Nayanthara:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, తన అద్భుతమైన నటనతో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార (Nayanthara). ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే.. తన తిరుగులేని ఖ్యాతిని సొంతం చేసుకుంటున్న ఈమె.. ఒక్కొక్క సినిమాకు సుమారుగా రూ.15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా తొలి స్థానంలో నిలిచింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇంకా హీరోయిన్ గా బాక్సాఫీస్ ను వరుస విజయాలతో శాసిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. నటిగా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ తన భర్త కోసం రిస్క్ చేయడానికి వెనుకడుగు వేయడం లేదని, అందుకే ఆ రంగానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. తెరపై వరుస విజయాలతో కథానాయికగా బాక్స్ ఆఫీస్ ను శాసిస్తున్న నయనతార.. తెర వెనుక నిర్మాతగా మాత్రం తీవ్ర నిరాశను ఎదుర్కొంటుంది. నటిగా కోట్లు సంపాదించిన ఈమె.. ఆ డబ్బులను నిర్మాణ రంగంలో పెట్టి భారీగా నష్టపోయినట్లు సినీ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక వరుస పరాజయాల ప్రభావంతోనే ఇకపై చిత్ర నిర్మాణ బాధ్యతలకు ఈమె దూరం కావాలని కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా సినిమా రంగంలో కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసే నయనతార.. నిర్మాణ రంగం వచ్చేసరికి ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది? అనే విమర్శలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. రౌడీ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన తర్వాత ఈ నిర్మాణ వ్యవహారాలన్నింటిని ఈమె భర్త ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, పర్యవేక్షిస్తున్నప్పటికీ వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమవుతున్నాయి. బయట ప్రాజెక్టులు పెద్దగా లేని సమయంలో దర్శకుడిగా విగ్నేష్ ను నిలబెట్టాలనే ఆలోచనతో నయనతార చిత్రాలకు భారీ బడ్జెట్ కేటాయిస్తోంది. అటు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ప్రదీప్ రంగనాథన్ తో చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ALSO READ:రణరంగంలో విజృంభిస్తున్న అక్కినేని కోడలు శోభిత.. లేటెస్ట్ వీడియో వైరల్!
దీనికి తోడు నయనతార ఏకంగా రంగంలోకి దిగి, కవిన్ ను హీరోగా పెట్టి హాయ్ అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా ఈ చిత్రానికి విగ్నేష్ శివన్ , ఎస్ఎస్ లలిత్ కుమార్ లతో కలిసి ఈమె స్వయంగా నిర్మించింది కూడా.. అయితే రొటీన్ సినిమా కావడంతో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకోలేకపోయింది. ముఖ్యంగా బయ్యర్లకు, నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. హీరోయిన్గా ఎంతో శ్రమించి, సంపాదించిన సంపద మొత్తం నిర్మాణ సంస్థ వల్ల కరిగిపోతోందని గుర్తించిన ఈమె.. ఇకపై సినిమాలు నిర్మించకూడదని గట్టిగా నిర్ణయించుకుందట. అందుకే భర్త కోసం ఇలా నిర్మాణ సంస్థను ముందుకు తీసుకెళ్లి.. రిస్క్ చేయడం కంటే , మధ్యలోనే ఆపేసి సంతోషంగా వచ్చిన పారితోషకంతో ఉత్తమమైన భవిష్యత్తును నిర్మించుకోవడం మంచిదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నయనతార తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నయనతార ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో పాటు కోలీవుడ్ లో 4 సినిమాలు, మాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా గడిపేస్తోంది. ఏది ఏమైనా ఇటు వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె నిర్మాణ వ్యవహారాల తలనొప్పులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.