BigTV English

TDP Cadre Angry On Party: మీ ఇష్టమేనా.. కూటమి పై క్యాడర్ ఫైర్ ?

TDP Cadre Angry On Party: మీ ఇష్టమేనా.. కూటమి పై క్యాడర్ ఫైర్ ?

ఏపీలోని కూటమి పార్టీల్లో వైసీపీ నేతల చేరిక అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు నేతలు.. స్వార్ధం కోసమో, రాజకీయ భవిష్యత్తు కోసమో తెలియదు కానీ.. కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అధికారం లేకో.. తాత్కాలిక అవసరాల కోసం YCPని వీడుతున్నారట. ఇక్కడివరకూ ఓకే. నేతలను చేర్చుకునే విషయంలో.. కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

పార్టీ బలోపేతం కోసం ఎవరిని పడితే వారిని చేర్చుకోవటం.. ఆయా పార్టీల క్యాడర్‌కు మింగుడుపటడం లేదట. కేసుల భయమో.. విచారణ ఎదుర్కోవలసి వస్తుందనో తెలియదు కానీ.. కొందరు నాయకులు ఫ్యాన్ పార్టీని వీడి.. కూటమి పార్టీల్లో చేరుతుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయట. కొందరు వైసీపీ నేతలు.. కూటమిలోని పార్టీల్లోకి రావడాన్ని.. ఐదేళ్ల పాటు ఫ్యాన్‌ పార్టీతో పోరాటం చేసిన క్యాడర్‌కు నచ్చడం లేదట. ఇదే అంశాన్ని సదరు నేతలు.. వారి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.


సూటిపోటి మాటలు, చేష్టలతో.. ఆనాడు తమకు బాధపెట్టిన వారంతా.. ఇప్పుడు తమతో పాటు కూటమి పార్టీలో ఉండటాన్ని కొందరు కార్యకర్తలు సహించుకోలేకపోతున్నారట. నాడు తమపై అక్రమ కేసులు, అరెస్టులతో వేధించిన వారంతా.. ఒక్కొక్కరుగా వైసీపీకు రాజీనామా చేసి.. తెలుగుదేశం, జనసేన, BJPను ఆశ్రయిస్తున్నారు. కొందరైతే.. ఇప్పటికే.. మూడు పార్టీల్లోని ఏదో ఒకదాంట్లో సెటిలైపోయారు.

కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నించి.. సాధ్యమైతే అక్కడ.. కాకపోతే జనసేన.. లేదంటే బీజేపీ అన్నట్లుగా వీరి చేరికలు ఉంటున్నాయి. ఇలా..YCP నుంచి వస్తున్న వారిలో ఎవర్ని చేర్చుకోవాలి. ఎవర్ని చేర్చుకోకూడదనే అంశంపై మల్లగుల్లాలు సాగుతున్నాయట. ఎలాంటి వారిని చేర్చుకుంటే ఆయా పార్టీలకు ఉపయోగం అనే విషయంలో కూటమి నేతల మధ్య అంతర్గతంగా చర్చ జరగట్లేదట. ఈ విషయంలో వారి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని.. మూడు పార్టీల క్యాడర్ భావిస్తోందని టాక్.

మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో మొదలు పెట్టి… విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి ఆనంద్‌కుమార్‌ వరకూ కొన్ని నెలలుగా జరిగిన వైసీపీ నేతల చేరికలే.. దీనికి నిదర్శమని కూటమి పార్టీల క్యాడర్ భావిస్తోందట. ఇలాంటి విషయాలు చర్చించుకునేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీని.. ఎన్నికల తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారని, అడపాదడపా.. మూడు పార్టీల అగ్రనేతలూ సమావేశం కావటం తప్ప..పార్టీల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరగడం లేదనేది శ్రేణుల అభిమతంగా తెలుస్తోంది. బలోపేతం పేరుతో ఇష్టానుసారంగా నేతలను చేర్చుకుంటే.. వారితో సఖ్యతగా మెలగటం.. తమకు కష్టంగా మారుతుందని.. శ్రేణులు బహిరంగంగానే చెప్పేస్తున్నాయట. దీంతో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

కొంతమందిని చేర్చుకోవటాన్ని పార్టీ క్యాడర్ వ్యతిరేకించిన దాఖలాలు లేవు. వారి వల్ల ఆయా పార్టీలు బలోపేతం అవుతాయంటే తాము సర్ధుకుపోతామనేది శ్రేణుల భావనగా తెలుస్తోంది. అయితే.. పార్టీలోకి రావటం.. తర్వాత కీలకమైన పదవుల్లోనూ వారు కూర్చోవటం మాత్రం తమకు మింగుడుపడటం లేదని.. ఆయా పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. TDP ఆవిర్భావం తర్వాత.. మొదట్లో కొన్ని సంవత్సరాలు తప్ప.. నాలుగు దశాబ్దాల్లో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవటం ఇదే తొలిసారి.

