Vaibhav Suryavanshi: మాములుగా.. 15 లేదా 16 ఏళ్ల పిల్లలు ఏం చేస్తుంటారు..? అయితే పుస్తకం.. లేదంటే వీడియో గేమ్స్. కానీ ఇదే టైమ్‌కు ఓ పిల్లాడు దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. దేశం మొత్తం తన గురించే మాట్లాడుకునేలా దుమ్ము దులిపాడు. మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా దూసుకుపోతున్నాడు. అతని పేరే వైభవ్ సూర్యవంశీ.
ఇప్పుడు కాదు.. ఈ ప్రభంజనం ప్రారంభమై సరిగ్గా రెండేళ్లు దాటింది.
ఆ రోజు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌కు కూడా తాము ఓ చిచ్చర పిడుగును దక్కించుకున్నామని తెలిసి ఉండదు. స్లార్ బౌలర్లను బాదేస్తూ.. బంతిని బౌండరీల అవతలకు అవలీలగా పంపించే సత్తా ఉన్న యంగ్ సెన్సేషన్‌ను టీమ్‌లోకి తీసుకున్నామని. అలా మొదలైంది 13 ఏళ్ల బాలుడి క్రికెట్ ప్రస్థానం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు.. వచ్చిన అవకాశాల్లో చాలా వాటిని మెరుగ్గా ఉపయోగించుకున్నాడు సూర్యవంశీ. రాయల్స్ చాయిస్ తప్పు కానే కాదని ప్రూవ్ చేశాడు. వైభవ్.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆడింది 22 మ్యాచ్‌లే. కానీ అతని వైభవం ఏంటో ఈపాటికే క్రికెట్ ప్రపంచం.. క్రికెట్ అభిమానులు గుర్తించేశారు.
ఐపీఎల్ రికార్డులు అనగానే క్రిస్ గేల్ గుర్తుకొస్తాడు చాలా మందికి. కానీ ఇప్పుడు అతడిని మరింపించేలా కుమ్మేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు మోదిన ఘనత గేల్‌దే. 2012 సీజన్‌లో 456 బాల్స్ ఆడిన గేల్.. 59 సిక్స్‌లు బాదేశాడు. అప్పుడు అతని ఏజ్ 33. కానీ ఈ రికార్డును 15 ఏళ్ల వయసులోనే ఊదేశాడు వైభవ్. జస్ట్ 266 బాల్స్‌లో ఏకంగా 65 సిక్స్‌లు బాదేశాడు. ఈ వీర బాదుడు ఇంకా కొనసాగే అవకాశం ఉంది.
ఇక నాక్‌ఔట్ మ్యాచ్‌లో అయితే వీర విహారం చేశాడు వైభవ్. SRH తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ 29 బంతుల్లోనే 12 సిక్స్‌లు బాదేశాడు. అందుకే సిక్సర్ సూర్యవంశీ అనే పేరు కూడా వచ్చేసింది ఈ చిచ్చర పిడుగుకి. జస్ట్ 29 బాల్స్‌లో 97 పరుగులు చేశాడు. అది కనక క్యాచ్ ఔట్ కాకుండా ఏ ఫోరో.. సిక్సో అయి ఉంటే.. 30 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్‌లో గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టేశేవాడు. నాట్ ఓన్లీ దట్.. 15 ఇన్నింగ్స్‌లలోనే 680 పరుగులు పూర్తి చేశాడు. అంటే అతని స్ట్రైక్ రేట్ 200 పైనే ఉంది. అంతేకాదు 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ కూడా వైభవ్ ఖాతాలో పడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ట్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు సురేష్ రైనా కూడా ఎగ్జాక్ట్‌గా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు.
