E-Paper
Advertisement

Tirumala Laddu: మండలిలో ఘోర అపచారం.. లోకేష్ వదిలిన వీడియోలో అసలేముంది?

Tirumala Laddu: మండలిలో ఘోర అపచారం.. లోకేష్ వదిలిన వీడియోలో అసలేముంది?

Tirumala Laddu: ఏపీ శాసనమండలిలో శ్రీవారి లడ్డూ అంశంపై చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలు ప్రదర్శించడం వివాదాస్పదమైంది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, హెరిటేజ్ సంస్థపై చర్చ జరపాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాలను చేతబూని సభలో ఆందోళనకు దిగడం, దానిపై అధికారపక్షం భగ్గుమనండంతో వారు దేవుడి చిత్రపటాలను అక్కడే పడేయడం పెద్ద గందరగోళానికి దారితీసింది.

వైసీపీ ఎమ్మెల్సీల ‘అపచారం’ పై రాజకీయ విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడమే కాదు.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల శాసనమండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడమే కాదు.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల శాసనమండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శాసనం మండలిలో చెప్పులు, బూట్లు ధరించి.. శ్రీవారి పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ సభ్యులు శుక్రవారం నల్ల కండువాలు, నల్లబాడ్జీలు ధరించి.. అసెంబ్లీ నాలుగో గేటు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు చెప్పులు, బూట్లు వేసుకునే.. శ్రీవారి పోస్టర్లు పట్టుకుని ‘గోవిందా గోవిందా’.. ‘చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి’ అంటూ నినాదాలు చేశారు.

సభ్యులు స్వామి ఫొటోలు, ప్లకార్డులతో నినాదాలు

బ్యాడ్జీలు, పోస్టర్లు, బ్యానర్లతో అసెంబ్లీలోకి వచ్చేందుకు అనుమతి లేదంటూ మార్షల్స్‌ వైసీపీ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకుండా ముందుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో.. గేటు మూసి వారి చేతుల్లోని స్వామి పోస్టర్లు, ప్లకార్డులను, బ్యానర్లను మార్షల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై చర్చకుఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి.. ఇందాపూర్‌-హెరిటేజ్‌ సంస్థల పాత్రపై వైసీపీ సభ్యులు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించి.. ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే వైసీపీ సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, హనుమంతరావు, రవిబాబు, వరుదు కల్యాణి, కల్పలత, రమేశ్‌ యాదవ్‌, విక్రాంత్‌ తదితరులు ఇందాపూర్‌ డెయిరీపై చర్చకు అనుమతించాలంటూ స్వామి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టారు.

మంత్రుల ఆగ్రహం

వారలా బూట్లు, చెప్పులతో స్వామి ఫొటోలు ప్రదర్శించడంపై మంత్రి పయ్యావుల కేశవ్‌, అధికార కూటమి సభ్యులు మండిపడ్డారు. వైసీపీ నేతలకు బుద్దిలేదని, రాజకీయం కోసం దేవుడి ఫొటోలను సభలో ప్రదర్శించి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దేవుడిని రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని, వైసీపీ సభ్యులకు దేవుడంటే భయం లేదు.. నమ్మకం లేదని మండిపడ్డారు. విచక్షణ లేకుండా వారి నాయకుడు జగన్ చెప్పినట్లు నడచుకుంటున్నారని, హిందువుల గౌరవం, జాతి నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేశవ్‌ తన హెడ్‌ ఫోన్‌ను మండలిలో బెంచ్‌పై విసిరిగొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ సభ్యుల ప్రదర్శనపై ఆగ్రహం

మంత్రి నారా లోకేశ్‌, కూటమి ఎమ్మెల్సీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. వైసీపీ ఎమ్మెల్సీలు పెద్దగా నినాదాలు చేయడంతో.. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా పోడియం వద్దకు వెళ్లి, వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభను 5 నిమిషాలు సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్లకార్డులతో పాటు స్వామి పోస్టర్లను అక్కడే పడేసి రావడం మరింత దుమారం రేపింది.

బొత్స సత్యనారాయణ సవాల్

సభ వాయిదా పడినప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ శాసనమండలి పక్షనాయకుడు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్ వద్ద స్పందిస్తూ.. దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు సాక్ష్యం చూపించగలరా అని సవాల్ విసిరారు. తమ సభ్యులు తన ముందే చెప్పులు విడిచి ఫొటోలు పట్టుకెళ్లారని, తమకు భక్తిప్రపత్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దమ్ముంటే దానికి సంబంధించిన వీడియోలు చూపించాలని సవాల్ చేశారు

హిందువుల మనోభావాలపై విమర్శలు

దాంతో మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటో పట్టుకెళ్లిన ఫొటోలు, వీడియో విడుదల చేశారు. వైసీపీ వారికి దేవుడంటే భక్తి, భయం లేదని, హిందువుల మనోభావాలంటే లెక్కేలేదని మండిపడ్డారు. బూట్లు, చెప్పులతో స్వామివారి చిత్రపటాలను పట్టుకుని మహాపరాధం చేశారని, కౌన్సిల్లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలను అక్కడే విసిరేసి వెళ్లడం క్షమించరాని పాపమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బహిరంగ క్షమాపణలు చెప్పించాలి

మంత్రులు లోకేశ్‌, కేశవ్‌ సహా కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్‌ చాంబర్‌ వద్ద నిరసన తెలిపారు. వేంకటేశ్వరస్వామిని ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజూ సభలో అపవిత్రం చేస్తున్నారని, ఇవాళ బూట్లు, చెప్పులు ధరించి స్వామి ఫొటోలను చేతపట్టుకుని ప్రదర్శించడం, టేబుల్‌పై స్వామి చిత్రపటాలను విసిరివేయడంపై మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సభలోకి దేవుడి ఫొటోలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. మోషేన్‌రాజు స్పందిస్తూ.. వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని.. వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. మాట్లాడడం కాదని, బహిరంగ క్షమాపణలు చెప్పించి, లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్‌ చేశారు.

చంద్రబాబే భక్తులకు క్షమాపణ చెప్పాలి.. బొత్స డిమాండ్

సభ తిరిగి ప్రారంభం అయ్యాక వైసీపీ సభ్యులు మళ్లీ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వచ్చారు. చంద్రబాబు గతంలో బూట్లు వేసుకుని శ్రీవారి ఫొటో పట్టుకున్నట్లు ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబే భక్తులకు క్షమాపణ చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. దీంతో టీడీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలిందేనని పట్టపట్టారు. ఈ పరిణామాలతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా మండలిలో బడ్జెట్‌పై చర్చే కాదు.. అసలే కార్యకలాపాలూ సాగలేదు.

జగన్‌పై సోము వీర్రాజు డిమాండ్

శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బ తీసిందని విమర్శించారు. చెప్పులేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. దేవుడి ఫొటోలు విసిరేయడం అవమానకరమని అభివర్ణించారు. హిందువులను అవమానించినందున వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దేవుడితో రాజకీయం చేయాలని చూస్తున్న వైసీపీకి ప్రజలు వచ్చేసారి కూడా తగిన బుద్ది చెప్తారని జోస్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదం

రాజకీయ పోరాటాల్లో దేవుడి చిత్రపటాలను వాడటం, అదీ సభలో బూట్లు ధరించి ప్రదర్శించడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీల వైఖరిపై భగ్గుమంటున్న కూటమి నేతలు వారు మండలిలో క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. దాంతో సోమవారం శాసనమండలిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది.

Story by: Apparao, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×