BigTV English

YS Jagan Mohan Reddy: జగన్ రాజకీయ భవిష్యత్‌ని ఆమె మార్చేస్తుందా?

YS Jagan Mohan Reddy: జగన్ రాజకీయ భవిష్యత్‌ని ఆమె మార్చేస్తుందా?

What is the future of YS Jagan Mohan Reddy: వైసీపీ స్థాపించిన పన్నెండేళ్లలో బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లని జగన్.. ఓటమి తర్వాత పదేపదే బెంగళూరు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అయితే ఏపీ లేకపోతే లోటస్ పాండ్ అన్నట్లు రాజకీయం నడిపించారు. అధికారంలోకి వచ్చాక అప్పటికే కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే పాలన సాగించారు. అయితే ఘోరపరాజయం పాలయ్యాక.. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికి ఇష్టపడటం లేదా?.. లేకపోతే బెంగళూరు కేంద్రంగా సరికొత్త రాజకీయం మొదలుపెట్టారా? తాజాగా తాడేపల్లి వచ్చిన ఆయన మళ్లీ..


జగన్ అంటే తాడేపల్లి ప్యాలెస్.. తాడేపల్లి అంటే జగన్ అన్నట్లు 2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాలన నడిచింది. ఆ అయిదేళ్లు రాజకీయమంతా తాడేపల్లి చుట్టే తిరిగింది. అయితే అదే జగన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయాక సీన్ పూర్తిగా మారిపోయింది. తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ఆంక్షలు విధించి.. సామాన్యులెవరూ అటు వైపు రాకుండా దాదాపు కర్ఫ్యూ వాతావరణం స‌ృష్టించుకున్నారు జగన్ .. ఆయన హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు వచ్చినా అపాయింట్‌మెంట్ దొరికే వరకు గేటు బయటే పడిగాపులు పడే పరిస్థితి కనిపించేది.

అలా వచ్చి పోయే పార్టీ శ్రేణులతో హడావుడిగా కనిపించిన తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు బోసిపోయింది. జగన్ గడచిన రెండు నెలలుగా బెంగళూరు టూ తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. తాడేపల్లి కంటే బెంగళూరు ఎహలెంక ప్యాలెస్‌లోనే జగన్ ఎక్కువ రోజులు గడుపుతున్నారు. తాడేపల్లికి వారంలో రెండు మూడు రోజులు జస్ట్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. సహజంగా ఏ పార్టీ అధినేత అయినా ఓడిపోయాడంటే.. పోయిన చోటే వెతుక్కుంటారు. గతంలో టీడీపీ, జనసేన అధినేతలు చేసింది అదే.. చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్‌కళ్యాణ్‌లు ఏపీ వాసులకు దగ్గరవ్వడానికి ఎంతో కష్టపడ్డారు.


మొదటి సారి ఓడిపోయినప్పుడు అసెంబ్లీకి డుమ్మాకొట్టి పాదయాత్ర అంటూ జనంలో తిరిగేసిన జగన్.. గెలిచాక తాడేపల్లి పాలన చూపించారు. తిరిగి పరాజయం పాలవ్వడంతో రాష్ట్రంలో పెద్దగా కనిపించడమే మానేశారు. మాట్లాడితే బెంగళూరు వెళ్లిపోతుండటంతో తాడేపల్లిలో పొలిటికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. తన ప్యాలెస్‌నే పార్టీ సెంట్రల్ ఆఫీసుగా చేసుకున్నప్పటికీ అక్కడ అసలు హడావుడే లేకుండా పోయింద. ఇప్పుడాయన బెంగళూరు కేంద్రంగా ఏపీ రాజకీయం చేద్దామనుకుంటున్నారా? అంటే అసలు బెంగళూరులో ఆయనేం చేస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.

తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ బెంగళూరులో ఎహలెంక ప్యాలెస్‌ను కట్టించుకున్నారు. అయితే వైఎస్ఆర్ దివంగతులు అయి… తాను మాజీ ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్ ఆ ప్యాలెస్‌లో గడిపిన దాఖలాలు లేవు. ఇపుడు మాత్రం అక్కడ గడపటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్ధితుల్లో జగన్ గతంలోలా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో సీక్రెట్ ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి లేదు. ఆ క్రమంలో జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న టాక్ ఉంది. మొన్నామధ్య ఆయన ఢిల్లీ ధర్నాలో ఆ కూటమికి చెందిన కొందరు నాయకులు కనిపించారు.

