బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైదారాబాద్‌కి చేరుకోగానే విచారణ ప్రారంభం కానుందని చెపుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో ఎవరు స్పందించకపోయినా పెద్దాయన పోచారం మాత్రం స్పందించారు. గతంలో ఇదే అంశంలో వివరణ అడిగితే కోపంతో వెళ్లిపోయిన ఆయన ఇప్పుడు తెలివిగా బదులు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండగా నలుగురికి సంబంధించిన విచారణ షెడ్యూల్న్ మాత్రమే స్పీకర్ గతంలో ప్రకటించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకటరావుపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై నెలాఖరులోగా స్పీకర్ విచారణ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే కోర్టు విధించిన అక్టోబర్ 30 గడువులోగా విచారణ పక్రియ ముగిసే అవకాశం కనిపించడం లేదు.
స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం తెలివిగా బదులు ఇస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి దుర్మార్గపు పనులకు పాల్పడలేదని, ప్రజల కోసమే పనిచేశానని, కొందరు పనిగట్టుకుని తనపై నిరాధా రమైన ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ తాను స్వార్థం కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెప్పుతో కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
ఇటీవల బాన్సువాడలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం పోచారం మీడియాతో మాట్లాడారు. కొందరు ప్రత్య ర్థులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏదో ఆశించి, స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్ర చారం చేస్తున్నారని అంటున్నారు. అలాంటి వారికి రాజకీయపరమైన సమాధానం ఇస్తున్నానని పోచారం ఘాటు గానే స్పందించరు. తనకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని, కేవలం ప్రజల కోసమే, తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిశానంటున్నారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.500 కోట్ల పనులను తన కార్యకర్తలు చేశారని, వాళ్లకు దానికి సంబంధించిన బకాయిలు అందక నిద్రలేని రాత్రులు గడిపామని, ఇంకా వేరే నిధులు కూడా రావాల్సి ఉందని, రేవంత్ రెడ్డితో కలిసి కొంత ఇప్పించగలిగానని పోచారం వివరణ ఇస్తున్నారు. ప్రజల కోసమే పని చేశా… ప్రజలే తన కుటుంబ సభ్యులు అనుకున్నా కాబట్టే తాను అట్లానే బతుకుతా అని పోచారం అంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలని, నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అడగగానే అనేక నిధులను ఇచ్చి బాన్సువాడ అభివృద్ధికి సహకరించారని… ఇప్పుడు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడగగానే రూ.వందల కోట్ల అభివృద్ధి నిధులను బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.
సాంకేతికంగా తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, స్పీకర్‌కు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకున్నా దానిని శిరసావహిస్తానని, స్వార్థం కోసం పార్టీలు మారెందుకు తనకు ఎలాంటి వ్యాపారాలు, భూపంచాయితీలు లేవని పోచారం అంటున్నారు. కేవలం తన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే అని, బతికున్నన్ని రోజులు ధర్మంగా ఉండడం మాత్రమేనని అంటున్నారు. ప్రజల కోసం తాను తీసుకున్న నిర్ణయం తప్పని ప్రజలు చెప్పితే పదవుల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మరి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రియాక్షన్ తో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Story by Big Tv