషులుగా తేలిన వారు ఆరేళ్ల నిషేధం తర్వాత పవిత్రంగా అయిపోతారా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. చట్టాలు చేసి అవే చట్టాలను ఉల్లంఘించిన వారు మళ్లీ పోటీ చేసేందుకు ఎలా అనుమతిస్తారన్నది సుప్రీం కోర్టు ప్రశ్న. ఇది జనం ప్రశ్న కూడా. సమాజంలో ఎవరికీ లేని వెసులుబాట్లు ప్రజాప్రతినిధులకే ఎందుకు అన్నది స్ట్రైయిట్ పాయింట్.
కేంద్రం, ఈసీ సమాధానం కోరిన సుప్రీం
అసలు మీ అభిప్రాయం చెప్పండి అని సుప్రీం కోర్టు అటు కేంద్రాన్ని, ఇటు ఎన్నికల సంఘానికి సూచించింది. 3 వారాల్లోగా సమాధానం కోరింది. ఒకవేళ కేంద్రం, ఈసీ జవాబు చెప్పకపోయినా ఈ ఇష్యూను ముందుకు తీసుకెళ్తామని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 4 కి కోర్టు వాయిదా వేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి దోషిగా తేలితే, అతడు జీవితాంతం సర్వీసుకు దూరంగా ఉంటాడు. మరి దోషిగా తేలిన వ్యక్తి పార్లమెంటుకు ఎలా తిరిగి రాగలడు? చట్టాన్ని ఉల్లంఘించేవారు చట్టాలను ఎలా తయారు చేయగలరు అని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది వాలిడ్ పాయింట్. దీనిపై ఆలోచన చేయాల్సింది కేంద్రం, ఎన్నికల సంఘమే.
ప్రజాప్రతినిధులపై ఏళ్లకేళ్ల విచారణలపై ప్రశ్నలు
ప్రజాప్రతినిధులపై చాలా కేసులు ఉంటాయి. అందులో తీవ్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటి విచారణ అయితే నత్తనడకన సాగుతున్నాయి. వీటిపైనా సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఏళ్లకేళ్లు ఈ విచారణలు ఏంటని ప్రశ్నించింది. రాష్ట్రాల్లో విచారణ పదే పదే వాయిదా పడుతుందని, అందుకు కారణాలను కూడా చెప్పలేని పరిస్థితి ఉందని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులు ఇంకా ఏర్పాటు చేయని రాష్ట్రాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. అంతే కాదు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని రాజకీయ పార్టీల్లో కీలక పదవుల్లో ఉండకుండా ఎన్నికల సంఘం ఒక నిబంధనను చేయలేదా అని హన్సారియా కోర్టుకు సూచించారు.
8, 9 సెక్షన్ల రాజ్యాంగ చెల్లుబాటుపై సవాలు
అటు న్యాయవాది బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ 2016లో నేరచరిత్ర ఉన్న వారు పోటీ చేసే విషయంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిలో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్ల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేశారు. పొలిటికల్ పార్టీలు క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలను గుర్తించి వారినే ఎందుకు పోటీకి దింపలేకపోతున్నాయన్న పాయింట్ ను వివరిస్తున్నారు. దోషులుగా తేలిన పొలిటీషియన్స్ ను పోటీ నుంచి లైఫ్ టైమ్ బ్యాన్ చేయాలని, వారిపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని ఉపాధ్యాయ్ తరపు లాయర్ సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు.
రాజకీయాల్లో కుట్రపూరిత కేసులు కామన్
ఒకవైపు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు, ఇంకోవైపు పిటిషన్ల సంగతి ఒకలా ఉంటే.. రాజకీయ వర్గాల వాదన మరోలా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థిని అణగదొక్కేందుకు కక్షపూరితంగా కేసులు పెడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంటుందంటున్నారు. అటు క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు ఎన్నికల్లో పోటీ చేయడం లేదా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంపై లైఫ్ టైమ్ బ్యాన్ విధించాలనే ఆలోచనను 2020 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో తిరస్కరించింది.