ఈ చిచ్చర పిడుగును వండర్ కిడ్‌గా ఆకాశానికెత్తేస్తున్నారు సీనియర్ క్రికెటర్లు. ఇప్పటికే కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న అతడికి.. క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. వైభవ్ ఎవరి రికార్డులను అయితే బద్దలు కొట్టాడే.. ఆ క్రికెటర్.. అదే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కూడా వైభవ్ ఆటకు ఫిదా అయ్యాడు. నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ టాలెంట్స్‌లో వైభవ్ ఒకడు అంటూ ప్రశంసలు కురిపించాడు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వైభవ్‌ను జీనియస్ ప్లేయర్ అంటూ పొగిడేశౄడు. వైభవ్ బ్యాట్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది. ఇలాంటి బ్యాట్ స్పీడ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పడమంటే అస్సలు సాధారణ విషయం కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వైభవ్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. వైభవ్ సూర్యవంశీ అన్‌బిలీవబుల్ ప్లేయర్.. అనేశాడు.
ప్రస్తుతం వైభవ్‌ను అనేక రికార్డులు ఊరిస్తున్నాయి. సిక్స్‌ల ఘనతను వైభవ్ అధిగమించాడు. ఐపీఎల్‌లో 200ప్లస్ స్కోర్ బాదేస్తానని ఇప్పటికే ఓసారి స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఈ ఫీట్‌ను ఇప్పటి వరకు ఎవరూ సాధించలేదు. కాస్తలో ఫాస్టెస్ట్ సెంచరీని మిస్ చేసుకున్న అతడు.. ముందున్న మ్యాచ్‌ల్లో ఆ ఫీట్‌ను సాధించే అవకాశం ఉంది. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ కొట్టిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ పేరిట రికార్డ్ ఉంది. మరి 175 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును కొట్టే సత్తా క్రికెటర్లలో వైభవ్ పేరు ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాదు మరో 68 పరుగులు చేస్తే అతిచిన్న వయసులో ఐపీఎల్‌లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్ నిలుస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రెండు సీజన్లలో కలిపి 932 పరుగులు చేశాడు. ఇందులో హైలేట్ ఏంటంటే.. 826 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. 89 సిక్స్‌లు, 73 ఫోర్ల రూపంలోనే ఈ రన్స్ చేసేశాడు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ బుడ్డోడు.. త్వరలోనే టీమిండియాకు సెలెక్ట్ కావడం ఖాయమనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో కొత్త సూపర్ స్టార్ పుట్టాడనే నమ్మకం ఇప్పటికే చాలా మందికి కలిగింది. మరి దీనిని సూర్యవంశీ ప్రూవ్ చేస్తాడా? లేదా? చూడాలి.
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్‌లో తన స్థానమెంటో చెప్పేశాడు. . బారసాలలో బ్యాటు పట్టినట్లు.. తాను పుట్టిందే సిక్సర్లు కొట్టడానికన్నట్లు.. ఊచకోత కోస్తూ ఉంటే… డగౌట్‌లో ఉన్న తోటి ప్లేయర్లైనా.. స్టేడియంలో, టీవీల ముందు కూర్చొని చూసే వాళ్లైనా మునివేళ్లపై నిల్చోవాల్సిందే. అతనిలో దిగ్గజ బౌలర్లను ఎదుర్కుంటున్నాననే భయం, బెరుకు ఏమాత్రం కనిపించదు.
