Udhayanidhi Stalin: నేను క్షమాపణలు చెప్పడం అంటూ జరగదు. నా నోట ఆ మాటే రాదు. నేను ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా.. అంటూ మరోమారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ మళ్లీ దేశవ్యాప్త చర్చకు దారి తీసాయి.
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. సెప్టెంబర్ 2023లో ఓ సభలో ప్రసంగిస్తూ, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చి, ఆ ధర్మాన్ని నిర్మూలించాలని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దీనితో నాటి నుండి నేటి వరకు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన ఉదయనిధి స్టాలిన్ కు విమర్శల సెగ తాకుతోంది.
ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ తిరుపతి వేదికగా వారాహి సభను నిర్వహించారు. ఈ సభలో పవన్ ప్రసంగిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణకు తానెప్పుడూ ముందుంటానని, గతంలో కొందరు సనాతన ధర్మంపై విమర్శలు చేసి, నేడు ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటూ ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. దీనితో స్టాలిన్ అభిమానులు సోషల్ మీడియాలో పవన్ పై ట్రోలింగ్ చేశారు. అంతేకాదు మధురైలో ఓ న్యాయవాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. రివర్స్ కౌంటర్ గా ఏపీలో కూడా పవన్ ను ట్రోలింగ్ చేసిన బ్యాచ్ పై కూడా పవన్ అభిమానులు ఫిర్యాదులు చేశారు.
Also Read: One Plus 13 : రేపే వన్ ప్లస్ 13 లాంఛ్.. దుమ్మురేపుతున్న ధర, స్పెషిఫికేషన్స్
ఇలా సనాతన ధర్మ పరిరక్షణ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ తరంలో మరో మారు తమిళనాడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఉదయనిధి, సనాతన ధర్మ పరిరక్షణపై మళ్లీ కామెంట్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుకు తాను ఎప్పటికీ క్షమాపణలు చెప్పడం కుదరదన్నారు. మహిళల పట్ల అణచివేత వైఖరిని వ్యతిరేకించడంలో తానెప్పుడూ ముందుంటానన్నారు. పలువురు నేతలు చెప్పిన మాటనే తాను చెప్పానని, కానీ తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.
ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణకై ట్రస్ట్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న సంధర్భంగా, మరో మారు ఉదయనిధి స్టాలిన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. గతంలో ఉదయనిధి కామెంట్స్ చేసిన సమయం నుండి, హిందుత్వవాదులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే దేశ వ్యాప్త నిరసనలు సైతం కొనసాగించారు. ఇప్పుడు మరలా తాను క్షమాపణలు చెప్పనంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ పై స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.