మోపిదేవి వెంకటరమణరావు, బీద మస్తాన్‌రావు.. వైసీపీ సహా వారి పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరడం.. ఆ రెండు స్థానాల నుంచి తెలుగుదేశం అభ్యర్థులు ఎంపికవడంతో ఆ లోటు భర్తీ అయింది. అందుకే వారిని చేర్చుకోవడాన్ని పార్టీ ప్రయోజనం కోసమేనని క్యాడర్ భావిస్తోందట. ఎవర్ని చేర్చుకోవాలన్నా.. మూడు పక్షాలు కూర్చుని నిర్ణయించుకోవాలని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో అది జరగడం లేదని.. ఫ్యాన్ పార్టీ నుంచి నేరుగా వచ్చేస్తున్న వారంతా… ఎవరో ఒక బలమైన నేతలు పట్టుకుని… ఆయా పార్టీల్లోకి చేరటం మాత్రం సరైందని కాదనేది శ్రేణుల మాటగా తెలుస్తోంది.

వైసీపీ హయాంలో TDP క్యాడర్‌ను తీవ్రంగా వేధించిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. NDA అధికారంలోకి వచ్చాక జనసేనలో చేరిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌పై.. అప్పట్లో ఆయన 23 అక్రమ కేసులు పెట్టించారని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కేసులోను 30 నుంచి 60 మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఉన్నారట. చంద్రబాబుని.. జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులో జైలుకి పంపినప్పుడు ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 18 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి.. రిమాండ్‌కి పంపించారట. వారంతా ఇప్పుడు కోర్టుకి తిరుగుతుండగా.. కబ్జాలు, అవినీతి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలినేని మాత్రం జనసేనలో చేరిపోయారని క్యాడర్‌లో చర్చ జోరుగా సాగుతోంది.

Also Read: బాబు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నెల్లూరు గేమ్ ఛేంజర్స్

NTR జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను.. వైసీపీ హయాంలో మట్టి అక్రమ రవాణా, ఇసుక, మద్యం తరలింపువంటి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనసేనలో చేరిపోయి.. ఏకంగా ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా అవతారమెత్తారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య.. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులపై తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడ్డారట. ఆయన కోట్లలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో రోశయ్య.. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే జనసేన గూటికి చేరారు.

ఇటీవలి ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడారి ఆనంద్‌కుమార్‌.. విశాఖ డెయిరీలో తీవ్రస్థాయి అవకతవకలకు పాల్పడినట్టు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. డెయిరీలోని అక్రమాలపై విచారణకు శాసనసభా సంఘాన్ని కూడా నియమించారు. ఆనంద్‌ను కఠినంగా శిక్షించాలని స్పీకర్‌ సహా అందరూ కోరుతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు సభాసంఘం ఎవర్ని విచారించాలి. కూటమి పార్టీలేనా.. అనే ప్రశ్నలు కేడర్‌ నుంచి వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని కూడా ఒక దశలో బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధపడటం హాట్ టాపిక్‌గా మారింది.

జగన్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని.. తెలుగుదేశంలో చేరేందుకు అంతా సిద్ధమైన దశలో స్థానిక కేడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆపారు. తర్వాత కాలంలో ఆయన సభ్యత్వం కూడా తీసుకున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీమంత్రులు అవంతి శ్రీనివాస్, శిద్ధా రాఘవరావు వంటి నేతలు.. వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరేందుకు క్యూలో ఉన్నారట. దీనిపై ఆయా పార్టీ అధినేతలు చర్చించుకోవాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవటం తప్ప.. కూటమి నేతల అభిప్రాయాలు తీసుకున్న దాఖలాలు లేవనే భావనలో కూమిట శ్రేణులు ఉన్నాయట. కూటమి గెలిచిన కొత్తలో.. తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్. బీజేపీ నుంచి సత్య కుమార్. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కూర్చొని మాట్లాడుకునేవారు. కొంతకాలంగా సమావేశం జరగకుండా ఎవరికి నచ్చిన వారిని వారు ఆ పార్టీలో చేర్చుకుంటున్నారట. లోకేష్ మాత్రం చేరికలు విషయంలో మనతో సంప్రదింపులు జరుగుతున్నాయని మంత్రులతో అనటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రులకి లోకేష్ సూచన కూడా చేశారట. అంతిమంగా వైసీపీని దెబ్బతీయటమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందా లేదా సొంత బలాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోందా అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×