2019లో రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యల ప్రస్తావన
1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 కింద చట్టసభ సభ్యులకు జైలు శిక్ష అలాగే ఆ తర్వాత ఆరేళ్ల పాటు అనర్హత వేటు సరిపోతుందని ప్రభుత్వం వాదించింది. వారు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉంటారని నాడు ప్రస్తావించింది న్యాయశాఖ. అంతే కాదు కేంద్రం తన వాదనను బలపరిచేందుకు 2019 పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని 2024లో గుర్తు చేసింది. రాజకీయాలను నేరంగా పరిగణించడం అనేది చేదు నిజమని, ఏది ఏమైనా కోర్టులు చట్టాలను చేయలేవన్న విషయాన్ని ప్రస్తావిస్తోంది కేంద్రం.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5 వేల క్రిమినల్ కేసులు పెండింగ్
సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాదాపు 5 వేల క్రిమినల్ కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఇంత జరిగాక కూడా 42 శాతం లోక్ సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని, అవి గత 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. ఒకసారి వారు చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే, వారు ఆ పదవిని నిర్వహించడానికి శాశ్వతంగా అనర్హులు కావాలని, అనర్హత కాలాన్ని పరిమితం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్న సమానత్వ నిబంధనను ఉల్లంఘించడమే అని హన్సారియా వాదించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం 8, 9 సెక్షన్లకు సవాల్
అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాల్లో దోషులుగా తేలిన 46 నుంచి 48 శాతం మంది 2-3 ఏళ్ల శిక్ష అనంతరం ఎంపీ/ఎమ్మెల్యేగా ఎన్నికై తిరిగి చట్టసభలకు వస్తున్నారని.. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్లకు సవాల్‌గా పరిణమించిందని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ వికాస్ సింగ్ అంటున్నారు. అన్ని పార్టీలూ నేరచరితులను పార్లమెంటుకు పంపుతూనే ఉన్నాయంటున్నారు. శిక్ష పడ్డవారు పార్టీ పదవుల్లో ఉండరాదంటూ ఈసీ స్పెషల్ గా గైడ్ లైన్స్ జారీ చేయవచ్చన్నారు అమికల్ క్యూరీ. దీనిపై జస్టిస్ మన్మోహన్ స్పందిస్తూ.. శిక్షపడిన వారు పార్టీ పదవుల్లో ఉండొద్దని చెబితే వారు తమ భార్యల ద్వారానో, మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్‌తోనో పార్టీని నిర్వహిస్తారని చెప్పడం ఇక్కడ వ్యవస్థల్లో ఏం జరుగుతుందన్నది తేలుతున్న విషయం.ప్రజాప్రతినిధుల
కేసులు హైకోర్టుల్లో పర్యవేక్షణ
అటు ప్రజా ప్రతినిధులపై కేసులను వేగంగా పరిష్కరించే విషయాన్ని హైకోర్టులే పర్యవేక్షించాలని 2023లో నాటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించింది. ఆ కారణంతో ఆ అంశాన్ని తమ ద్విసభ్య బెంచ్ రీ-ఓపెన్ చేయడం సరైంది కాదని, దీన్ని విస్తృత ధర్మాసనానికి అప్పజెప్పాల్సిందిగా సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు నివేదించాలని సుప్రీం న్యాయమూర్తులు నిర్ణయించారు. నిజానికి ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పెండింగ్ లో పడడానికి చాలా కారణాలుంటున్నాయి.
నిందితులు హాజరు కాకపోవడం
ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కోలా కనిపిస్తోంది. నిందితులు హాజరు కాకపోవడం, పదే పదే వాయిదాలు కోరడం, సాక్షులు సకాలంలో రాకపోవడం ఇలాంటి విషయాలపై వాద ప్రతివాదాలు నడిచాయి. అయితే సుప్రీం ధర్మాసనం రౌస్ అవెన్యూ కోర్టు ప్రొసీడింగ్స్ ను ప్రస్తావించింది. రాజకీయ నాయకులపై కేసుల విచారణ అక్కడ స్పీడ్ గా జరుగుతోందని ప్రస్తావించింది ద్విసభ్య ధర్మాసనం.
543 మందిలో 251 మంది నేరచరితులు: ADR
లోక్‌సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ ADR రిపోర్ట్ ఇచ్చింది. ఈ 251 మందిలో 27 మంది ఆల్రెడీ దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో లోక్ సభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ చెబుతోంది. అందుకే ఈ సబ్జెక్ట్ హాట్ టాపిక్ గా మారుతోంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ ఇప్పటికే రిపోర్ట్స్ ఇచ్చింది.
ఇంటర్ లింక్ గా కేసులు, రాజకీయాలు
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నాలుగు ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం నుంచి మొత్తం 53 మంది పోటీ చేస్తే వారిలో 34 మంది నేరచరితులేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారి అఫిడవిట్లు పరిశీలించి జనానికి ముందే సూచనలు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 12 మంది, బీజేపీలో 12, బీఆర్‌ఎస్ 9, మజ్లిస్‌కు చెందిన ఒక అభ్యర్థిపై కేసులు ఉన్నట్లు తేల్చింది.
ఫ్రేమ్ వర్క్ రావాల్సిన అవసరం ఉందా?
సో కేసులు, రాజకీయాలు ఒకదానికొకటి ఇంటర్ లింక్ గా ఉంటున్నాయి. అసలు కేసులు లేని వారు లీడర్లు ఎలా అవుతారని ప్రశ్నించే వారూ ఉన్నారు. అవి కక్షసాధింపు కేసులైనా, మరొకటైనా. పాలిటిక్స్ లోకి వస్తే అన్నటినీ ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాల్సిందే అన్న పాయింట్ కూడా చర్చకొస్తోంది. సో ఒక ఫ్రేమ్ వర్క్ రావాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. మిగితా పనులు వేరు.. చట్టాలు చేసే చట్టసభలు వేరు. అక్కడ చట్టాలను ఉల్లంఘించే వారు ఉంటే సమస్యలు పెరుగుతాయన్నది ప్రజాస్వామిక వాదుల ఆందోళన. మరి ఈ విషయంలో కేంద్రం, ఎన్నికల సంఘం, అత్యున్నత న్యాయస్థానం ఎలా ముందుకు వెళ్తాయి.. విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుంది.. పోటీ చేసే విషయంలో ఎలాంటి కొత్త రూల్స్ వస్తాయన్నది తేలాల్సి ఉంది.