AP BJP New President: పెర్ఫామెన్స్ .. ఆల్ ఈజ్ వెల్. అంతా బాగుంది. ఏపీలో బీజేపీ ప్రెజంట్ బెటర్ పొజిషన్లోనే ఉంది. కాబట్టి.. పాత ప్రెసిడెంట్ నే కంటిన్యూ చేయటమా? లేక ప్రాంతాల వారీ ప్రాధాన్యతలో భాగంగా కొత్త ప్రాంతానికి చెందిన కొత్త నాయకత్వ ఎంపిక చేయటమా? ఎటూ తేల్చుకోలేని డైలమాలో పడింది కేంద్ర కమలనాయకత్వం. ఇంతకీ ఏపీ బీజేపీ చీఫ్ ఛేంజ్ అవుతున్నట్టా? కొత్త వారు ఎంపిక అవబోతున్నట్టా? ఏం జరగనుంది.
విష్ణువర్ధన్ రెడ్డి తప్ప ఎవరైనా ఓకే అంటోన్న మరికొందరు ఇటు ఏపీ అటు తెలంగాణలో కమల వికాసం గతంలో కన్నా ఎంతో మెరుగ్గా ఉంది. అయితే కాలం గడిచే కొద్దీ ప్రాధాన్యత క్రమాలు కూడా మారిపోతుంటాయి. ఇటు పాతను వదులుకోలేం. అటు కొత్తను ఎంపిక చేయడంలో కత్తి మీద సాము. ఇలాంటి సందిగ్ధ పరిస్థితే.. కేంద్ర కమల వర్గాల్లో నడుస్తున్నట్టు తాజా సమాచారం
అయితే రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం ఒకింత జోరుగానే నడుస్తోంది. మరీ ముఖ్యంగా.. ఏపీకి సంబంధించి 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు అతి త్వరలో రాష్ట్ర అధ్యక్షులను సైతం ఖరారు చేసేలా కనిపిస్తోంది.
2023 జూలైలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఆమె పదవీ కాలం ఈ జూలైతో ముగియనుంది. అయితే పొత్తులు కుదర్చడంలో పురందేశ్వరి సూపర్ సక్సెస్ సాధించారు. దీంతో మరి కొంతకాలం పాటు ఆమెను కొనసాగించే ఛాన్స్ ఎక్కువగా ఉందన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు వైసిపి టార్గెట్‌గా రాయలసీమ నేతకు బిజెపి అధ్యక్షుడి పోస్టు ఇవ్వాలనే ప్రచారం సైతం అంతే వాడీ వేడిగా.. కొనసాగుతోంది. దానికి తోడు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా బిజెపి నుంచి ఆశవహుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఒక వేళ అధ్యక్ష స్థానం మార్చితే.. ఎటు చూసినా ఆశావహుల సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. అందునా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు మరింత ఎక్కువగా వినిపిస్తోంది. ఈసారికి ఆయన అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేయడం.. విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి విజయం సాధించడం.. రాష్ట్రమంత్రి వర్గంలో ఛాన్సు దొరుకుతుందని భావించడం జరిగాయి. కానీ బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ఆ ఛాన్సు తన్నుకుపోయారు. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు జరిగితే.. సుజనా చౌదరికే ఫస్ట్ ప్రయారిటీ అన్న టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. ఇలాగైనా సుజనాకు న్యాయం చేయాలనే మాట బలంగానే వినిపిస్తోంది. దీంతో సుజనా చౌదరి కాబోయే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనడానికే ఎక్కువ అవకాశముందని అంటున్నారు చాలా మంది.
Also Read: కరీంనగర్ బీఆర్ఎస్‌లో కలవరం.. సునీల్‌రావు దారెటు?
మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్మెల్యే పార్ధసారధి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా ప్రధానంగానే వినిపిస్తున్నాయి. మరో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి, సీనియర్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా తెరపైకి వస్తున్నాయి.ఈ విషయంలో కర్ణాటక, తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు సిఫార్సు చేస్తున్నట్టు కూడా సమాచారం.
మరోవైపు కూటమిలో టికెట్లు దక్కని వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా వెలుగులోకి వస్తోందో పక్క. ఏపీలో కూటమి ప్రబుత్వం ఉండటంతో.. ఇతర పార్టీల వారిని కూడా సమన్వయ పరుచుకుని ముందుకెళ్లేవారికే అధిక ప్రాధాన్యతనిచ్చేలా కనిపిస్తోంది.
మొత్తంగా ఏపీ బీజేపీ అధ్యక్ష ఎంపికలో కేంద్ర నాయకత్వం భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారికి సీమ నేతకే పట్టం కట్టడమా? లేక ప్రస్తుత కమలాధిపతి.. పురంధేశ్వరినే కంటిన్యూ చేయటమా? అనే డైలమా ఒకటి నడుస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక వేళ అధ్యక్ష మార్పు జరిగినట్టయితే.. కూటమి పార్టీ నేతలతో సర్దుకుపోయే వారికే ప్రయారిటీ ఇవ్వాలని. అందులోనూ విష్ణువర్ధన్ రెడ్డి తప్ప తమకెవరైనా ఓకే అంటూ కాషాయ హెడ్ క్వార్టర్ కు స్థానిక నేతలు సూచిస్తుండటం మరో ట్విస్టుగా మారింది.