Pakistan Terror Plans: మన దేశానికి బయట నుంచి వచ్చే శత్రువుల కన్నా.. మన దేశం లోపల ఉండే దేశ ద్రోహులే పెద్ద శత్రువులు. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని ఉగ్రమూలాల్ని గుర్తించి.. వాటిని పెకిలించే పనిలో ఉన్నాయ్ భారత దర్యాప్తు సంస్థలు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరు యువకుల్ని.. ఎన్ఐఏ అరెస్ట్ చేయడం.. తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్స్ చాలానే ఉన్నాయ్. వీళ్లని ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు? సౌదీ అరేబియా నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు? పేలుళ్ల కుట్ర వెనుక.. అసలేం జరిగింది? ఉగ్ర దాడులకు పాక్ టెర్రరిస్ట్ సంస్థలు సౌదీని వాడుకుంటున్నాయా?
పాక్ టెర్రర్ వయా సౌదీ!
ఈ దారుణాలు మిగిల్చిన విషాదం తెలుసు!
ఈ పేలుళ్లు సృష్టించిన విధ్వంసం మనకు తెలుసు. ఈ దారుణాలు మిగిల్చిన విషాదం ఎలా ఉంటుందో అంతా చూశాం. ఇలాంటి ఘటనలు.. ఈ తరహా పేలుళ్లు.. ఇంకెప్పటికీ జరగకూడదని కోరుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. అయినా.. తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించేందుకు ఉగ్ర కుట్రలు జరుగుతూనే ఉన్నాయ్. గతంలో జరిగిన బాంబు పేలుళ్ల మాదిరిగానే.. మరోసారి హైదరాబాద్‌లోనూ, ఏపీలోని విజయనగరంలోనూ పేలుళ్లకు కుట్ర పన్నాయ్ ఉగ్ర సంస్థలు. ఇందుకోసం.. తెలుగు రాష్ట్రాల్లోని యువకుల చేతే.. పేలుళ్లు జరపాలని ప్లాన్ చేశాయ్. అయితే.. ఉగ్ర కుట్రను భగ్నం చేస్తూ.. పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
సిరాజ్, సమీర్‌ని సౌదీ నుంచి ఆపరేట్ చేసిన హ్యాండ్లర్
ఉగ్ర కుట్ర భగ్నం తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలు, అనుమానాలు చాలానే ఉన్నాయ్. ఎందుకంటే.. సిరాజ్, సమీర్‌ని సౌదీ నుంచి ఆపరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్ర సంస్థకు చెందిన ఓ హ్యాండ్లర్.. వీరిని రిక్రూట్ చేసుకోవడం, వారికి సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్‌లో ఉండటం, మిగతా వాళ్లని ఎలా తమ గ్రూపులో చేర్చుకోవాలి? వారితో ఏమేం చేయించాలి? అందుబాటులో ఉన్న కెమికల్స్‌తో బాంబులు ఎలా తయారుచేయాలి? ఎక్కడ, ఎప్పుడు, ఎలా పేలుళ్లకు ప్లాన్ చేయాలి? లాంటివే కాదు.. ఈ ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన ఆర్థికసాయం కూడా అందేదనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం.. పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థలు.. సౌదీ అరేబియాని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి కుట్రకు.. సౌదీతో లింకులున్నాయనే అనుమానాలు.. ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయ్. సౌదీ నుంచే ఇండియాలో టెర్రర్ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉగ్రవాది వ్యతిరేక చర్యల్ని బలోపేతం చేసిన సౌదీ
పాకిస్తాన్ అంటే.. అదొక టెర్రరిస్ట్ కంట్రీ అనే ముద్ర ఇప్పటికే ఉంది. కానీ.. సౌదీ అరేబియా అలా కాదు. ఉగ్రవాద మూలాలున్న దేశం అసలే కాదు. సౌదీ అరేబియా.. తమ దేశంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలని కూడా ఎంతో బలోపేతం చేసింది. ముఖ్యంగా.. 2003లో రియాద్‌లో జరిగిన బాంబు దాడుల తర్వాత.. అల్-ఖైదా లాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. అయినప్పటికీ.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు.. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటివి.. సౌదీ అరేబియాను తమ ఉగ్ర కార్యకలాపాలకు వాడుకుంటున్నాయనే నివేదికలున్నాయ్. ఇవి ప్రధానంగా నిధుల సేకరణ, రిక్రూట్‌మెంట్, లాజిస్టికల్ సపోర్ట్ కోసం పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. సౌదీ అరేబియాలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ వాసులు ఉన్నందున.. ఈ సంస్థలు అక్కడి నెట్‌వర్క్‌లను ఉపయోగించుకునే అవకాశాలున్నాయని కొన్ని రిపోర్టులు సూచించాయ్.
