Cyclone Chido: గంటకు 225 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండగాలులు.. అంతకుమించి అతి భారీ వర్షాలు.. ఈ దెబ్బకు హిందూమహాసముద్రంలోని మయోట్ ద్వీపం తుడిచిపెట్టుకుపోయింది. ఈ బీభత్సానికి 14 మంది మృతి చెందగా.. దాదాపు 226 మందికి తీవ్ర గాయాలు అయినట్లు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే ఇది అధికారిక లెక్క మాత్రమే.. కానీ మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందని చెబుతున్నారు స్థానికులు. కొందరు అధికారులు కూడా ఇదే మాట అంటున్నారు.
మయోట్ అనేది యూరోపియన్ యూనియల్ పరిధిలో ఉన్న ఐలాండ్. ఆఫ్రీకా తీరానికి దగ్గరలో ఉంటుంది. ఈ ద్వీపంలో మొత్తం 3 లక్షల మంది నివసిస్తున్నారు. ఇప్పుడు వీరందరిపై ఎఫెక్ట్ చూపించింది ఛీడో. ప్రచండగాలులకు ఐలాండ్‌లోని దాదాపుగా ఇళ్లన్ని నేలమట్టమయ్యాయి. చెట్లు విరిగిపోయాయి. మంచినీరు, విద్యుత్.. ఇలా కనీస అవసరాలు కూడా అందని పరిస్థితుల్లో ఉన్నారు మయోట్ ప్రజలు.
గడచిన 90 ఏళ్లలో ఇలాంటి తుఫాన్‌ను చూడలేదంటున్నారు అధికారులు. ఛీడ్ మయోట్ మీదుగా వెళ్లి ఆఫ్రికా ప్రాంతంలో తీరం దాటింది. అయితే ఛీడో ఎఫెక్ట్ కొమోరోస్, మడగాస్కర్ ఐలాండ్స్‌పై కూడా పడింది. ఛీడో దెబ్బకు ఐలాండ్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఈయూ మిలటరీ అత్యవసర చర్యలు చేపట్టింది. మరోవైపు మయోట్ ప్రజలకు అండగా ఉంటామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ప్రకటించారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్‌ను అక్కడికి పంపామన్నారు.
Also Read: హిజాబ్ లేకుండా మ్యూజిక్ షో చేసిన ఇరాన్ సింగర్.. యూట్యూబ్ చూసి అరెస్ట్ చేసిన పోలీసులు
ఛీడో బీభత్సంపై యూనైటెడ్ నేషన్స్ కూడా స్పందించింది. ఇళ్లు, స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని ధ్వంసమయ్యాయని.. వెంటనే మయోట్ ప్రజలకు సాయం అందించాలని నిర్ణయించినట్టు యూఎన్ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. 2019లో ఇదాయో తుఫాన్ కూడా దాదాపు 1300 మందిని పొట్టనపెట్టుకుంది. గతేడాది ఫ్రెడ్డి సైక్లోన్ కూడా దాదాపు 1000 మంది వరకు ప్రాణాలను తీసుకుంది. ఇప్పుడు ఛీడో దెబ్బకు అంతకుమించే మృతులు ఉండే అవకాశం కనిపిస్తోంది.