AP Politics: హిందూ మతంపై కొంత మంది కుట్రలు చేస్తున్నారు.. డబ్బు ఆశ చూపి.. మతం మారాలని అమాయకుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు.. హిందుయిజంపై ఎవరైనా కన్నేత్తి చూసినా, మతం మార్పిడులకు ప్రొత్సహించిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడమే కాకుండా.. గుణపాఠం నేర్పిద్దామని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలకమైన ట్వీట్ చేశారు.. అలాగే గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని కూటమి సర్కారును ఆయన డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. అంటే సడన్‌గా హిందుత్వ వాయిస్ వినిపిస్తున్న సాయిరెడ్డి .. జనసేనాని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారా?
ఏ పార్టీ సాయిరెడ్డిని నేర్చుకోవడానికి ముందుకొస్తుంది?
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన ఈ విషయంపై దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు.. ఆయన్ని ఎవరు ఆహ్వానిస్తారు అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తిగా మారుతున్నాయి. ఎవరిని చూసినా.. ఏ పార్టీని గమనించినా విజయసాయిరెడ్డిని చేర్చుకునే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆ క్రమంలో తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది.
2 దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై విచారణకు డిమాండ్
తన అధికార ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయంశంగా మారింది. దేశంలో అత్యధికుల మత విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ఉందని విజయసాయరెడ్డి అభిప్రాయపడ్డారు. మతమార్పిడులపై ఓ యూట్యూబర్ చేసిన వీడియోను తన ఎక్స్ లో షేర్ చేసిన విజయసాయిరెడ్డి.. ఆ యూట్యూబర్ వాదనతో ఏకీభవిస్తున్నట్లు పోస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరారు. హిందూ మతాలపై కుట్రలు జరుగుతున్నాయని, అటువంటి కుట్రలను సహించేది లేదని కూడా విజయసాయి తన ట్వీట్ లో స్పష్టం చేశారు. మత మార్పిడులకు ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన బుద్ది చెప్పి గుణపాఠం నేర్పాలని విజయసాయి పిలుపునిచ్చారు.
వైరల్ అవుతున్న విజయసాయిరెడ్డి ట్వీట్..
తన అధికారిక ఎక్స్ లో ఆయన చేసిన ట్వీట్ కొద్ది సమయంలోనే వైరల్ అయింది. ఆయన ట్వీట్ పై చాలా మంది ప్రతిస్పందిస్తున్నారు. ఆయన పనిచేసిన వైసీపీ పార్టీ హయాంలోనే ఎక్కువ మత మార్పిడులు జరిగాయని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. వైసీపీ ఉన్న సమయంలో ఎప్పుడూ మతమార్పిడులపై ఎందుకు స్పందించలేదని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలని విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్ కూడా చర్చకు దారితీస్తుంది.
మతాలను ప్రస్తావిస్తూ పోస్టు చేయడంపై సందేహాలు..
విజయసాయిరెడ్డి ట్వీట్ పై ఎక్స్ వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. మరోవైపు దాదాపు 20 ఏళ్లుగా రాష్ట్రంలో రాజకీయం చేసిన విజయసాయిరెడ్డి ఎన్నడూ లేనట్లు మతాలను ప్రస్తావిస్తూ పోస్టు చేయడంపై పొలిటికల్ సర్కిల్స్ లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో ప్రకటించిన విజయసాయిరెడ్డి.. మళ్లీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాయిరెడ్డి రాజకీయంగా ఎటు అడుగుల వేస్తారు?
ఇటీవల విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఆయన ఖచ్చితంగా మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి అడుగులు ఎటు వైపు అనేది ప్రధానంగా చర్చకు దారి తీస్తోంది. హిందుత్వం నినాదం ఎత్తుకోవడంతో ఆయన చూపు బీజేపీ లేదా జనసేన వైపు పడిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. మతమార్పిడులను సహించేది లేదని, మతమార్పిడి చేసే వారిని కఠినంగా శిక్షించాలని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి వైసీపీలో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడు ఆయన చేయలేదు. అంతే కాదు కులమతాల గురించి కూడా పెద్దగా ఆయన స్పందించిన పరిస్థితి లేదు. అంతెందుకు తిరుమల శ్రీవారి లడ్డు విషయం వివాదానికి గురి అయినప్పుడు, కల్తీ జరిగిందన్న విమర్శలు వచ్చినప్పుడు కూడా సాయి రెడ్డి స్పందించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని అదేవిధంగా మతమార్పిడిలను అరికట్టాలని చెబుతుండడం వంటివి గమనిస్తే ఆయన రాజకీయంగా అటు బిజెపి లేదా ఇటు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుందనే టాక్ నడుస్తోంది.
పవన్ అంటే తనకు అభిమానమని ప్రకటించిన సాయిరెడ్డి
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని ఇప్పటివరకు ఆయన పై ఎలాంటి విమర్శ తాను చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఆయనను దగ్గర చేసే అవకాశం ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే జనసేన కూడా గత రెండు సంవత్సరాలుగా హిందూ ధర్మం వైపు సనాతన ధర్మం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాలు జరిగినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేన ను ఆకర్షించే లాగా ఉన్నాయి అన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తుందట. అయితే దీనికి మరో వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీని పరోక్షంగా ఆయన విమర్శించారని తద్వారా బిజెపికి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన కూడా ఉందట. బీజేపీ గురించి ప్రత్యేకంగా సాయి రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు వినిపించాల్సిన అవసరం లేదు. పైగా కేంద్రంలోని పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఎలానో కొనసాగుతున్నాయి.
Also Read: తెలంగాణలో భీకరంగా పెరుగుతున్న చలి.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త..!
ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా సాయి రెడ్డి ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. సాయి రెడ్డి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారా.. లేక కూటమి ప్రభుత్వానికి దగ్గర ప్రయత్నం చేస్తున్నారా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉందంటున్నారు.. సో మొత్తానికి సాయి రెడ్డి రాజకీయంగా రీఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లే భావించాలనే టాక్ వినిపిస్తుందట. మరి ఏం జరుగుతుంది.. ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు.. ఏ పార్టీ సాయి రెడ్డికి ఆహ్వానం పలుకుతుంది.. ఇవన్నీ ఇప్పటికి ప్రశ్నలే. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది చూడాలి.. అంతే కాదు. సాయిరెడ్డి.. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష ..శ్రీరామ రక్ష అని తెలిపారు. మొత్తానికి విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.
Story By Vamshi Krishna, Bigtv