Terrorist Attacks in Kashmir: ఫరూక్ అబ్ధుల్లా చెప్పినట్లు కశ్మీర్ ఉగ్రవాదానికి ముగింపు పలికే సమయం ఆసన్నమయ్యిందా..? ఇందులో భాగంగా ఇటీవల కాలంలో తీసుకున్న చర్యలేంటీ..? జమ్మూ కశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి భారత్ ముందున్న మార్గాలేంటీ..? ఇజ్రాయెల్ మాదిరి భారత్ కూడా ఉగ్రవాదులపై విరుచుకుపడాలా..?
ఉగ్రవాద కార్యకలాపాలకు జమ్మూ కొత్త హాట్‌స్పాట్
ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధ వ్యూహాల్లో మార్పు కనిపించింది. కశ్మీర్ నుండి ఉగ్ర చర్యలను వ్యూహాత్మకంగా కీలకమైన జమ్మూ జోన్‌కు మరలింది. ఈ ప్రాంతం, పూంచ్ నుండి కతువా వరకు విస్తరించి, పిర్ పంజాల్ దక్షిణం నుండి కిష్త్వార్ వరకు ఉన్న పర్వత ప్రాంతాలను చుట్టుముట్టింది. దీనితో ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలకు జమ్మూ కొత్త హాట్‌స్పాట్‌గా మారిందని అనుకున్నారు. గత రెండేళ్లుగా వరుస దాడుల చూసిన తర్వాత, ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని తిరిగి తీసుకురావడానికి.. దీనితో పాటు, భారత ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. అయితే, ఇప్పుడు జమ్మూతో పాటు కశ్మీర్‌లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రస్తుతం చెలరేగుతున్న ఈ ముష్కరుల దాడులు ఆందోళన మరింత పెంచాయి. జంగిల్ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందిన 60 మందికిపైగా విదేశీ ఉగ్రవాదులు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే పనిచేస్తున్నారని నిఘా నివేదికలు ఉన్నాయి. ఇప్పుడు, కశ్మీర్‌లో కూడా నిప్పు రాజకుంది. దీనితో, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సైన్యం తన ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో మోహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవల కోరారు.
జమ్మూ కశ్మీర్‌లో “యుద్ధం లేదు, శాంతి లేదు”
జమ్మూ కశ్మీర్‌లో పెరిగిన ఉగ్రవాదులను ఏరిపారేసే క్రమంలో ఇటీవల ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ ధనుష్ విజయవంతంగా కొనసాగింది. ఇక్కడ పెరుగుతున్న ఉగ్రవాదుల ఉనికిపై భారత్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. అయితే, ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లో “యుద్ధం లేదు, శాంతి లేదు” అన్నట్లు ఉంది పరిస్థితి. అందుకే, దీనికి కొత్త ఉగ్రవాద వ్యతిరేక విధానం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే, బలమైన కాశ్మీర్ సీటీ-గ్రిడ్, ‘ఆపరేషన్ ఆల్ అవుట్’ వంటి చర్యలు ఈ ప్రాంతంలో తీవ్రవాద బలాన్ని, మౌలిక సదుపాయాలను గణనీయంగా తగ్గించాయి. అయితే, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం తిరిగి పుంజుకుంటున్న తరుణంలో… కొత్త కార్యాచరణ వ్యూహాలను అమలు చేయడం, అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్‌ను పరిష్కరించడానికి తాజా, సాంకేతికతతో నడిచే విధానం అవసరంగా కనిపిస్తోంది.
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌ని రాష్ట్రీయ రైఫిల్స్‌తో సమీకృతం
ఉగ్రవాదాన్ని ఏరిపారేయడంలో భాగంగా.. భారత్, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లను పునరుద్ధరించండం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌ని రాష్ట్రీయ రైఫిల్స్‌తో సమీకృతం చేసి, వారి బలాన్ని పెంచుకోవాలి. అలాగే, సైనిక కార్యకలాపాలను మెరుగుపరచే క్రమంలో… ఆపరేషన్ సర్ప్ వినష్, ఆపరేషన్ ధనుష్ మాదిరిగానే తీవ్రవాద లాజిస్టిక్స్‌కు అంతరాయం కలిగించడానికి యూనిట్ కసరత్తులు, ఉప వ్యూహాత్మక కార్యకలాపాలు, భారీ-స్థాయి కార్యకలాపాలను మళ్లీ ఉధృతం చేయలి. ఇక, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలంటే ప్రధానంగా ఫోస్టర్ కమ్యూనిటీ సంబంధాలు పెంచుకోవాలి. తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు విజయవంతం కావాలంటే భారత్ ఆర్మీ, స్థానిక ప్రజలతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంది. అలాగే, జమ్మూ కశ్మీర్‌లో తగినంత మంది దళాలను మోహరించాలి. భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి… చొరబాట్లను నిరోధించడానికి అదనపు దళాలను సమర్ధవంతంగా మోహరించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇలాంటి చర్యలు గతం కంటే మరింత పఠిష్టంగా ఉండే విధంగా చూసుకోవాలి.
