Karimnagar Mayor Sunil Rao: కారు స్పీడు తగ్గడం అటుంచితే దాదాపు బండి బోరుకొచ్చేయడంతో.. షెడ్డుకు చేరే పరిస్థితి. ఈ కారు ఇక కదిలేలా లేదన్న ఆలోచనకొచ్చిన కారు పార్టీ లీడర్లు.. ఇప్పుడు జంపింగ్ జపాంగ్ మంత్రం అందుకున్నారు. మరి కారు దిగిపోయాక.. కమలం చేపట్టాలా? లేక షేక్ హ్యాండ్ ఇవ్వాలా? ఏదైతే బెటర్ అన్నది తేల్చుకోలేక పోతున్నారట. తాజాగా ఈ కష్టకాలం వచ్చిన వారి లిస్టులో మరొకరొచ్చిచ్చి చేరారు. ఇంతకీ ఎవరా కారు పార్టీ నేత. ఏంటాయనకొచ్చిన కన్ ఫ్యూజన్.
ఒకప్పుడు కరీంనగర్ కార్ పార్టీ కళకళ
ఏ పార్టీలో చేరుతారో కానీ.. కారు దిగడమైతే ఖాయమా? ఒకప్పుడు ఓవర్ లోడ్ తో సతమతమైన.. కరీంనగర్ కార్ పార్టీ.. ప్రెజెంట్ సీన్ ఫుల్ రివర్స్ లో పడింది. ఒక్కొక్కరూ దిగిపోతుండటంతో ప్రస్తుతం కళతప్పి వెల వెల పోతున్న పరిస్థితి. రెండు టర్మ్ లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి కరీంనగర్ కంచుకోట అన్నది పాత మాట. గత ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతుందని భావించిన వారి దిమ్మ తిరిగేలా.. బ్యాలెట్ల ముందు కారు ఘోర ప్రమాదానికి కి గురయ్యే సరికి.. పార్టీ నాయకులు తలో దారి చూసుకుంటున్న సిట్యువేన్. ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారు పక్క చూపులు చూస్తుండటంతో.. ద్వితీయ శ్రేణి లీడర్లకు తమ భవితవ్యం ఏమిటో అర్థంకాని గజిబిజిగా మారడం ఇందుకు అదనం.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హస్తం పార్టీలోకి
గత ఏడాది కాలంగా మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. ఉత్తర తెలంగాణలో భారీగానే మార్పులొచ్చాయి. ఇక్కడి ఆపరేషన్ ఆకర్ష్.. లో భాగంగా.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హస్తం పార్టీలోకి అడుగు పెట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కూడా కాంగ్రెస్ జెండా కిందకే వచ్చేశారు. అంతే కాదు ఉమ్మడి జిల్లాలో పేరున్న ద్వితీయ శ్రేణి లీడర్లు కూడా ఒక్కొక్కరూ కారు డోర్ ఎడంకాలితో తంతూ.. మధ్య వేలు చూపించేస్తున్నారట. దానికి తోడు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మరీ మూడో ప్లేస్ కి పరిమితం కావడంతో.. కారు రిపేరు ఇప్పట్లో అయ్యే పనికాదన్న డెసిషన్ కి వచ్చి.. పార్టీ నుంచి లెఫ్ట్ కావడమే బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నారట ఒక్కొక్కరూ.
తలనొప్పిగా మారిన కరీంనగర్ మేయర్ సునీల్ వ్యవహారం
ఒక పక్క అధికార లేమి. మరొక పక్క.. కేడర్లో నమ్మకం తగ్గి.. సతమతమవుతున్న అధిష్టానానికి.. ఇప్పుడు కరీంనగర్ మేయర్ సునీల్ వ్యవహారం.. ఎన్ని శారిడాన్ మాత్రలు వేసుకున్నా తగ్గని తలనొప్పిగా తయారైందట. మరి కొన్నాళ్లలో పదవీ కాలం ముగియనున్న మేయర్ సునీల్ రావ్.. దాదాపు పార్టీ వీడ్డం ఖాయంగా ఒక స్కెచ్ వేసి పెట్టుకున్నారట. అయితే అది ఏ పార్టీ అన్నది.. ఎటూ తేల్చుకోలేక పోతున్నారట. వీటన్నిటికీ మధ్యేవాదంగా ప్రజాభీష్టం మేరకూ అంటూ ఒక డైలాగ్ అయితే.. తన సన్నిహితులతో అనేశారట.
బండి ప్రమాణ సమయంలో శుభాకాంక్షలు చెప్పిన మేయర్
ఇంతకీ సునీల్ రావ్ ముందున్న ఆప్షన్లేంటి? ఇన్నాళ్ల పాటూ రోజ్ కలర్ పార్టీ రూల్స్ అధిగమించి మరీ ఆయన ఇచ్చిన సిగ్నళ్లేంటి? తాను డ్రైవ్ చేస్తున్న కార్ ఇండికేటర్లు ఎటు వైపునకు ఎక్కువ చూపించారని చూస్తే.. కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రమాణ సమయంలో.. శుభాకాంక్షలు చెబుతూ.. ఫస్ట్ టైం అడ్డంగా బుక్ అయ్యారట మిస్టర్ మేయర్ సునీల్ రావ్. అంతే కాదు.. సంజయ్ మంత్రి అయ్యాక ఫస్ట్ టైం కరీంనగర్ వచ్చినపుడు ఆయన్ను కలిసి బెస్ట్ విషెస్ చెప్పారట.. సునీల్ రావ్. అదే సమయంలో తన విల్ అండ్ విష్ ఏమిటో కూడా ఇండైరెక్ట్ గా తెలియ చేశారట.
