Sugar: చక్కెర అనేది మన రోజువారీ ఆహారంలో ఒక భాగమైపోయింది. నిత్యం టీ, కాఫీ నుంచి స్వీట్స్, కూల్ డ్రింక్స్ వరకు అన్నింటిలోనూ చక్కెర వాడుతుంటాం. ఇదిలా ఉంటే ఆరోగ్య నిపుణులు చక్కెరను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతూనే ఉంటారు. మరి.. 30 రోజుల పాటు చక్కెరను పూర్తిగా తినడం మానేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి వారం:
చక్కెరను తినడం ఆపేసిన మొదటి వారంలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్నే ‘చక్కెర విత్డ్రావల్’ అని అంటారు. ఈ సమయంలో తలనొప్పి, అలసట, కోపం, లేదా ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చక్కెరను తినడం మానేసినప్పుడు మెదడులో డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి, అందుకే ఈ లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీరు పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ లక్షణాలను అధిగమించవచ్చు.
రెండవ వారం:
మొదటి వారం గడిచిపోయాక.. మీ శరీరంలో శక్తి స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. చక్కెరను మానేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనితో నిస్సత్తువగా అనిపించడం, లేదా మధ్యాహ్నం నిద్రగా అనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. అంతేకాకుండా.. మీరు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో శరీరం మెరుగ్గా పని చేస్తుంది.
మూడవ వారం:
మూడవ వారం నాటికి మీలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. చక్కెరను తగ్గించడం వల్ల చర్మంలో ఉండే వాపు తగ్గుతుంది. దీనివల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది. అలాగే, చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దాన్ని మానేయడం వల్ల బరువు తగ్గుతారు. ఇది మీ జీవక్రియను మెరుగుపరచి, శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?
నాల్గవ వారం:
నాలుగవ వారం వచ్చేసరికి మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మానసిక కల్లోలం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చక్కెరను మానేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. మీ మానసిక స్థితి మెరుగవుతుంది, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. నిద్ర కూడా బాగా పడుతుంది. దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
30 రోజుల పాటు చక్కెరను మానేయడం అనేది కేవలం ఒక ఛాలెంజ్ మాత్రమే కాదు.. మీ ఆరోగ్యం కోసం తీసుకునే ఒక మంచి నిర్ణయం. ఇది మీకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పిస్తుంది. కేవలం 30 రోజుల్లో మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.