నిజంగానే జగన్ ఇండియా కూటమికి దగ్గరవ్వాలనుకుంటే పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న షర్మిలే ఆయనకు పెద్ద స్పీడ్ బ్రేకర్ అని చెప్పవచ్చు.. మొదట తెలంగాణాలో రాజకీయ పార్టీని పెట్టి దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్‌గా వచ్చిన షర్మిల.. వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. జగన్ ఓటమికి సవాలక్ష కారణాలు ఉంటే.. అందులో షర్మిల కూడా ఒకరు . కొన్ని సీట్లు తక్కువ మెజారిటీతో వైసీపీ కోల్పోయింది. ముఖ్యంగా రాయలసీమలో భారీ ఎత్తున దెబ్బ పడింది. అది షర్మిల ఎఫెక్టే అన్న అభిప్రాయం ఉంది.

Also Read:  బొత్స ఏంటిది..? జగన్ తట్టుకుంటాడా?

ఇటు చూస్తే ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఏపీలో పుంజుకోవాలని చూస్తుంది. అందుకు వైసీపీ ఓటుబ్యాంకుగా ఉన్న తమ సంప్రదాయ ఓటర్లను కాంగ్రెస్ తిరిగి ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా జగన్‌ని తమ వైపు తిప్పుకుని ఏపీలో వైసీపీ, కాంగ్రెస్‌లను ఒకే వరలో ఇమడ్చడానికి బెంగళూరు కేంద్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. షర్మిల, జగన్ మధ్య సయోధ్యతోనే అది సాధ్యం కాబట్టి.. ట్రబుల్ షూటర్‌గా పేరున్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారంటున్నారు.

వైఎస్ కుటుంబానికి ఆప్తుడైన డీకేతో ఆ అన్నాచెల్లెలకు కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనే ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం అక్రమాస్తుల కేసుల నుంచి తనను తాను కాపాడుకోవాలి చూస్తున్న జగన్‌కి జాతీయ స్థాయిలో రాజకీయ అండ అవసరం. అందుకే ఆయన కూడా ఇండియా కూటమి వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. మరి బెంగళూరు కేంద్రంగా జరుగున్న రాయబారాలు, తెర చాటు మంతనాలపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కాని.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం

ఏపీలో ఉండగా జాతీయస్థాయిలో మిగతా పార్టీలతో సయోధ్య కుదరదని.. ఆ తరహా రాజకీయాలు చేయలేమని.. అందుకు బెంగళూరు అయితే సరిపోతుందని.. అందుకే జగన్ అక్కడికి మకాం మార్చినట్లు చెప్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ నుంచి వైసీపీని విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీని విలీనం చేయమనడం మంచిది కాదని జగన్ అభిప్రాయపడుతున్నారంట. అయితే వైసీపీ ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్‌దే అని కాంగ్రెస్ పెద్దలు గుర్తుచేస్తున్నారంట.

ఏదేమైనా నిజంగా ఆ మంతనాలు నిజంగా జరిగి.. అవి ఫలించాలంటే.. అక్కడ మెత్తపడాల్సింది జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న షర్మిల మాత్రమే అంటున్నారు. ఎన్డీఏ కూటమికి శత్రువైన జగన్‌కి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక ప్రత్నామ్నాయం ఇండియా కూటమే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా తిరిగి పుంజుకుంటుంది. అదే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ఓటు బ్యాంకు ఉన్న వారు తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్లిపోయినా ఆశ్చర్యముండదు. ఈ నేపధ్యంలో జగన్ రాజకీయ అండ కావాలనుకుంటే కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు వినాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి జగన్ మెట్టు దిగడానికి సిద్దమైనా.. షర్మిల ఒప్పుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి జగన్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన బంతి షర్మిల కోర్టులు ఉన్నట్లు కనపిస్తుందిప్పుడు.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×