KCR Big Sketch: బీఆర్ఎస్ ఇప్పుడు చౌరస్తాలో ఉంది. వెంటాడుతున్న వరుస కేసులు, కవిత తిరుగుబాటు వ్యవహారంతో సతమతం అవుతున్న నేపథ్యంలో తాజాగా నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారన్న ప్రచారానికి గువ్వల బాలరాజు రాజీనామా ఎపిసోడ్ బలం పెంచింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ ఇలా కారు దిగే వారి సంఖ్య పెరుగుతుండడంతో త్వరలో ఏం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది? ఇంతకీ గువ్వల బాలరాజు ఎపిసోడ్ లో ఏం జరిగింది?
గువ్వల రిజైన్ వెనుక లెక్కలెన్నో..
రైట్.. ఇప్పుడు తెలంగాణలో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిన విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రిజైన్ చేయడమే. సింపుల్ గా తీసుకునే మ్యాటర్ కాదు. ఎందుకంటే తెరవెనుక చాలా లెక్కలు ఉన్నాయ్. బీఆర్ఎస్ స్వరూపమే మారిపోయే కథలున్నాయ్. ఎందుకంటే కేసీఆర్ బాగా నమ్మిన వ్యక్తుల్లో బాలరాజు కూడా ఒకరు. ఉద్యమ టైమ్ నుంచి కేసీఆర్ వెంటే నడిచారు. మరి ఆల్ ఆఫ్ సడెన్ గా కారెందుకు దిగారు.. అది కూడా ఇప్పుడే ఎందుకు జరిగింది? ఎలక్షన్లు కూడా లేవు.. రైట్.. అసలు సీక్రెట్స్ ఏంటో రివీల్ చేద్దాం.
BRSలో ఏదో జరుగుతోందా?
గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఒక భారీ కుదుపుకు ఒక సిగ్నల్ గా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది అనడానికి ఇదొక ఉదాహరణగా మారుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటీ ఇంకా పెరగకముందే ఇలా పార్టీకి కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా ఉన్న గువ్వల బాలరాజు పార్టీకి రిజైన్ చేయడం అంటే ఏదో కొత్త ఆపరేషన్ స్కెచ్ నడుస్తోందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇది ఒక్క గువ్వలకే పరిమితం కాదంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంకా చాలా మంది పార్టీ వీడేలా ఎవరికి వారే ప్లాన్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
వరుస కేసులతో బీఆర్ఎస్ షేక్
నిజానికి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చాలా వ్యవహారాలు నడుస్తున్నాయ్. అదే సమయంలో గత పదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలపై రిపోర్టులు, దర్యాప్తులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయ్. కరెంట్ ఒప్పందాలు, కాళేశ్వరంలో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కీమ్, ఫార్ములా e రేసింగ్ ఇవన్నీ వరుసగా ఒక్కొక్కర్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్. ఈ సమయంలో ఇక ఈ పార్టీలో ఉంటే చివరికి మిగిలేది కేసులే అని చాలా మంది అనుకుంటున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. అందుకే ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం
గువ్వల బాలరాజు పార్టీ మారాలనుకోవడం ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ లీడర్ షిప్ కు షాకింగే. ఎందుకంటే ఇది ఒక్కరితో ఆగిపోదు అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అలా టచ్ లోకి వెళ్లిన వాళ్లు ఏదో ఒక టైమ్ చూసుకుని జంప్ కొడుతారంటున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం.. గత కొన్నాళ్లుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న ప్రచారం జోరందుకుంది. కేసులు, వ్యవహారాలు తలనొప్పులు ఎందుకు.. పార్టీని మొత్తం కలిపేస్తే ఎలా ఉంటుందన్న చర్చ గులాబీ పార్టీలో గ్రౌండ్ లెవెల్ నుంచి జరుగుతోంది. పైగా కేసీఆర్ కు కవిత రాసిన లేఖలో ఈ విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకించానని రాయడం బలం చేకూర్చినట్లయింది. పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తే తాను వారించానని చెప్పడంతో ఈ సబ్జెక్ట్ డెప్త్ పెరిగింది.
పార్టీ అసంతృప్తి, అస్తవ్యస్తతకు సిగ్నల్
రైట్ ఇప్పుడు గువ్వల బాలరాజు ఎపిసోడ్ దగ్గరికి వద్దాం. ఈ రాజీనామా కేవలం వ్యక్తిగత నిర్ణయం కాకుండా, పార్టీలో ఉన్న అసంతృప్తి, అస్తవ్యస్తతకు సిగ్నల్ గా కనిపిస్తోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం కావడం, కేటీఆర్ నాయకత్వంపై అసంతృప్తి, రోజూ కవిత ఆరోపణలు ఇవన్నీ నేతలు తలోదారి చూసుకునేందుకు కారణాలుగా ఉంటున్నాయ్. తాజా రిజైన్ తో brs గ్రౌండ్ లెవల్ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. గువ్వల బాలరాజు వంటి సీనియర్ నేతలు పార్టీని వీడుతుండటంతో, మిగిలిన నేతలు, కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. బీజేపీలో చేరికలు లేదా విలీనం గురించిన చర్చలు క్యాడర్‌లో అస్థిరతను పెంచుతున్నాయి. కొందరు కార్యకర్తలు ఎవరిదారి వాళ్లు చూసుకోవాలి అనే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది.
