అనూహ్య మెజార్టీతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ
అనూహ్య మెజార్టీతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. అయిదేళ్లు తిరిగే సరికి అత్యంత దారుణ పరాజయం చవిచూసింది. 151 సీట్లతో రాజ్యమేలిన జగన్ పార్టీ .. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైంది. కానీ మాజీ సీఎం, వైసీపీ వైసీపీ అధ్యక్షుడు జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదట. ఘోర పరాజయం తర్వాత కూడా సొంత పార్టీ వారికి కనీస వాల్యూ ఇవ్వడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా.. అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వైసీపీలోనే వినపడుతున్నాయి.
నేతలు బై బై చెప్పేస్తున్న మనసు మార్చుకోని జగన్
ఏ పార్టీలోనైనా అధ్యక్షుడు పార్టీ సీనియర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదనలో ఉంటున్నారట. నేతలు అంతా వరుసగా బై బై చెప్పేస్తున్న జగన్ మనసు మార్చుకోవడం లేదని వాపోతున్నారట. పార్టీ విషయాలను, నిర్ణయాలను నేతలతో పంచుకునే ఉద్దేశ్యం జగన్ కి అప్పుడు లేదు.. ఇప్పుడు కూడా లేదని ఆందోళనలో ఉంటున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే జగన్ అదే పనిగా విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి.. హామీల అమలుకు ఏడాది టైం ఇచ్చి ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. జగన్ మాత్రం కూటమి ప్రభుత్వానికి అసలే టైమే ఇవ్వకుండా విమర్శల పర్వం కొనసాగించడం పట్ల సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారట.
ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు వెళ్తానంటున్న జగన్
అధికారంలో ఉన్నప్పుడే కాకుండా.. ఓటమి తర్వాత కూడా జగన్ తన నిర్ణయాలతో అందరికీ టార్గెట్ అవుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అంతవరకూ తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. జగన్ వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారంట. మనమేమీ సభకు శాశ్వతంగా వెళ్లం అనడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళతాం. 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా? అలా గుర్తించకుండా సభకు వెళితే మామూలు ఎమ్మెల్యేకిచ్చినట్లు రెండు నిమిషాలు మైక్ ఇస్తామంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం ప్రస్తావించగలనని వితండ వాదం చేశారంట.
జగన్ బాయ్‌కాట్ మంత్రంపై ధ్వజమెత్తిన షర్మిల
అసెంబ్లీ వ్యవహారం పట్ల జగన్ కు సర్వత్రా విమర్శలు వచ్చినా ఏం పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. సభలో విపక్ష ఎమ్మెల్యేలుగా ఉంది వైసీపీ వారే. అధికార కూటమి ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఇంకే పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. ప్రశ్నించే అవకాశం ఒక వైసీపీకే ఉన్నా కూడా.. జగన్ బాయ్‌కాట్ మంత్రం పఠిస్తుండటంపై సొంత చెల్లి సహా అందరూ ధ్వజమెత్తుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని షర్మిల విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటని యద్దేవా చేశారు. ప్రజాతీర్పు గౌరవించని వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: చిక్కుల్లో గల్లా మాధవి.. బాబు యాక్షన్ తప్పదా..?
జగన్ శైలి నచ్చక పలువురు నేతలు పార్టీకి బై బై
అలానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధులను కూడా ప్రకటించారు జగన్. కానీ మళ్లీ ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సొంత పార్టీ వారికి కూడా షాక్ ఇచ్చారు. దాంతో జగన్ అనాలోచిత నిర్ణయాలు ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదంట. జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంతుపట్టడం లేదని చెబుతున్నారట. అసలే ఘోర పరాజయం తర్వాత ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్టీని జగన్ మరింత అగాధంలోకి నెడుతున్నారని వైసీపీ శ్రేణులు వాపోతున్నారట. గత ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉండటంతో జగన్ చెప్పినట్లు విన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు కూడా జగన్ అదే వ్యవహారశైలి ప్రదర్శిస్తుండటంతో పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్ వంటి పలువురు నాయకులు రీసెంట్ గానే వైసీపీకి రాజీనామాలు చేశారు.
సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్ ప్రకటన
ఇంతా జరుగుతున్నా కూడా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జిల్లాల పర్యటనలు చేస్తానంటున్నారు జగన్. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని ప్రకటించారు. అందరమూ కలిసి ప్రజల్లోకి వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. జనవరి నెలాఖరు నుంచి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పర్యటిస్తానని.. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే నిద్ర చేస్తానని అంటున్నారు. ఆ ప్రోగ్రాంకి “కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం” అనే పేరు కూడా ఫిక్స్ చేశారు.
మెజార్టీ నాయకులు నిరసన కార్యక్రమానికి డుమ్మా
అయితే రెండు రోజుల క్రితమే అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. సర్కారుకి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నేతలకు జగన్ ఆదేశించారు. అన్నదాతకు అండగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలన్నారు. అయితే ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా మెజార్టీ నాయకులు ఈ నిరసన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఈ పరిస్థితుల్లో జిల్లా పర్యటనల్లో జగన్ వెనుకడుగు వేస్తేనే బెటర్ అని సూచిస్తున్నారట. పార్టీ నేతలకు, కార్యకర్తలకు కొంచెం సమయం ఇవ్వాలని కోరుతున్నారట.
వైసీపీని వీడుతూ మనసులో మాట బయటపెట్టిన అవంతి
వైసీపీని వీడుతూ అవంతి శ్రీనివాస్.. మనసులో మాట బయటపెట్టారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏడాదైనా సమయం ఇవ్వకుండానే ధర్నాలు, నిరసనలు అంటే ఎలా అని విమర్శించారు. ఆరు నెలల నుంచే ఆందోళన.. నిరసనలు అంటే, కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారన్నారని చెప్పారు. వైసీపీ హయాంలో అంతా వాలంటీర్‌లే నడిపించారని తన మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు. అంతే కాకుండా బ్రిటిషర్లు అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయమనడం సమంజసం కాదన్నారు.
జగన్ తీరు మార్చుకోకపోతే వైసీపీ ఖాళీ కావడం ఖాయమా ?
మొత్తానికి అధికార పార్టీ నేతల మాటలు తర్వాతహ సంగతి.. కనీసం సొంత పార్టీ నేతల అమాట యిన జగన్ వినాలి అని కోరుతున్నారు. జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వైసీపీ ఖాళీ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వెళ్లే వాళ్లని ఆపలేని జగన్.. కనీసం ఉన్న వాళ్లనైనా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.