Also Read: కథ మళ్లీ మొదటికే! సీఎం నియోజకవర్గంలో ఉగ్ర దాడులు.. వారిని తుడిచి పెట్టలేమా?
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్ ఆక్రమిత కశ్మీర్
ఉగ్రవాదాన్ని అంతమొందించే క్రమంలో.. ముఖ్యంగా, ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే, పీఓకేలో గత కొన్నేళ్లుగా ఆశ్రయం పొందుతున్న స్థానిక ఉగ్రవాదులను జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం పరారీలో నేరస్థులుగా ప్రకటించి, వారి ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియను ఏడాది క్రితమే ప్రారంభించింది. దీంతో వందలాది మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోని తమ ఆస్తులను కోల్పోయారు. అయితే, దేశ ద్రోహులు కొందరు ఇప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు అక్కడి నుంచే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ నిఘా విభాగం గతేడాది, వీళ్లకు సంబంధించిన జాబితాను సిద్దం చేసింది. ఈ జాబితాలో మొత్తం 4 వేల 200 మంది ఉండగా.. చాలా మంది 1990ల నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనే ఆశ్రయం పొందుతున్నట్లు పేర్కొన్నారు.
గత 3 దశాబ్దాల్లో దాదాపు 25 వేల మంది ముష్కరులు హతం
90వ దశకంలో ఉగ్రవాద శిక్షణ కోసం నియంత్రణ రేఖ దాటి వేలాది మంది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించిన వారంతా… మళ్లీ కశ్మీర్‌కు దొంగతనంగా తిరిగొచ్చి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానాలున్నాయి. గత మూడు దశాబ్దాల్లో భద్రతా బలగాలు దాదాపు 25 వేల మంది ముష్కరులను ఎన్‌కౌంటర్‌లలో హతమార్చాయి. అయితే, ఇంకా చాలా మంది ఉగ్రవాదులు పీఓకేలో ఆశ్రయం పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకే, పీఓకేను జల్లెడ పడితే తప్ప జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్‌తో సహా భారత సైన్యం పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన పోస్టులను కూడా ధ్వంసం చేసింది. అయితే, 2016, 2019లో చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌కు మించి ఈసారి భారత్ ప్రతిస్పందిస్తే, ఉగ్రవాదాన్ని రూపుమాపే అవకాశం కనిపిస్తోంది.
పీఓకేలోని ఉగ్రవాదులే లక్ష్యంగా చర్యలు అవసరం
గతంలోనే సర్జికల్ స్ట్రైక్స్ మరింత విస్తరించాలని చూసిన భారత్.. ఈ ఉద్రిక్తత యుద్ధంగా మారే అవకాశం ఉందనీ.. అది అంతర్జాతీయంగా సమస్యను పెంచుతుందనే ఆలోచనతో విరమించుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల, పలు సందర్భాల్లో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని భారత ప్రభుత్వ నేతలు చెప్పారు. ఇజ్రాయెల్ కూడా తమ దేశంపై పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో గత ఏడాది కాలంగా తీవ్రమైన యుద్ధాన్ని చేస్తోంది. అమెరికా సహాయంతో.. గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లా, సిరియా-యెమన్‌లోని హౌతీ తీవ్రవాద గ్రూపులను ఏరిపారేయడానికి పూనుకుంది. అలాగే, భారత్ కూడా పీఓకేలోని ఉగ్రవాదులే లక్ష్యంగా చర్యలు తీసుకున్నప్పుడు జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని కొందరు భావిస్తున్నారు. ఇటీవల పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, గత సర్జికల్ స్ట్రైక్స్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఉగ్రవాద వ్యతిరేక దాడులు ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ పరిస్థితి రావడానికి ఎంతో సమయం లేదనే సందేహం కూడా కలుగుతోంది.