T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కార్యవర్గాల పదవులు భర్తీ మాత్రం పూర్తి కావడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నద దాటింది.. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయింది. అయినా కాంగ్రెస్ పార్టీ పదవుల ఆశావహుల కోరిక మాత్రం తీరడం లేదు.. ఇదిగో అదిగో అంటూ ఊరించిన ఆ ఉరింపులు ఏమయ్యాయి. జూలై నెలాఖరి వరకు పదవులు భర్తీ అంటూ చేసిన ప్రకటనలు ప్రకటనలు గా ఎందుకు మిగిలి పోతున్నాయి..అసలు పదవుల భర్తీ ఉంటుందా ఉండదా..ఉంటే ఎప్పుడూ ఉంటుంది? ఇదే కాంగ్రెస్ పదవుల ఆశావహులను టెన్షన్ పెట్టింస్తోందంట ఇప్పుడు…
భర్తీ కాని కాంగ్రెస్ కార్యవర్గాల పోస్టులు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటిపోయింది. మరో వైపు కొత్త పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి 10 నెలలు అవుతుంది. కానీ పార్టీ కార్యవర్గాల పదవులు మాత్రం భర్తీ చేయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నా… పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టడం లేదు. జాతీయ కాంగ్రెస్ నాయకులు వచ్చిన ప్రతి సారి ఈ నెలాఖరు కు లేదా వారం రోజుల్లో పార్టీ పదవుల భర్తీ అవుతుంది అంటూ ప్రకటనలు చేస్తున్నారు కానీ వారి మాటలు నీటి మీద రాతలు లాగానే మిగిలిపోతున్నాయి అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఉమ్మడి 10 జిల్లాలకు పూర్తైన పార్టీ ఇన్చార్జుల నియామకం
జులై నెలాఖరు వరకు పార్టీ పదవులను భర్తీ చేయాలని భావించింది పీసీసీ. ఇందులో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను నియమించింది. జూలై 15 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి గ్రామా, మండల, జిల్లలో స్థాయి పదవుల కోసం ఒక లిస్ట్ సిద్ధం చేసి ఇవ్వాలని సూచించింది. సూచించడమే కాదు తక్షణమే ఫీల్డ్ లో దిగాలని ఆదేశించింది. లిస్ట్ రూపొందించి ఫైనల్ లిస్టుని గత జూలై నెలాఖరుకి రెడీ చేసి పార్టీ పదవులు భర్తీ చేయాలని భావించింది. దీనికి తగ్గట్లు ఇన్ ఛార్జ్ లు సమావేశాలు నిర్వహించి లిస్ట్ లు సిద్ధం చేశారు..
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే భర్తీ చేస్తారా?
అయితే పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేయాలనీ భావిస్తుందన్న ప్రచారం మొదలవ్వడంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయంట. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పదవులు ఇస్తే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎవరైనా పదవులు రాని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారని కాంగ్రెస్ పెద్దలకు రిపోర్టులు వెళ్లాయంట. దానితో స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ మద్దతు దారులను గెలిపించుకోవడం కష్టం అవుతుందని భావించిన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలో తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేయాలని ఫిక్స్ అయిందంటున్నారు.
Also Read: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?
లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన వారికే పదవులు..
లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఎవరు కష్టపడి పని చేస్తారో వారి గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎవరు ఎక్కువ పని చేసి ఎక్కువ స్థానాలు గెలవడం లో కీలక పాత్ర పోషిస్తారో వారికీ పార్టీ పదవులు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో మీ కోసం పని చేసామని, అయితే ఇప్పుడు లోకల్ ఎన్నికలతో ముడిపెట్టి తమకు పదవులు వాయిదా వేస్తారా అని మండిపడుతోందంట. కాంగ్రెస్ కార్యవర్గాల ఆశావహుల అసంతృప్తి చూస్తుంటే అది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రిఫ్లెక్ట్ అవుతుందేమో అని కాంగ్రెస్ శ్రేణులు బిక్కుబిక్కు మంటున్నాయి. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv