E-Paper
Advertisement

NTR తరహాలో ‘సూపర్ సక్సెస్’ సాధ్యమేనా? 100 సీట్ల దిశగా విజయ్ అడుగులు.. ఎగ్జిట్ పోల్స్ సంచలనం!

NTR తరహాలో ‘సూపర్ సక్సెస్’ సాధ్యమేనా? 100 సీట్ల దిశగా విజయ్ అడుగులు.. ఎగ్జిట్ పోల్స్ సంచలనం!
Advertisement

Vijay Politics: తమిళ పతాకం మరింత ఎత్తుకు వెళ్లాలి.. రాష్ట్రానికి కొత్త నాయకుడి అవసరం వచ్చింది అంటూ టీవీకే పార్టీ గీతం ఉంటుంది. మరి తమిళ ఓటర్లలో విజయ్ స్థానమేంటన్నది మే 4న తేలబోతోంది.

సినిమా నుంచి సింహాసనం వరకు

తమిళ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుందామని చాలా మంది ప్రయత్నించారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, కమల్ హాసన్, విజయ్ కాంత్ దగ్గర్నుంచి ఇప్పుడు విజయ్ దాకా లిస్టు పెద్దగానే ఉంది. కానీ అక్కడ ముగ్గురు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకే అధికారం చేతికొచ్చింది. మిగితా వారికి అది అందని ద్రాక్షగానే ఉంది. కొందరైతే మంచి రోజు రాకపోతుందా అని ఎదురుచూసే వాళ్లూ ఉన్నారు. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందన్న ప్రశ్నల నుంచి శోధించి సాధించాలి అంటూ ఇప్పుడు విజయ్ స్పీడ్ పెంచాడు. ఎన్నికల్లో హవా ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో జోష్ పెరిగింది.

తమిళ రాజకీయాల్లో విజయ్ పరీక్ష

Advertisement

ఎంజీఆర్ వారసురాలిగా వచ్చి, తమిళ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగారు జయలలిత. 1991-2016 మధ్య 14 ఏళ్లకు పైగా తమిళనాడు సీఎంగా పని చేశారు. అటు సినీ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ పార్టీ DMDK ఇప్పటికే ఉంది. కానీ అధికారం చేజిక్కించుకునే స్థాయికి రాలేకపోయింది. DMDK పార్టీని స్థాపించి, 2011లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. కానీ తర్వాత ఆ ప్రభావాన్ని కాపాడుకోలేకపోయారు. 2023, డిసెంబర్ 28న విజయ్ కాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక అక్కడితో ఆ పార్టీ ఎఫెక్ట్ ముగిసిపోయింది. ఇక కమల్ హాసన్ పార్టీ కూడా పెద్దగా స్పీడ్ పెంచలేకపోయింది. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం -MNM 2018లో స్థాపించినా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ప్రకటించి పోటీ చేయకుండా సైడైపోయారు కమల్ హాసన్. రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై చాలా కసరత్తులు చేసి చివరికి అనారోగ్యకారణాలతో పొలిటికల్ ఎంట్రీ నుంచి తప్పుకున్నారు. సో ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది.

విజయ్‌కు కింగ్ మేకర్ ఛాన్స్!

మరికొన్ని సర్వే సంస్థలైన పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్ ప్రకారం చూస్తే విజయ్ పార్టీ కేవలం 15-25 సీట్లకే పరిమితం కావొచ్చని అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కలు నిజమైతే విజయ్ పరిస్థితిని చిరంజీవి లేదా పవన్ కల్యాణ్ ప్రారంభ రాజకీయాలతో పోలుస్తున్నారు. 2009లో సినీ అగ్ర నటుడు చిరంజీవి భారీ అంచనాలతో వచ్చినా కేవలం 18 సీట్లకు పరిమితమయ్యారు. ఇతర సర్వేలు నిజమైతే విజయ్ కూడా ఓట్ల శాతాన్ని సాధిస్తారు కానీ సీట్లు గెలవలేకపోవచ్చు. అటు పవన్ కల్యాణ్ మొదటగా రెండు సీట్లలో పోటీ చేశారు. రెండిట్లోనూ ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ కూడా రెండు చోట్లా పోటీ చేశారు. ఒకటి చెపాక్, మరొకటి పెరంబూర్. ఈక్వేషన్స్ సేమ్ గా కనిపిస్తున్నాయి. హంగ్ వస్తుందని అంచనా వేస్తున్న సర్వేల ప్రకారం చూస్తే తమిళ రాజకీయాల్లో విజయ్ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందంటున్నారు.

చిరంజీవి రాజకీయ ప్రయాణం

Advertisement

సినీ రంగం నుంచి వచ్చి రాజకీయ పార్టీ స్థాపించిన వారిలో చిరంజీవి ఒకరు. 2008లో భారీ అంచనాలతో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన ప్రస్థానం మిక్స్ డ్ రిజల్ట్స్ ఇచ్చింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం కొత్త పార్టీ అయినప్పటికీ 16.32% ఓట్ల షేర్ సాధించడం ఒక అద్భుతం. 18 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడో అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించారు. సామాజిక న్యాయం నినాదంతో వెనుకబడిన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చారు. ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో 2011లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం నెరవేరలేదు. చివరికి యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ 2014 తర్వాత రాజకీయాలకు దూరమై మళ్లీ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.

పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీ

ఇక ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిచ్యువేషన్ చూద్దాం. 2014లో జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019లో ఓడిపోయినా పార్టీని వదలకుండా 10 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పోరాడుతూనే వచ్చారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. ముఖ్యంగా యువతలో బలమైన పట్టు సాధించారు. 2024 ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో కింగ్ మేకర్ పాత్ర పోషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. 2019లో తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోవడం, పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలవడం ఆయన కెరీర్‌లో పెద్ద ఎదురుదెబ్బ. అయినా సరే పట్టు వదలలేదు. 2024 ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో 21 స్థానాల్లో పోటీ చేసి 21 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పార్టీ పెట్టిన వెంటనే అద్భుతాలు సృష్టించకపోయినా.. ఓపికతో రాణించారు. పట్టు నిలుపుకొన్నారు.

హీరోలకు అసలు పవర్ ఎక్కడ?

ఇక నార్త్ విషయానికి వస్తే సౌత్ హీరో, హీరోయిన్ల మాదిరి పొలిటికల్ గా డేరింగ్ చేయలేకపోయారు. అమితాబ్ బచ్చన్ అలహాబాద్ నుండి ఎంపీగా గెలిచారు. కానీ రాజకీయాలు పడక మధ్యలోనే తప్పుకున్నారు. ధర్మేంద్ర, హేమమాలిని, సన్నీ డియోల్ లాంటి వాళ్లు బీజేపీ తరపున ఎంపీలుగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. జయప్రద, జయబచ్చన్ లాంటి వాళ్లు సమాజ్ వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీల ద్వారా రాణించారు. నార్త్ లో ఎంపీలుగా, పార్టీల స్టార్ క్యాంపెయినర్లుగా మాత్రమే పని చేశారు. నార్త్ లో ఫిలిం స్టార్లు పొలిటికల్ పార్టీలు సొంతంగా పెట్టలేకపోయారు. అభిమానం విషయంలో సౌత్ వేరు, నార్త్ వేరు. రెండు చోట్లా హీరోలను ఆరాధిస్తారు. కానీ సౌత్ లో మాత్రం హీరో ఏ స్టెప్ తీసుకుంటే వాటికి సపోర్టివ్ గా అభిమానులు ఉంటారు. తమిళ రాజకీయంలో ఆ రెండు పార్టీలు తప్ప మూడో పార్టీ పెద్దగా సక్సెస్ అయింది లేదు. కానీ విజయ్ ని విజయం వరిస్తుందా మరి?

కేజ్రీవాల్ సక్సెస్ సీక్రెట్ ఏంటి?

నిజానికి పొలిటికల్ పార్టీ ఎవరైనా పెట్టొచ్చు. ఫిల్మ్ స్టార్లే కాదు.. రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్లు కూడా రాజకీయ పార్టీలు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారెందరో ఉన్నారు. అందులో కొందరికి సక్సెస్ వచ్చింది. ఇంకొందరికి నిరాశ తప్పలేదు. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్‌లో పార్టీ పెట్టి, సరిగ్గా ఏడాది తర్వాత జరిగిన 2013 ఢిల్లీ ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కావడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో ఇక్కడ అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా ఎగిసి పడి.. సెంటిమెంట్ గా బలపడి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చింది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి అదో ఇంధనంగా పని చేసింది. వర్కవుట్ అయింది. జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ పెట్టినా వర్కవుట్ కాలేదు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్.. సక్సెస్ అయ్యారు. 2014లో సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చారు. కోదండరాం పార్టీ సక్సెస్ కాలేదు.

విజయ్ పార్టీకి మే 4 టెస్ట్

సో తక్కువ టైంలో పొలిటికల్ పార్టీ క్లిక్ కావాలంటే బలమైన క్రేజ్ అయినా ఉండాలి.. లేదంటే ఏదైనా బలమైన సెంటిమెంట్ ఉండాలి. ఒక వేవ్ రావాలి. అప్పుడే తక్కువ టైంలో జనం నమ్మి ఓట్లేస్తుంటారు. విజయ్ పార్టీ విషయంలో రెండేళ్లు తక్కువ సమయమే. అయినా బాగానే బండి లాక్కొచ్చారు. అటు తమిళ జనం కూడా ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే ఇంతేనా.. కొత్త పార్టీకి అవకాశం ఇవ్వొద్దా అన్న ఆలోచన కూడా విజయ్ పార్టీవైపు ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. మే 4న ఏదైనా జరగొచ్చు.

కథ మార్చేస్తా.. విజయ్ శంఖారావం

ఆగస్టు 22, 2024న పార్టీ జెండా ఆవిష్కరించడం మొదలు.. పార్టీ అజెండాను ప్రకటించే దాకా అన్నీ ఊర మాస్ స్పెషలే కనిపించాయి. తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు విజయ్. తాను రాజకీయాల్లో చిన్న పిల్లాడినే ఒప్పుకుంటాను అని అంటూనే.. బుసలు కొట్టే పామును పట్టుకునేందుకు పిల్లాడిగా తాను రెడీ అంటూ ప్రత్యర్థులకు మొదట్లోనే సవాల్ విసిరారు. పార్టీ స్థాపించిన రోజు పాండ్యరాజు కథ చెబుతూ అందరినీ అసలు కథనంలోకి తీసుకెళ్లాడు. తొలి సభతోనే తలపతి విజయ్ విశ్వరూపం చూపించాడు విజయ్. రాజకీయాల్లో బచ్చా కాదు… బుసలు కొట్టే పామును పట్టుకుంటాననే ధీమాతమిళిగ వెట్రి కళగంతో తమిళ పతాకం మరింత ఎత్తుకు వెళ్లడమే లక్ష్యమన్నాడు. కథ మారుస్తానంటూ విజయ్ శంఖారావం పూరించాడు.

రాజకీయాల్లో విజయ్‌కు గేమ్ చేంజరా?

తమిళ దర్శక నిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తనయుడిగా 1984లో వెట్రి అనే మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా జోసెఫ్‌ విజయ్‌ వెండి తెరకు పరిచయం అయ్యారు. 18 ఏళ్ల వయసులో నాళ ఇయా తీర్పు తో హీరోగా మారాడు. రొమాంటిక్‌, మాస్‌ ఇమేజ్‌లతో అగ్రతారగా ఎదిగాడు. ఒక పక్క మెసేజ్‌ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూనే.. మరోవైపు తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవతో గుర్తింపు దక్కించుకున్నాడు. ఒక అల ఎలాగైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో.. కొత్త రాజకీయ పార్టీ విషయంలోనూ మొదట్లో అలాగే ఉంటుంది. అయితే ఆ అలను మరింత ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడమే లక్ష్యంగా విజయ్ భారీ టార్గెట్లే పెట్టుకున్నాడు. తమ పొలిటికల్ ప్లాన్ పక్కా ప్రాక్టికల్ అని చెప్పడం ద్వారా తమిళనాట రాజకీయాల్లో ఎలా నెగ్గుకురావాలో మొదట్లోనే చెప్పేశాడు.

సీఎం రేసులో విజయ్..

ఎగ్జిట్‌ పోల్‌ లెక్కల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. 18-19 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని సర్వే సంస్థకు చెప్పారు. 20-29 ఏళ్ల వయసు వారిలో 59 శాతం మంది విజయ్‌కే తమ మద్దతు అని చెప్పగా, 30–39 ఏళ్ల వయసు వారిలో 45 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామన్నారు. అంతెందుకు రాష్ట్రంలో తదుపరి సీఎం ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్‌ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్‌ సీఎం కావొచ్చని 37 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ విజయ్ వరుసగా ప్రముఖ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

యుద్ధభూమిలో విజయ్… చెక్‌మేట్ ప్లాన్ రెడీ!

యుద్ధభూమి చూస్తే పెద్దది.. చుట్టూ బలమైన ప్రత్యర్థులు. విజయ్ పార్టీ చూస్తే రెండేళ్ల అనుభవం కూడా లేదు. బలా బలాలు ఎలా ఉన్నా… వెనకా ముందు ఎవరు ఉన్నా లేకపోయినా.. క్లాస్ అయినా మాస్ అయినా… ఫైనల్ గా శత్రువులను అధిగమించడం ముఖ్యం.. యుద్ధం గెలవడమే ముఖ్యం. ఇదే తమిళిగ వెట్రి కళగం విజయ్ పార్టీ పెట్టుకున్న లక్ష్యం. పెరియార్‌ ఈవీ రామసామి, కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, వేలు నాచియార్‌, అంజలై అమ్మాళ్‌ వేసిన బాటలో నడుస్తామనడం తమిళులను ఆకట్టుకుంది. అటు సినిమాల నుంచి వచ్చి సక్సెస్ అయిన MGR, NTR ప్రేరణతో పని చేస్తానన్నారు. ఇది సినీ అభిమాలను ఆకర్షించింది. రాజకీయ చదరంగంలో చెక్ మేట్ పెట్టడం అంత సులువు కాదు. కానీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తానన్నారు. తానే చెక్ మేట్ పెడుతానన్నారు. వైకుంఠపాళిలో పెద్దపాము మింగితే కథ మొదటికే వస్తుంది కదా… కానీ ఆ పెద్దపామునే పట్టుకుని ఆటాడిస్తానన్న ధైర్యం ప్రచారాల సమయంలో విజయ్ లో కనిపించింది.

