నిమ్మరసం ఉపయోగించండి
నిమ్మరసం చుండ్రు సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. మాడుపై ఉండే పీహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం మీరు ఒక పావు గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడుకు తగిలేలా అప్లై చేయాలి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ సూక్ష్మజీవులను తొలగిస్తాయి. ఫంగస్, శిలీంధ్రాలు వంటిని కూడా తొలగిపోయేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు బలంగా కనిపించేలా చేస్తాయి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత తేలికపాటి షాంపూ తో జుట్టును పరిశుభ్రంగా చేసుకోవాలి.
కాఫీ పొడి
ప్రతి ఇంట్లోనూ కాఫీ పొడి ఉండడం సహజం. కాఫీలో అందాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. కాఫీ చర్మానికే కాదు, జుట్టుకు కూడా ఎంతో సహాయపడుతుంది. దుమ్ము ధూళిని తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మృత కణాలను తొలగిస్తుంది. చుండ్రుకు కారణమయ్యే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలను వదిలించడానికి సహాయపడుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. దీని వల్ల వెంట్రుకలు దెబ్బలు తినకుండా ఉంటాయి. ముందుగా కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కాఫీ పొడిని బాగా కలపాలి. దీన్ని పేస్ట్‌లా చేసి మాడుకు అప్లై చేయాలి. అప్లై చేశాక అరగంట పాటు అలా వదిలేసి తేలికపాటి షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఇది మట్టి, మురికిని తొలగిస్తుంది. చుండ్రును కూడా పూర్తిగా పోయేలా చేస్తుంది.
ఆపిల్ సిడర్ వెనిగర్
మార్కెట్లో ఆపిల్ సిడర్ వెనిగర్ దొరుకుతుంది. ఇది జుట్టు మొదళ్లను, మాడును సున్నితంగా శుభ్రపరుస్తుంది. చుండ్రుకు చక్కగా చికిత్స చేస్తుంది. ఆపిల్ సిడర్ వెనిగర్… యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో ఉంటుంది. కాబట్టి పీహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. మీ జుట్టును నిస్తేజంగా కాకుండా మెరుపుతో కూడుకున్న విధంగా మారుస్తుంది. ఆపిల్ సిడర్ వెనిగర్ ను వారానికి రెండుసార్లు మాడుకు అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చుండ్రు ఉన్నవారు కచ్చితంగా యాపిల్ సిడర్ వెనిగర్ ను వాడాల్సిన అవసరం ఉంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఎక్కువని తెలుసు. దీన్ని సాంప్రదాయక ఔషధాలలో విరివిగా వాడుతూ ఉంటారు. చుండ్రును తగ్గించే శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లిలో విటమిన్ ఏ, విటమిన్ సి, అమినో యాసిడ్లు, మెగ్నీషియం, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన జుట్టుకు అవసరమైనవి. వారానికి రెండు సార్లు వెల్లుల్లి రసాన్ని మాడుకు రాయడం ద్వారా చుండ్రును వదిలించుకోవచ్చు. దీని రాసుకున్నాక మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి.
చుండ్రు సమస్య ఉన్నవారు గోళ్ళతో జుట్టును గోకేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే చికాకు, మంట కూడా ఎక్కువ అవుతుంది. అలాంటివారు రబ్బర్ హెయిర్ మసాజ్ ని కొనుక్కోవాలి. దీంతో తలను రుద్దడం వల్ల వెంట్రుకల మొదళ్లకు ఎలాంటి నష్టం జరగదు. దీనివల్ల మసాజ్ కూడా అవుతుంది. కాబట్టి రక్తప్రసరణ మాడుపై పెరుగుతుంది. జుట్టు కూడా చక్కగా ఎదుగుతుంది. పైన చెప్పిన పద్ధతుల్లో మీరు మీ జుట్టుకు పట్టిన చుండ్రును వదిలించుకుంటే ఉత్తమం. చుండ్రు కొన్ని చర్మ సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చుండ్రు సమస్యను తేలిగ్గా తీసుకోకండి.