BigTV English

N Convention: నాగార్జున వర్సెస్ హైడ్రా.. ఎవరేమంటున్నారు? ఏం జరిగింది?

N Convention: నాగార్జున వర్సెస్ హైడ్రా.. ఎవరేమంటున్నారు? ఏం జరిగింది?

HYDRA: మాధాపూర్ పరిధిలోని టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను ఈ రోజు ఉదయం హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మొదలు పెట్టిన ఈ కూల్చివేతలు నాలుగు గంటలపాటు సాగాయి. పెద్ద సంఖ్యలో పోలీసుల బందోబస్తుతో ఈ కూల్చివేతలు జరిగాయి. ఒక వైపు కూల్చివేతలు జరుగుతుండగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అప్పటికే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం నేలమట్టమైపోయింది.


ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై నాగార్జున తొలుత స్పందిస్తూ.. తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కోర్టులో కేసులు ఉండగా.. స్టే ఆర్డర్లు ఉండగా ఇలా చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరంగా ఉన్నదని ట్వీట్ చేశారు. తన రెప్యుటేషన్‌ను కాపాడుకోవడానికి అలాగే.. తాము ఎలాంటి ఆక్రమణలు చేయలేదనే విషయాన్ని స్పష్టం చేయడానికి తాను ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. అది పట్టా భూమి అని, ఒక్క అంగుళం కూడా ఎఫ్‌టీఎల్ భూమిని కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. తమ ప్రైవేట్ ల్యాండ్‌లోని నిర్మాణాలను అక్రమంగా కూల్చివేసేలా గతంలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి కోర్టు స్టే ఆర్డర్‌ ఉన్నదని వివరించారు.

నేడు తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేతలు చేపట్టారనేది స్పష్టమని నాగార్జున్ పేర్కొన్నారు. ఈ రోజు కూల్చివేతలు చేపట్టడానికి ముందు హైడ్రా నుంచి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. పెండింగ్‌లో ఉన్న కేసులపై కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. ఒక వేళ కూల్చివేయాలనే ఆదేశాలు ఇస్తే.. తాను స్వయంగా కూల్చేసేవాడినని పేర్కొన్నారు. తమ పట్ల ఒక దురభిప్రాయం, దుష్ప్రచారం జరగరాదనే ఉద్దేశంతో ఈ విషయాలు చెబుతున్నట్టు వివరించారు.


కాగా, హైడ్రా మాత్రం సినీ హీరో నాగార్జున వాదనలను ఖండించింది. ఈ నిర్మాణం కూల్చివేత నోటీసులకు సంబంధించి కోర్టు నుంచి గతంలో ఎలాంటి స్టే ఆదేశాలు రాలేవని స్పష్టం చేసింది. నాగార్జున వాదనలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేసింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ అనుమతులు కూడా ఈ నిర్మాణానికి లేవని పేర్కొంది. చెరువు కబ్జా చేసి నిర్మాణాలు చేసినందుకే కూల్చివేశామని తెలిపింది. ఇలా ఆక్రమణలో నిర్మించిన కట్టడాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నాలు ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు చేశారని వివరించింది. కానీ, అధికారులు అప్పట్లోనే వారి విజ్ఞప్తులను తిరస్కరించారని పేర్కొంది. గతంలో జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుల ఆధారంగానే ఈ కూల్చివేతలు చేపట్టామని తెలిపింది. కొత్తగా నోటీసులు ఇవ్వలేదనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసింది.

Also Read: N Convention Demolition: ‘N కన్వెన్షన్’లో ఫంక్షన్ చెయ్యాలంటే అంత చెల్లించాల్సిందే – వామ్మో ఏడాదికి నాగ్ అంత సంపాదిస్తున్నాడా ?

హైడ్రా కూల్చివేతలు ఇదే తొలిసారి కాదు. నానక్‌రాం గూడ, గండిపేట సమీపంలోనూ చెరువులను కబ్జా చేస్తూ వెలిసిన హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర నిర్మాణాలను కూల్చివేసింది. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్వెన్షన్ గురించి లేఖ రాసిన తర్వాత హైడ్రా రంగంలోకి దూకింది.

ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ.. చెరువును ఆక్రమించి కాదు.. చెరువులోనే ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఎన్ కన్వెన్షన్ పై చూసిచూడనట్టుగా వ్యవహరించాయని, హైడ్రా చర్యలు సరైనవేనని చెప్పారు. అయితే, ఇంకా చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని కూల్చాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

2014, 2016 సంవత్సరాల్లోనే ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అంటూ.. కూల్చివేయాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు హైడ్రా కొత్తగా నోటీసులు జారీ చేయకుండా.. జీహెచ్ఎంసీ జారీ చేసీన నోటీసు ఆధారంగానే కూల్చివేతలు చేపట్టింది.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×