Vangaveeti Mohana Ranga: ఆంధ్రప్రదేశ్లో సామాన్యుల దగ్గర నుండి బడా రాజకీయ నాయకులు వరకు వంగవీటి రంగా పేరు చెప్తే తెలియని వారు ఉండరు.. దివంగత రంగా పేరు చెప్పుకుని ఇప్పటికీ కొంతమంది బతికేస్తున్నారు… అనేకమంది రాజకీయ నాయకులు పార్టీలకు సంబంధం లేకుండా ఆ నాయకుడి పేరుని వాడేసుకుంటున్నారు…. కుల రాజకీయాలు కోసం, రాజకీయ సమావేశాల కోసం, ఫోటోలు పెట్టుకుని ఓట్లు దండుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు…. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరున్న రంగాని మూడు దశాబ్దాలుగా కులానికి సంబంధం లేకుండా సామాన్యులు గుండెల్లో పెట్టుకుంటే .. సొంత కులం వాళ్ళు పదవుల కోసం, రాజకీయాల కోసం ఆ మహా నాయకుడు పరువు తీస్తున్నారా?…. ప్రజల మనిషిని కుల రాజకీయ నాయకుడిగా మార్చి వాడుకుంటున్నది ఎవరు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా బెజవాడ రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా పేరు తెలియని వాళ్లు బహుశా మూడున్నర దశాబ్దాల క్రితం నుండి ఇప్పటి వరకు ఉండరేమో…. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, కష్టాల్లో ఉన్న ప్రజలకు కనిపించే దేవుడుగా, రాజకీయాల్లో కులాన్ని కాకుండా మనుషులను శక్తిగా మార్చుకున్న నాయకుడిగా, బెజవాడ బెబ్బులిగా వంగవీటి మోహన రంగాకు పేరు ఉంది…. మూడున్నర దశాబ్దాల క్రితం వంగవీటి మోహన రంగా సామాన్యుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం,నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా వెనకాడలేదు…. వంగవీటి రంగా కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండే అనుచరులు వెన్నంటే ఉండేవాళ్ళు….
తనను నమ్ముకున్న సామాన్యులను కులాలకతీతంగా సమానంగా చూడడమే కాకుండా రాజకీయాల్లో సమాన భాగస్వామ్యాన్ని కల్పించి వారికి దేవుడయ్యారు…. అలాంటి వంగవీటి మోహన రంగా ఇప్పుడు రాజకీయ చదరంగంలో అసువులు బాసిన 37 ఏళ్ల తర్వాత కూడా అవమానాలు పడుతున్నారు… సొంత కులస్తులైన కాపు వర్గీయులే రంగా పేరుని, ఫోటోని వాడుకుని పరువు తీసేస్తున్నారు… వంగవీటి మోహన రంగా అనే ఒక పేరుతో ఎదిగిన ఎంతో మంది నాయకులు, ఇప్పుడు మొహం చాటేసి పదవులను కాపాడుకోవడానికి రంగా పేరును పలకడానికి కూడా వెనకాడుతున్నారు.
1988 డిసెంబర్ 26వ తేదీన వంగవీటి మోహన రంగా బెజవాడలో దీక్ష చేస్తూ హత్యకు గురైనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్లర్లు జరిగాయి.. హత్య తర్వాత వంగవీటి రంగా ఎంతో మందికి దేవుడయ్యారు… రాజకీయ నాయకులకి మహా నేత అయ్యారు … కుల రాజకీయాలు చేసే వారికి తమ వాడయ్యారు… వంగవీటి మోహనరంగా చనిపోయిన తర్వాత ఈ 37 సంవత్సరాల్లో అన్ని రాజకీయ పార్టీలు రంగాను సొంతం చేసుకునే ప్రయత్నం చేశాయి … బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరు ఉన్న రంగాను కాపు సామాజిక వర్గానికి పరిమితం చేసేలా రంగాను కాపు సామాజిక వర్గ నేతగా మార్చేశారు… రాజకీయ పార్టీ ఏదైనా కాపు నాయకుడు ఎన్నికల్లో నిలబడితే వంగవీటి మోహనరంగా ఫోటో పోస్టర్లలో, బ్యానర్లలో కచ్చితంగా కనిపిస్తుంది…. వంగవీటి మోహనరంగా కాపు కులానికి ఐడెంటిటీగా మారిపోయారు… రంగా చనిపోయి 37 ఏళ్లు గడిచిన తర్వాత కూడా నేటికీ కాపు సామాజిక వర్గాలలో రంగా ఇమేజ్ మచ్చుకైనా పోకుండా ఉంది అంటే రంగా స్థాయి ఎంత ఎత్తులో ఉందో అర్థం చేసుకోవచ్చు…. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు నేతలు కుల సంఘాల వాళ్ళు రంగా పేరు వాడుకుని ఆయన పరువును బజారున పెట్టేస్తూ అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది.