బండి బర్త్ డే సందర్భంగా మరో బ్లాక్ బస్టర్ పోస్ట్ పెట్టిన మేయర్
మేయర్ వరుస అతిక్రమణలు గుర్తించిన కారు పార్టీ కార్యకర్తలు.. ఇదేంటి మేయర్ గారు మరీ మితిమీరుతున్నారు. అయినా ఎగస్పార్టీ లీడర్ మీద ఇంత ప్రేమాభిమానాలు ఒలకబోయడమేంటి? ఎంత పవర్ లో లేకపోయినా.. ఇంత పొగరుబోతుతనమా? అన్న కోణంలో.. చాలా మంది ఓపెన్ గానే టాకేసుకున్నారట. తనపై ఇంతటి నీలాపనిందలొస్తున్నా.. సరే, లెక్క చేయక.. బండి బర్త్ డే సందర్భంగా.. మరో బ్లాక్ బస్టర్ పోస్ట్ వదిలి తన టేస్ట్ ఏంటో ఒకింత స్పష్టంగానే తెలియ చేశారట. ఈ పోస్టులో ఎక్కడా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు వాడక జాగ్రత్త పడుతూ.. తన చూపు బీజేపీ వైపు అన్న పిచ్చ క్లారిటీ ఇచ్చారట గులాబీ మేయర్ సునీల్ రావ్.
సంజయ్ సన్మాన కార్యక్రమూ ఏర్పాటు చేసిన సునీల్ రావ్
అప్పటికే సునీల్ రావ్ రూటెటూ.. అన్న విషయంలో ఓ స్పష్టత వచ్చేయడంతో.. కమలంలో చేరిక దిశగా మరో ముందడుగు వేయడంలో.. భాగంగా.. బండి సంజయ్ ని పిలిచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఆపై చేరిక లాంఛనమే అన్న దశలో.. ఏమైందో ఏమో.. పీచే మూడ్ అనేశారట.. మేయర్ సునీల్ రావ్.
కాంగ్రెస్ లోకి వెళ్లిన పది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు
ఈ మొత్తం పార్టీ ఛేంజ్- పీచే మూడ్ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే.. మేయర్ ఎలాగూ కమలతో నా ప్రయాణం అంటుండటంతో.. ఇక పార్టీలో ఉండి పెద్దగా ప్రయోజనం లేదని భావించిన 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు మళ్లారు. మరి కొందరు వెళ్తారనే ప్రచారమూ సాగింది. ఈ కూడికలు తీసివేతలు అక్కడితో ఆగిపోయినప్పటికీ మేయర్ మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటూ.. అటు ఇటు కాని.. తటస్థ వైఖరి అవలంభించారట. దీంతో ఇప్పట్లో మేయర్ పార్టీ మార్పు లేదన్న నిర్ణయానికొచ్చారట పార్టీలో మిగిలిన కార్యకర్తలు.
కాంగ్రెస్ వైపు వెళ్లే ఛాన్సుందంటూ మరో కొత్త మాట షురూ
కారు బండి వదిలి.. బండి సాయంతో కమలం చేపట్టాలని ఎంతగానో ట్రై చేసిన.. సునీల్ రావు ఆశించినంతగా అటు వైపు కోపరేషన్ లేక పోవడంతో. ఇప్పుడిప్పుడే.. కాంగ్రెస్ వైపు కన్నేసినట్టు కనిపిస్తోందన్న మరో కొత్త టాక్ ఒకటి మొదలైందట. అలాగని ఈ టాక్ స్టార్ట్ అయింది ఇప్పుడే కాదంటారు కొందరు.
అధికార మార్పిడి తర్వాత మొదట వెళ్లాలనుకున్నదే కాంగ్రెస్ కి?
ఆ మాటకొస్తే కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ అరంగేట్రం చేసిన సునీల్ రావు.. అధికార మార్పిడి తర్వాత తొలుత వెళ్లాలనుకున్న పార్టీ ఇదే. మేయర్ మనసులో మాట గుర్తించడం వల్లే.. పది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారట. మరికొందరు సైతం.. కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్సుందనీ. ఆపై మేయర్ పై అవిశ్వాసం పెడతారనే చర్చ సైతం జోరుగానే సాగింది. అందుకే మేయర్ కాంగ్రెస్ కి వెళ్లడమే సేఫ్ అనుకున్నారట. మంత్రి పొన్నంతో పొసగక పోవడంతో.. కాంగ్రెస్ డోర్ క్లోజ్ కావడం కారణంగానే.. సునీల్ రావు మనసు కమలం వైపు లాగిందనీ. ఇప్పుడు అటు నుంచి కూడా సరైన సంకేతాలు రాక పోవడంతో.. ప్రజాభీష్టం మేరకు అన్న సింగిల్ లైన్ తో అందర్నీ సస్పెన్స్ లోపడేస్తున్నారనీ సమాచారం.
ఏ పార్టీలో చేరుతారో కానీ.. కారు దిగడమైతే ఖాయమా?
ఇంతకీ సునీల్ రావ్ గమ్యస్థానమేంటి? అని చూస్తే.. ఆయన బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందనీ. వచ్చే రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ మేయర్ సునీల్ రావ్, కారు దిగి.. బీజేపీ తీర్థం పుచ్చుకుని, కాషాయ కండువా కప్పుకోడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనీ. దీంతో కరీంనగర్ బీఆర్ఎస్ కి మరో గట్టి షాక్ తగిలేలా తెలుస్తోందంటున్నారు కార్యకర్తలు.