అనుమానం రాకుండా సౌదీ నుంచి టెర్రర్ నెట్‌వర్క్
ఎవ్వరికీ అనుమానం రాకుండా సౌదీ నుంచి ఇండియాలో టెర్రర్ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయ్. ఇందుకు.. తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్ల కుట్రే.. బిగ్ ఎగ్జాంపుల్. ఇక్కడి నెట్‌వర్క్‌ని.. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తే వెంటనే ఎన్ఐఏ లాంటి సంస్థలు పసిగట్టేస్తాయ్. అదే.. వయా సౌదీ అరేబియా నుంచి అయితే.. అంత సులువుగా పసిగట్టేందుకు వీలులేదు. భారత్-సౌదీ మధ్య ఉన్న సత్సంబంధాలు, అక్కడ నివసించే భారతీయుల వల్ల.. ఈ రెండు దేశాల మధ్య నడిచే ఫోన్ కాల్స్, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేత లాంటివాటిపై వెంటనే అనుమానం రానివ్వకుండా చేస్తాయ్. దీనిని ఆసరాగా చేసుకొని.. సౌదీ అరేబియా నుంచి ఇండియాలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నిర్మించే విషయంలో.. పాక్ ఉగ్ర సంస్థలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
సిరాజ్, సమీర్‌కు సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు
విజయనగరం పేలుళ్ల కుట్రలో అరెస్ట్ అయిన నిందితులు.. సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు స్వీకరించి.. వాటిని అమలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది.. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక, లాజిస్టికల్ సాయం పొందుతున్నట్లు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా.. రంపచోడవరం అటవీప్రాంతంలో.. బాంబుల పనితీరుపై రిహార్సల్స్ జరగడం కూడా.. పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు కుట్ర పన్నినట్లు తెలియజేస్తోంది. అంతేకాదు.. ఈ ఉగ్ర కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న సిరాజ్ కూడా ఆరు నెలల్లో.. 3 సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉగ్ర కుట్రలో అతనెంత కీలకంగా ఉన్నాడో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు వ్యక్తులతో కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గ్రూప్‌ని క్రియేట్ చేసి.. దాని ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా నుంచి ఆర్థిక లావాదేవీలు జరిపినా.. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా రహస్యంగా సమాచారం చేరవేసినా.. ఎవ్వరికీ అనుమానం రాదనే ఆలోచనతోనే.. సౌదీ నుంచి ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలను నడుపుతున్నారనే చర్చ జరుగుతోంది.
దేశంలో ఉగ్రవాద మూలాల్ని గుర్తించడమే కాదు.. ఉగ్ర కుట్రల్ని భగ్నం చేయడంలో ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలు ముందున్నాయ్. ఈ విషయంలో చిటారు కొమ్మన మొదలుపెట్టి.. తల్లి వేరు దాకా వెళ్లిపోయింది ఎన్ఐఏ. అందులో భాగంగానే విజయనగరంలో సిరాజ్ నెట్‌వర్క్‌ని బ్రేక్ చేసింది. వారి కుట్రల్ని భగ్నం చేసి.. బాంబు పేలుళ్ల లాంటివి జరగకుండా.. ఆదిలోనే తుంచేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో ఇంకా సంచలన విషయాలు బయటపడ్డాయ్. అసలు.. సౌదీతో సిరాజ్‌కు ఉన్న లింకేంటి? దేనికోసం అతను ఇదంతా చేశాడు?
సిరాజ్‌కు సౌదీ అరేబాయాతో కీలక లింకులు
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో.. ప్రధాన నిందితుడు సిరాజ్‌కు సౌదీ అరేబియాతో కీలక లింకులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు, నిఘా వర్గాల ప్రకారం.. సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌లోని సయ్యద్ సమీర్‌తో కలిసి.. సౌదీ అరేబియాలోని ఉగ్ర సంస్థల హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుంటున్నారు. సిరాజ్, సమీర్.. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే.. ఉగ్ర కార్యకలాపాల పట్ల ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌదీ అరేబియా కేంద్రంగా నెట్‌వర్క్ బిల్డ్ చేస్తున్న ఉగ్ర సంస్థలకు చెందిన హ్యాండ్లర్లతో వారికి పరిచయం ఏర్పడింది. గడిచిన ఆరు నెలల్లో.. సిరాజ్ పలుమార్లు సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చాడు. అక్కడ.. హ్యాండ్లర్ల దగ్గర పేలుడు పదార్థాలను సేకరించడం, బాంబులు తయారు చేయడంపై శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు చేయాలని సౌదీ హ్యాండ్లర్ల నుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. టిఫిన్ బాక్స్ బాంబులు తయారుచేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సిరాజ్ మానవ బాంబుల తయారీయే లక్ష్యంగా పనిచేసినట్లు తెలుస్తోంది.
అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ప్రారంభం
సౌదీలోని హ్యాండ్లర్ల సూచనల మేరకు.. సిరాజ్, సమీర్ కలిసి.. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా.. దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని.. కొందరు యువతను, మైనర్లను టార్గెట్ చేసి.. ఉగ్రవాద భావజాలంతో కూడిన పోస్టులు చేసి వారిని ఆకర్షించేవారు. సౌదీలోని హ్యాండ్లర్‌తో.. సిరాజ్, సమీర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ.. ఉగ్రవాద కార్యకలాపాలు ప్లాన్ చేసేందుకు, అమలు చేసేందుకు సూచనలు అందుకున్నారు. అలా.. 20 మంది యువకులతో.. సిరాజ్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. పంజాబ్, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో నెట్‌వర్క్ డెవలప్ చేసేందుకు స్కెచ్ వేశాడు. విజయనగరం నుంచే మొత్తం ఆపరేషన్‌కి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి సౌదీ నుంచే నిధులు వచ్చాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన నలుగురు పరిచయం
సిరాజ్‌కు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన సమీర్ సహా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు పరిచయమయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా.. మిగతా ముఖ్య నగరాలకు వెళ్లి.. ఇంకొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా.. సిగ్నల్ యాప్‌లో సిరాజ్ బృందం ప్రత్యేకంగా ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో మాట్లాడుకుంటూ.. ఏడాదిగా కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ఎన్ఐఏ ప్రత్యేక నిఘాతో వీళ్లిద్దరినీ అరెస్ట్ చేసింది. విచారణలో.. వారి మూలాలను బయటకు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. వీరిలో గ్రూప్‌లో ఎవరెవరు ఉన్నారు? వాళ్లంతా ఎక్కడి వాళ్లు? వీరితో లింకు ఎలా కలిసిందన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. సిరాజ్, సమీర్‌కు ఆర్థికసాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించేందుకు వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. సిరాజ్‌కు 11 బ్యాంకుల్లో.. ఖాతాలున్నట్లు గుర్తించారు.
గతేడాది నవంబర్‌లో.. ముంబై వెళ్లి 10 మందితో సిరాజ్ చర్చలు
గతేడాది నవంబర్‌లో.. ముంబై వెళ్లి 10 మందితో సిరాజ్ చర్చలు జరిపి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది జనవరిలోనూ ఢిల్లీలో కొందరిని కలిసేందుకు వెళ్లాడు. వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. తర్వాత.. మండోలి వెళ్లి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీలో ఉండే హ్యాండ్లర్‌తో.. సమీర్, సిరాజ్ సిగ్నల్ యాప్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో.. తక్కువ ఖర్చుతో కెమికల్స్ ఉపయోగించి బాంబులు తయారుచేయాలని నిర్ణయించారు. వాటిని.. జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెట్టి.. పేల్చాలని భావించారు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబట్టాడు. ఓ ట్యాబ్, అల్యూమినియం పొడి, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ పౌరడర్, పీవీసీ గమ్ లాంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన సూత్రధారులు, సౌదీ హ్యండ్లర్లపైనా ఆరా
నిందితులు సిరాజ్, సమీర్‌పై.. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, బీఎన్ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉగ్ర కుట్రపై.. పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సిరాజ్, సమీర్ ద్వారా మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరి వెనకున్న ప్రధాన సూత్రధారులు, వారికి నిధులు సమకూర్చిన సౌదీ హ్యాండ్లర్లపైనా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా.. నిందితులు ఏర్పాటు చేసిన అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈ సంస్థ కార్యకలాపాలు, సభ్యుల వివరాలు, ఇతర ప్రాంతాల్లో దీనికి ఉన్న లింకులపై.. విచారణ కొనసాగుతోంది.
విజయనగరం పేలుళ్ల కుట్ర భగ్నం కేసు.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఈ సంఘటన.. రెండు రాష్ట్రాల పోలీసులను, నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయనగరం లాంటి ప్రధాన నగరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. స్లీపర్ సెల్స్ కదలికలపై నిఘా పెంచారు. ఆన్‌లైన్ కార్యకలాపాలపైనా నిఘా పెంచారు. యువతను తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న ఆన్‌లైన్ ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.