Also Read:వైభవ్ బ్యాట్ లో AI చిప్స్..అందుకే భయంకరమైన సిక్సులు కొడుతున్నాడు
వైభవ్‌ది.. బీహార్‌లోని సమస్తీపూర్ అనే చిన్న గ్రామం. చిన్నప్పటి నుంచే బ్యాట్‌ను తిరగేసేవాడు. వచ్చీ రాని మాటలతో పెద్దయ్యాక క్రికెటర్‌ను అవుతానని చెప్పిన మాటలను వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ సీరియస్‌గా తీసుకున్నాడు. తానే కోచ్ అయి.. వైభవ్‌కు ప్రాక్టీస్ చేయించాడు. రోజుకు ఆరు వందలకు పైగా బంతులు వేస్తూ షాట్లు ప్రాక్టీస్ చేయించాడంటే.. కొడుకుపై అతనికున్న గురి ఎలాంటిదో అర్థం అవుతుంది. తర్వాత కొడుకు కెరీర్ కోసం.. వైభవ్‌తో సమానంగా శ్రమించాడు ఆ తండ్రి. క్రికెటర్‌ను చేయాలనే ఆశయాన్ని తీర్చిదిద్దేందుకు.. తమకున్న భూమిని అమ్మేశాడు. కొడుకు భవిష్యత్ కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. పాట్నాలోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. తండ్రి శిక్షణో.. చిన్నప్పటి నుంచి ఉన్న కసో తెలియదు కానీ.. అప్పటి నుంచే తనకంటే పెద్దవాళ్ల బౌలింగ్‌లో ఇరగదీసేవాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో వైభవ్‌ను ఔట్ చేసేందుకు బౌలర్లు శ్రమించేవారు. ఇక కొడుకును పెద్ద క్రికెటర్‌ను చేయాలి కదా.. దానికి శక్తి కావాలి కదా. అందుకు వైభవ్ కోసం.. దాదాపు 10 ఎక్స్‌ట్రా టిఫిన్ బాక్సులు తెచ్చేవాడు.
తన తండ్రి పడ్డ కష్టం, శ్రమ ఊరికే ఏం పోలేదు. 8 ఏళ్ల వయసులోనే అండర్ 16 జిల్లా ట్రయల్స్‌లో అద్భుతంగా ఆడాడు. 2024లో తన 12 ఏళ్ల వయసులో వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన అండర్ 19 ఆసియా కప్‌లో వైభవ్ కేవలం 58 బంతుల్లోనే.. సెంచరీ బాదాడు. ఆ సిరిస్‌లో 5 మ్యాచుల్లో 176 రన్స్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. వేలం కంటే ముందే రాజస్థాన్ నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ పాల్గొన్నాడు. ఒకే ఓవర్‌లో 17 పరుగులు చేయాలని విక్రమ్ రాథోడ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను.. మూడు సిక్సర్లలో కంప్లీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కట్ చేస్తే ఐపీఎల్ ఆక్షన్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్న పిల్లాడు కదా.. అతన్ని ఎవరు కొంటారులే అనుకున్నారంతా. కానీ మొదటి నుంచి అతనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన రాజస్థాన్.. వేలంలో 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడే వైభవ్ లైఫ్ టర్న్ అయ్యింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు అంది వచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవడానికి కష్ట పడుతూనే ఉన్నాడు వైభవ్. రికార్డులను, చరిత్రను తిరగరాస్తూనే ఉన్నాడు. వైభవ్‌కు ఇది ఆరంభం మాత్రమే. ఓ ప్లేయర్ ఎదుగుతున్నాడంటే.. ప్రశంసల వెంటే విమర్శలు కూడా వస్తాయి. ఓర్వలేని వారు సంబంధం లేని ఆరోపణలు చేస్తుంటారు. సపోర్ట్ ఇవ్వడం అటుంచితే.. తొక్కేసేందుకే ప్రయత్నిస్తారు. గతంలో వైభవ్ వయసు 15 ఏళ్లు పైనే ఉంటుందని కొందరు ఆరోపించారు. వాటిని వైభవ్ తండ్రి సంజీవ్ కొట్టిపారేశారు. ఆరోపణలకు భయపడమని, టెస్టులు చేపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో ఇదో వివాదంగా మారకముందే క్లారిటీ రావడంతో విమర్శలు చేసేవారు వెనక్కి తగ్గారు.
Also Read: అమ్మబాబోయ్.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?