విజయ్ కొత్త రాజకీయ నినాదం

తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ ఉన్న టైంలో విజయ్ కొత్త పార్టీ TVK వచ్చింది. వస్తూనే స్పీడ్ పెంచింది. తమిళనాడులో డీఎంకేకు 75 ఏళ్ల చరిత్ర ఉండగా… అన్నాడీఎంకేకు 50 ఏళ్ల హిస్టరీ ఉంది. తమిళనాడుకు ఇప్పుడు చరిత్ర కాదు.. భవిష్యత్ కావాలంటూ విజయ్ ముందుకొచ్చారు. మార్పును బలంగా ప్రస్తావించాడు విజయ్. తమిళులు కూడా కనెక్ట్ అయ్యారా లేదా అన్నది ఫలితాల రోజు మే 4న తేలబోతోంది. ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయ వాదాన్ని వేరు చేయబోమని, తమిళనాడుకు అవి రెండు కళ్లులాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్థాంతాలే తమ భావజాలమనడం చాలా మందిని ఆకట్టుకుంది. పాలిటిక్స్ లో విజయం సాధించిన వారు, ఓడిన వారు ఇలా రెండు స్టోరీలనూ చదివే వచ్చానని చెప్పడం ద్వారా టార్గెట్ పై విజయ్ ఎంత గురి పెట్టారో అర్థం చేసుకోవచ్చు.

విజయ్ కౌంటర్లు హిట్ అయ్యాయా?

సినిమా ఆర్టిస్ట్ అన్న విమర్శలకు MGR, NTR పేర్లు చెప్పి, వారి సక్సెస్ గురించి చెప్పి కౌంటర్లు ఇస్తూ వచ్చారు. అభ్యుదయ సమాజంలో పుట్టి, అభ్యుదయానికి పాటుపడిన అంజలై అమ్మాళ్ మార్గదర్శి అని, ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ, అంజలై అమ్మాళ్ స్వాతంత్య్రం కోసం పోరాడారని సెంటిమెంట్ అస్త్రాలు ప్రయోగించారు. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం చూస్తే.. పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35 శాతం మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్‌ వైపునకు మళ్లామని 77 శాతం మంది తెలిపారు. కేవలం విజయ్‌ హుందాతనం, ఛరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెప్పారు. కొత్తతరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్‌కి కలిసిరావొచ్చని ఎగ్జిట్‌ పోల్‌ పేర్కొంది.

విజయ్ ఫార్ములా హిట్ అయ్యిందా?

రాజకీయాలంటే ఆవేశపూరితంగానే మాట్లాడాలన్న రూల్ లేదని, అందుకు భిన్నంగా కూడా మాట్లాడి అందరి మనసులో చోటు సంపాదించుకోవచ్చన్న ప్రయత్నం విజయ్ లో కనిపించింది. విద్య, మహిళల భద్రత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిచ్చే అజెండాతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ , స్వచ్ఛత వంటి ప్రాథమిక వనరులను పొందేలా సంస్కరణలు తేవడం, మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ కోసం ఇలాంటివన్నీ ఓటర్లపై బాగా పని చేశాయి. సో మై యాక్సిస్ ఎగ్జిట్ పల్స్ నిజమైతే తమిళనాట కొత్త గేమ్ ఖాయమే. సో ఇక్కడ ఎవరి లెక్క వారిదే. ఎవరి రాజకీయం వారిదే. అంతిమ విజయం కోసమే ఈ పోరాటం. ప్రస్తుత యాక్సిస్ మై ఇండియా వంటి సర్వేల అంచనా ప్రకారం, విజయ్ ఎన్టీఆర్ తరహాలో సర్ ప్రైజ్ సక్సెస్ సాధించే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఒకవేళ ఆయన 100 పైగా సీట్లు గెలిస్తే, భారత రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అత్యంత వేగంగా సక్సెస్ అయిన సినీ స్టార్‌గా నిలుస్తారు.

Also Read: అద్దాల మేడలపై ప్రేమ.. పేదలపై నిర్లక్ష్యం.. బాబుపై రజిని ఫైర్!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×