కేసీఆర్ అప్పగించిన టాస్క్ చేశా: గువ్వల
వీటికి తోడు అక్టోబర్ 26, 2022న జరిగిన మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటన తెలంగాణలో అప్పట్లో పెను సంచలనంగా మారింది. అప్పుడు బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేతికి వెళ్లడంతో, పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా ఒత్తిడిలో ఉన్నారంటున్నారు. అప్పుడు ఫాంహౌజ్ లో పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. వీరంతా ఇప్పుడు మాజీలు అయ్యారు. అయితే ఆ నాడు కేసీఆర్ తనను ఫాంహౌజ్ లో ఏం జరుగుతుందో చూసి రావాలని పంపారని తాజాగా గువ్వల బాలరాజు చెప్పుకొచ్చారు. సో అదీ మ్యాటర్. పాత విషయాలపై జాగ్రత్తగానే డీల్ చేసుకుంటున్నారు గువ్వల. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసినట్లు చెబుతున్నారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.
నువ్వొకటంటే నే రెండంటా అన్నట్లుంది బీఆర్ఎస్ సిచ్యువేషన్. కవిత వర్గం, ఇటు మిగితా వర్గం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎందరు వెళ్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే కవిత, వర్సెస్ జగదీశ్ రెడ్డి డైలాగ్ వార్ పెరిగింది. అటు పార్టీని వీడే వాళ్లు బీఎల్ సంతోష్ ను కలిసి వస్తున్నారు. ఇటు ఇంకొందరు కాంగ్రెస్ తోనూ టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రోజురోజుకూ టోన్ పెంచుతున్న MLC కవిత
బీఆర్ఎస్ లో పరిస్థితులు చూస్తుంటే ఏమంత బాగా లేవు. కవిత రోజురోజుకూ టోన్ పెంచుతూనే ఉన్నారు. అలాగని సస్పెండ్ చేయలేరు. ఇంకోవైపు చూస్తుంటే డ్యామేజ్ చాలా జరుగుతోంది. ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కూడా చాలా కష్టమే అంటున్నారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారని, అయితే BRS నుంచి ఎవరూ స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవలే కామెంట్ చేశారు. తనపై పార్టీ పెద్ద నేత ఒకరు కుట్రలు చేస్తున్నారనడం చూస్తుంటే వార్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో ఓ లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడని, తనపై ఆయన ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తనకు తెలియదని కవిత అన్నారు.
బీఎల్ సంతోష్‌తో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల భేటీ!
సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలా బీఆర్ఎస్‌లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకునేందుకు. సో ఇలాంటి కన్ఫ్యూజన్, ఆధిపత్య పోరాటాలు, వర్గ విబేధాల మధ్య ఉండడం ఎందుకు అనుకున్నారో ఏమోగానీ.. గువ్వల మాత్రం కారు దిగేశారు. అది కూడా రిజైన్ లెటర్.. కేసీఆర్ పై కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చిన టైమ్ లోనే గుడ్ బై కొట్టడంతో టైమింగ్ కీలకంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరింత మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా గువ్వల బాటలోనే రిజైన్ కు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను కలిసినట్టు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 10 నుంచి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
స్థానిక ఎన్నికలకు ముందు ఆపరేషన్ లోటస్
అయితే కొందరి రాకను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వారిపై రకరకాల కేసులు ఉండడమే అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఒక్క కేసు కూడా లేని నేతలు ఉంటారా? ఇంకొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. దీంతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి.. కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ వరుసగా ఫాంహౌజ్ కే పరిమితమవడంతో బీఆర్ఎస్ శిబిరం డీలా పడింది. అటు ఇప్పటికే చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సో బీజేపీ నుంచి పిలుపు వస్తుండడంతో చాలా మంది కమలం పార్టీవైపు చూస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. సో ఆపరేషన్ లోటస్ ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి. అదే సమయంలో ఫాంహౌజ్ కేసులో బాలరాజు మున్ముందు ఏవైనా సంచలన విషయాలు బయటపెడుతారా అన్నది కూడా కీలకంగా మారుతోంది.
Story By Vidya Sagar, Bigtv