ఇలాంటి వారికి తన ఆటతోనే వైభవ్ సమాధానం చెప్పొచ్చు. కానీ బంగారంలాంటి భవిష్యత్తును మన చేజేతులా మనం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇలానే వండర్ కిడ్స్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కనుమరుగైన వారు ఉన్నారు. వారి నుంచి వైభవ్ చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి లిస్ట్‌లో మొదట వినిపించే పేరు పృథ్వీ షా. స్కూల్ క్రికెట్‌లో 546 పరుగులు చేసి సంచలనం సృష్టించిన.. షా అండర్-19 వరల్డ్ కప్ గెలిచాడు. టెస్ట్ డెబ్యూలోనే సెంచరీ చేశాడు. తదుపరి సచిన్, సెహ్వాగ్ అంతటి ప్లేయర్ అన్నారు. కానీ ఇప్పుడు ఫిట్‌నెస్ సమస్యలు, ఆఫ్-ఫీల్డ్ వివాదాలు, టెక్నిక్ లోపాలతో జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి వచ్చింది.
పృథ్వీ షా మాత్రమే కాదు.. ఉన్ముక్త్ చంద్ కూడా అంతే. 2012 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. నెక్స్ట్ స్టార్ అనుకున్నారు. కానీ డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడలేమి, ఐపీఎల్‌లో ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో భారత జట్టులోకి రాలేకపోయాడు. ఇలాంటిదే మరో పేరు సర్ఫరాజ్ ఖాన్. చిన్న వయసులోనే ముంబై స్కూల్ క్రికెట్‌లో రికార్డులు సృష్టించిన ఈ ప్లేయర్.. ఐపీఎల్‌లో చిన్న వయసులోనే ఆడాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలు, క్రమశిక్షణ కారణాల వల్ల చాలా కాలం టీం ఇండియా పిలుపు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చినా.. ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.
ఈ విషయంలో మనం అస్సలు మరిచిపోలేని మరోపేరు వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్‌తో కలిసి చిన్నప్పుడు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ కంటే వేగంగా పరుగులు చేశాడు. కానీ కొన్ని స్వయంకృతాపరాధం వల్ల కెరీర్ నాశనమైంది.
ఐపీఎల్ అనేది ఎంతటి క్రేజ్‌ను తీసుకొస్తుందో అందరికి తెలిసిందే. టీనేజ్ వయసులోనే కోట్లాది రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టులు, మీడియా హైప్ రావడం వల్ల ఆటగాళ్లు గాల్లో తేలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆటపై శ్రద్ధ తగ్గిస్తే.. కెరీర్ నాశనానికి అడుగు పడినట్టే.
ఐపీఎల్ మ్యాచ్‌లు వేరు.. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు వేరు. అంతర్జాతీయ లెవెల్‌లో ఫిట్‌నెస్, కన్‌సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. మోడ్రన్ క్రికెట్‌లో బౌలర్లు వీడియో అనాలిసిస్ ద్వారా బ్యాటర్ల బలహీనతలను వెంటనే కనిపెట్టేస్తారు. ఒకసారి లోపాలు బయటపడ్డాక, వాటిని సరిదిద్దుకోకపోతే కెరీర్ క్లోజ్ అవుతుంది. అదే సమయంలో భారీ అంచనాలను కంటిన్యూ చేయడం కూడా కష్టమైన పనే. వైఫల్యాలు ఎదురైనప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక ఫామ్ కోల్పోతారు. వీటన్నింటి విషయంలో వైభవ్ జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్ గ్లామర్ బాగుంటుంది, కానీ నిజమైన ఆటగాడిగా ఎదిగేది రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ లాంటి రెడ్-బాల్ క్రికెట్ ద్వారానే. వైభవ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నించాలి.. సాధించాలి. అప్పుడే జస్ట్ ఏ ఐపీఎల్ ప్లేయర్ అనే ముద్ర కనుమరుగవుతుంది. వీటన్నింటిని అధిగమించి.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వైభవ్ సత్తా చాటడమే కాదు.. మరో సూపర్‌స్టార్‌గా ఎదగాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్.. బేబీ బాస్.
Also Read: సీన్ రివర్స్.. ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు అంటున్న ఐటీ దిగ్గజాలు.. ఎందుకో తెలుసా?
Story by: Anup, Big Tv