Bjp on Jagan: వైసీపీ అధినేత జగన్ కు కష్టాలు పొంచి ఉన్నాయా? లిక్కర్ వ్యవహారం ఆ పార్టీని వెంటాడుతోందా? ఏపీకే పరిమితమైన మద్యం వ్యవహారం.. లోక్‌సభలో ప్రస్తావన రావడం వెనుక ఏం జరిగింది? మద్యం వ్యవహారాన్ని బీజేపీ ఎంపీలు కేంద్రం దృష్టికి తెచ్చినట్టేనా? కేంద్రం నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని సైలెంట్‌గా ఉంటుందా? సీబీఐ, ఈడీ గానీ రంగంలోకి దిగే అవకాశముందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో జరిగిన మద్యం సేల్స్ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఆపై విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత లిక్కర్ తయారు చేసే కంపెనీలపై అధికారులు సోదాలు చేశారు. చాలావరకు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. తమదైన శైలిలో వివరించే సరికి ఉన్న కొద్దిపాటి ఆధారాలను అధికారులకు ఇచ్చినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ తర్వాత కీలక విషయాలు వెల్లడి అయ్యాయి.
ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ప్రత్యేకంగా సిట్ వేసింది చంద్రబాబు సర్కార్. ఆల్రెడీ సిట్ సభ్యులు రంగంలోకి దిగేశారు. రేపో మాపో కొందరికి నోటీసులు ఇచ్చి విచారించాలనే ఆలోచన చేస్తోంది. గత ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కూటమి పార్టీలు దీన్ని తమ రాజకీయ అస్త్రంగా మలచుకున్నాయి. అప్పట్లో ఏపీ బీజేపీ నేతలు దీనిపై కేంద్రానికి ఓ నివేదిక కూడా ఇచ్చారు. ఆ విషయాన్ని కాసేపు పక్కన బెడదాం.
ఇదే వ్యవహారాన్ని ఏపీ బీజేపీ ఎంపీలు మంగళవారం లోక్‌సభలో ప్రస్తావించారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మద్యం వ్యవహారాన్ని సభలో ప్రస్తావించారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కంటే పది రెట్ల కుంభకోణం ఏపీలో జరిగిందని సభ దృష్టికి తీసుకెళ్లారు. 2019-24 మధ్యకాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని ప్రైవేటు నుంచి ప్రభుత్వ దుకాణాలకు మార్చిందని గుర్తు చేశారు.
ALSO READ: విజయసాయిరెడ్డి ప్లేస్‌లో పేర్ని నాని.. జగన్ కీలక నిర్ణయం
ఐదేళ్లలో లక్ష కోట్ల అమ్మకాలు జరిగాయని, అవన్నీ నగదు రూపంలో తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కుంభకోణం విలువ అక్షరాలా 30 వేల కోట్ల రూపాయలని ఉంటుందని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన 2 వేల లిక్కర్ స్కామ్ లో అప్పటి సీఎం, డిప్యూటీ సీఎంలను అరెస్ట్ చేశారన్నారు. మరి ఏపీలో జరిగిన కుంభకోణం మాటేంటని ప్రశ్నించారు. దీనివెనుక ఎవరెవరు ఉన్నారనేది తెలియాలంటే కచ్చితంగా విచారణ జరపాల్సిందేనని ఎంపీలు లేవనెత్తారు.
ఇదే అంశంపై ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో ఓ బీజేపీ నేత నోరు విప్పారు. ఈ విషయంలో తాము ఎవర్నీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీని ఎవరూ మేనేజ్ చేయలేరన్నారు. తప్పు చేసినవారు చట్ట రీత్యా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారని మనసులోని మాట బయటపెట్టారు. తప్పు చేసినవారిని మోయాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో అధికారుల పాత్ర ఉందన్నారు.
లిక్కర్ మేకింగ్ ఫార్ములా ఫాలో కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని పణ్నంగా పెట్టారని గుర్తు చేశారాయన. మరి ఏపీలో లిక్కర్ వ్యవహారంపై కేంద్రం దృష్టి పెడుతుందా? ప్రత్యర్థులపై ఇలాంటి ఆరోపణలు సహజమేనని సైలెంట్ గా ఉంటుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయి. ఒకవేళ కేంద్ర సంస్థలు రంగంలోకి దిగితే కేజ్రీవాల్ మాదిరిగా జగన్ జైలుకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు కొందరు నేతలు.