ఉత్తరాంధ్రలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ పేరుతో గత ఐదేళ్లుగా కాపునాడు కార్యక్రమాల నిర్వహణ జరుగుతూ వస్తోంది… బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా వంగవీటి మోహన రంగాను ప్రొజెక్టు చేస్తూ.. కాపు యువతను ఆకర్షించి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.. ఇప్పటివరకు వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధా అటు ప్రజారాజ్యం పార్టీ, తర్వాత కాంగ్రెస్, వైసీపీ, ఇప్పుడు టీడీపీలో రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నా అన్ని పార్టీలు వంగవీటి రాధాను వాడుకున్నాయి తప్ప.. సరైన గుర్తింపు రంగా వారసుడికి ఇవ్వలేదు…
వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన వంగవీటి రాధాను కాపు సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేలా2024 ఎన్నికల్లో వాడుకున్నారు తప్ప… ఎలాంటి పదవి ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారనే టాక్ నడుస్తోంది. రాజకీయంగా వంగవీటి రంగా ఫ్యామిలీలో ఎలాంటి అలజడులు వస్తున్నాయో బయటకు తెలియకపోయినా వంగవీటి రాధా రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్గా ఉండడంతో, వంగవీటి కుమార్తె ఆశాజ్యోతి వంగవీటి రంగా ఆశయ సాధన కోసం పని చేస్తానంటూ తెరమీదకి రావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది… ఆశాజ్యోతి ఏ రాజకీయ పార్టీలో చేరుతారు అనేది స్పష్టత లేకపోయినా వంగవీటి ఫ్యామిలీ నుండి మరొకరు రాజకీయాల్లోకి అడుగు పెడతారు అని తెలియడంతో మళ్లీ రంగా ఇమేజ్ ను ముక్కలు ముక్కలుగా చేసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నేతలు.
డిసెంబర్ 26వ తేదీ విశాఖలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ రంగానాడు పేరుతో వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి మహాసభను విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేసింది.. పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకులతో పాటు ఇతర ప్రముఖులను కూడా ఈ బహిరంగ సభకు ఆహ్వానించడంతో పాటు వంగవీటి రంగా కుమార్తె ఆశాజ్యోతిని ముఖ్య అతిథిగా పిలవడంతో విశాఖలో జరిగే భారీ బహిరంగ సభకు హైప్ వచ్చింది… సమయం దగ్గరికి వచ్చే కొద్ది ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో రంగానాడు సభ జరుగుతుందో లేదో అని అనుమానాలు తెరమీదకు వచ్చాయి…. ముందుగా అనుమతించిన ఆర్కే బీచ్లో సభకు అనుమతులు రద్దు చేశారు… తర్వాత పార్క్ హోటల్ సమీపంలో సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి.. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు కానీ అక్కడ కూడా అనుమతులు రద్దు చేశారు…. చివరకు ఆఖరి నిమిషంలో ఇనార్బిట్ మాల్ సమీపంలో రంగానాడు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో రాధా రంగ రాయల అసోసియేషన్ చక చకా ఏర్పాట్లు చేసుకుంది.
ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా వంగవీటి రంగాను వాడుకున్న నేతలు, అభిమానులు అని చెప్పుకుంటున్న కొంతమంది తమ భవిష్యత్తు తప్ప ఇంకా ఏది అవసరం లేదు అని భావించడంతో విశాఖలో జరిగిన రంగానాడు సభ అట్టర్ ప్లాప్ గా మారిపోయింది… రాజకీయ పార్టీలు రంగానాడురే సభకు వెళ్లడానికి వీలులేదని ఇంటర్నల్ గా తమ నాయకులకు ఆదేశాలు ఇవ్వడంతో హాజరవుతారు అనుకున్న అన్ని పార్టీల నాయకులు డుమ్మా కొట్టారు… కాపు నేతలు అని చెప్పుకుంటున్న నాయకులందరూ మొహాలు చాటేసి అవకాశవాద రాజకీయ నాయకులుగా మారిపోయారు…. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా బలమున్న కాపు సామాజిక వర్గ నేతలతో పాటు వంగవీటి మోహన రంగా అనుచరులు,అభిమానులు ఈ సభకు హాజరవుతారని భావిస్తే సభకు నేతలు మొహం చాటేయడంతో సభ వెలవెలబోయింది…
కొంతమంది కావాలనే వంగవీటి మోహనరంగా ఇమేజ్ను డామేజ్ చేయడానికి అభిమానులను, అనుచరులను, నాయకులను రాకుండా చేస్తున్నారనే విమర్శలు తెరమీదకు వచ్చాయి…. స్వయానా వంగవీటి రంగా కుమార్తె ఆశాజ్యోతి రాజకీయ పార్టీల తీరు మీద తీవ్ర స్థాయిలో సభా వేదికనుండే విమర్శలు చేశారు….
దీనిని బట్టి చూస్తే వంగవీటి రంగాను రాజకీయంగా వాడుకోవడానికి తప్ప కాపు సామాజిక వర్గం నేతలు, రాజకీయ నాయకులు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది… దీనికితోడు వంగవీటి ఆశాజ్యోతి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూటమి పార్టీల నాయకులకు అనుమానం రావడంతో రంగానాడు కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేలాగా ఇంటర్నల్‌గా ఆదేశాలు ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. లక్ష మంది రంగానాడు సభకు హాజరవుతారని భావించిన నిర్వాహకులు 1000 మంది కూడా హాజరు కాకపోవడంతో ఢీలా పడిపోయారు. మరి ఎప్పటికైనా వంగవీటి రంగా వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధా, రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న ఆశాజ్యోతి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని రంగా ఇమేజ్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.
Storty by Ajay , Big Tv