ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయం విలక్షణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులను తలకిందులు చేసిన సంవత్సరంగా.. 2024ను చెప్పుకోవచ్చు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది అంటే.. 50 శాతం రాజకీయాలకు కొత్త మొహాలేనట. గతంలో ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలుపొందడం ఇదే ప్రథమం. ఇలా అనేక కోణాల్లో రాజకీయ దర్పాన్ని ప్రదర్శించిన నేతలు.. నేడు పత్తా లేకుండా పోయారట. కూటమి పార్టీల తరఫున పోటీ చేసి ప్రచారాల్లో పాల్గొన్న నేతలు అధికారాన్ని చేజిక్కించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇలా 2024 కొందరు నేతలకు తీపిగానూ.. మరికొందరికి చేదుగానూ మారిందనే టాక్ నడుస్తోంది.
2024లో తెలుగుదేశం పార్టీతో.. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు జతకట్టాయి. మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయటం.. ఆయా పార్టీ అభ్యర్థులకు కలసివచ్చింది. క్షేత్రస్థాయిలో పటిష్టంగా లేని జనసేన పార్టీ.. కూటమి తరపున భాగస్వామిగా ఉండటంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. విశ్లేషకుల అంచనాలను తలకిందులుగా చేస్తూ కూటమి తరపున పోటీ చేసి జనసేన.. మంచి మైలేజ్ ని అకౌంట్లో వేసుకుందట. ఈ పార్టీతో పాటు బీజేపీ నేతలకూ మంచి గుర్తింపు వచ్చిందనే టాక్ నడిచింది.
నామినేటెడ్ పోస్టుల్లోనూ ఆయా పార్టీల నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న YCP నేతలు పత్తా లేకుండా పోతున్నారంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. అనుహంగా తెరపైకి వచ్చిన నేతలను.. ప్రజలు ఓట్లతో అందలం ఎక్కిస్తే.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నేతలు ఓటమి చవి చూసి ఇళ్లకే పరిమితమయ్యేలా 2024 చేసిందనేది పొలిటికల్ వర్గాల టాక్.
రాజకీయ సదస్సులను వేదికగా చేసుకుని నెల్లూరు యాసతో.. మీసం మేలేసి తొడలు కొట్టిన మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఘోర ఓటమి తర్వాత పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా బదులిచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. చూద్దామన్నా కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. YCP అధినేత జగన్ తర్వాత ఆ పార్టీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డికి కూడా పరాభవం తప్పలేదు. ఎంపీగా పోటీ చేసిన ఆయన… ఘోర పరాజయంతో జిల్లాను విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా 2024.. అధికారంలో ఉన్న వైసీపీ నేతల తలరాతలు మార్చిందనే ప్రచారం సాగుతోంది.
Also Read: పాడేరు పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
కూటమి అభ్యర్థుల విషయంలో మాత్రం ఊహించని దానికంటే మెరుగైన రిజల్ట్ వచ్చాయట. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల విషయానికి వస్తే.. అసలు రాజకీయాలకు కొత్తవారితో పాటు ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయని వారూ గెలుపు సాధించటం హాట్ టాపిక్‌గా మారిందట. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కొత్తవారు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూర్తిగా బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన నేతలు కాగా.. వీరు గెలుపొందారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుతం మంత్రి పొంగూరు నారాయణ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో ఐదుగురు తొలిసారిగా రాజకీయాల్లో పోటీ చేసిన కొత్త మొహాలేనట.
ఇలా.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు 2024 బాగా కలిసి వచ్చిందనేది పొలిటికల్ వర్గాల టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్లో జిల్లాకు చెందిన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయశాఖమంత్రిగానూ, పొంగూరు నారాయణకు మున్సిపల్ శాఖ మంత్రిగా పదవులు దక్కాయి. నామినేటెడ్ పోస్టుల్లోనూ మూడు పార్టీల నేతలకు సముచిత స్థానం దక్కిందట.
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అబ్దుల్ అజీజ్.. నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్‌గా వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి అవకాశం దక్కింది. ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఆనం వెంకటరమణారెడ్డి, టిడ్కో చైర్మన్‌గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్‌గా బీజేపీ నేత సన్నపరెడ్డి సురేష్ రెడ్డికి అవకాశం దక్కింది. పదవీయోగం ఉండాలే కానీ.. ఎప్పుడైనా.. ఎక్కడైనా తప్పక వరించి తీరుతుందని రాజకీయ పండితులు చెప్పుకుంటున్నారు.