Rajyasabha MP Candidate: వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అధికారం కోల్పోయిన 2024 లో 11 మంది వరకూ ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరింది. నలుగురు సభ్యులు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అందులో మూడు ఇప్పటికే భర్తీ అయ్యాయి. తాజాగా విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆ పదవిని కూటమి ప్రభుత్వం ఎవరితో భర్తీ చేస్తుంది? మూడు మిత్రపక్షాల్లో ఆ సీటు కోసం ఆశావహులు ఎక్కువగా కనిపిస్తుండటం పెద్దల సభలో అడుగుపెట్టేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.
రాజ్యసభలో వైసీపీ బలం క్రమక్రమంగా తగ్గిపోతుంది. తొలి విడతలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు జగన్‌కు గుడ్‌బై చెప్పడంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు . మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు వైసీపీని వీడిన తర్వాత.. విజయసాయిరెడ్డి ఇప్పుడా లిస్టులో చేరారు. దాంతో పెద్దల సభలో వైసీపీ బలం 11 నుంచి 7కి పడిపోయింది. బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌బాబులు టీడీపీ నుంచి, ఆర్. కృష్ణయ్య బీజేపీ నుంచి ఖాళీ అయిన సీట్ల నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ బలం పదకొండు స్థానాలకే పరిమితమవ్వడంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాల్లో పడుతుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధరెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన అదానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అనధికారికంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశముంది.
అయితే ఆ ఆరుగురు సభ్యుల్లో వైసీపీకి గట్టిగా ఉండేది నలుగురే అంటున్నారు. అందులో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డిలు, పిల్లి సుభాష్‌చంద్రబోసులు మాత్రమే పార్టీలో కొనసాగే అవకాశాలున్నాయని వైసీపీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయి కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అలాగే గొల్ల బాబూరావు కూడా తొలి నుంచి జగన్ కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశాలు లేవు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవు. జగన్ కేసులన్నీ ఆయనే చూస్తారు.
పారిశ్రామికవేత్త అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాపార అవసరాల కోసం వైసీపీని వీడతారన్న ప్రచారం ఉందిఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్యరామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన దావోస్ పర్యటనలో ఉండటంతో అది ప్రచారమని తేలినా తర్వాత పార్టీని వీడేది ఆయనే అయిఉండవచ్చన్న అనుమానం కూడా పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మేడా రఘునాధరెడ్డి పదవీ కాలం 2030 వరకూ ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదలా ఉంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఏపీకి సంబంధించి ఒక స్థానం ఖాళీ అయింది. ఈ సీట్ కోసం కూటమి లోని మూడు పార్టీల్లో ఆశావహుల లిస్టు పెద్దగానే కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీలో ఆ స్థానం కోసం అనేక మంది నేతలు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ కనమేడల రవీంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా, చింతకాయల విజయ్, బుద్దా వెంకన్న , పిఠాపురం వర్మ ముందు వరుసలో కనిపిస్తున్నారు.
Also Read: ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న డిప్యూటీ స్పీకర్
గత ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలు కొందరు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా వారంతా కూటమి విజయానికి కృషి చేశారు. దేవినేని ఉమా మైలవరం సీటు వదులుకున్నారు. మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనాని పవన్‌కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. తన స్థానంలో కుమారుడికి టికెట్ కోసం అయ్యన్న ప్రయత్నించనప్పటికీ సీనియార్టీ లెక్కలు కలిసి రాలేదు.
రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తన పదవి రెన్యువల్ అవుతుందని భావించారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీడీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహనరావులు బీజేపీలో చేరినప్పటికీ.. కనకమేడల ఒక్కరే తన పదవి కాలం ముగిసే వరకు టీడీపీలో కొనసాగారు. మొదటి విడతలో వైసీపీ ఎంపీలు ముగ్గురు రాజీనామా చేసినప్పుడు తనకు అవకాశం దక్కుతుందని ఆయన భావించారు. అయితే ఈక్వేషన్లు కుదరకపోవడంతో.. ఆ సారైనా ఛాన్స్ దక్కుతుందన్న ధీమాతో ఉన్నారంట.
బీజేపీ నుంచి సైతం ఒకరికి ముగ్గురు పెద్దల సభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారంట. ప్రధానంలో మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు , రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు , మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు ఆ సీటు ఆశిస్తున్నారంట. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సోము వీర్రాజుకు .. అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయాక ఎలాంటి పదవి దక్కలేదు .. అలాగే గత ఎన్నికల్లో సీటు కూడా దక్కలేదు. జీవీఎల్ రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యాక మరోసారి పొడిగించలేదు .. అలాగే విశాఖ సీటు కోసం ప్రయత్నించి భంగపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
అటు జనసేన నుంచి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. బాలినేని వైసీపీ నుంచి జనసేనలో చేరినప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. బాలినేని సీనియార్టీని దృష్టిలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న టాక్ వినిపిస్తుంది. అయితే మూడు పార్టీల్లోని ఆశావహులతో కంపేర్ చేస్తే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే సీనియర్. ఆయనకు టీడీపీ అధినేతతో కూడా మంచి సంబంధాలున్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ కోటాలో ఆయనకు అవకాశం దక్కుతుందంటున్నారు. కిరణ్ రాజ్యసభ్యులైతే సమీపకాలంలో కేబినెట్ బెర్త్ కూడా దక్కుతుందన్న టాక్ వినిపిస్తుంది. ఆ లెక్కలతో కిరణ్ అభ్యర్ధిత్వంపై మూడు పార్టీల్లో అభ్యంతరాలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.