Prithviraj Sukumaran: ఇండస్ట్రీలో చాలామంది మల్టీ టాలెంటెడ్ నటీనటులు ఉన్నారు. నిర్మాతలుగా, దర్శకులుగా సక్సెస్ అయిన హీరోహీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారిలో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా ఒకరు. మామూలుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత దర్శకుడిగా ప్రయోగాలు చేయాలని చాలామంది హీరోలు అనుకోరు. కానీ పృథ్విరాజ్ అలా కాదు.. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించాడు. అంతే కాకుండా నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ అప్పుడప్పుడు డైరెక్షన్ వైపుకు కూడా వెళ్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వి సుకుమారన్ తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
ఇంటికి వెళ్లలేని పరిస్థితి
హీరోగా బిజీగా గడిపేస్తున్న సమయంలోనే మోహన్ లాల్‌ను హీరోగా పెట్టి ‘లూసీఫర్’ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు పృథ్విరాజ్ సుకుమారన్. దానివల్ల తన డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇదే స్టోరీ లైన్‌తో ఒక ఫ్రాంచైజ్‌ను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. కానీ తను సినిమాలు డైరెక్ట్ చేయడం తన భార్యకు, కూతురికి అసలు ఇష్టం లేదని బయటపెట్టాడు పృథ్విరాజ్. ‘‘నా భార్య సుప్రియాకు, నా కూతురికి నేను సినిమాలు డైరెక్ట్ చేయడం అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ సమయంలో నేను ఇంటి నుండి చాలారోజులు దూరంగా ఉంటాను. డైరెక్షన్ ప్రాసెస్‌లో నేను ఎన్నో నెలలపాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.
విమర్శలకు కౌంటర్
‘‘యాక్టింగ్ అయితే షూటింగ్ లేనప్పుడు నేను ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ డైరెక్షన్ అలా కాదు. అందుకే ప్రతీసారి నా కూతురు నా దగ్గరకు వచ్చి నెక్స్‌ట్ యాక్టింగా, డైరెక్షనా అని అడుగుతుంది. నేను డైరెక్షన్ అని చెప్తే ఇంక వెళ్లిపోతాడు అన్నట్టుగా రియాక్ట్ అవుతుంది’’ అని బయటపెట్టాడు పృథ్విరాజ్ సుకుమారన్. దర్శకుడిగా పృథ్విరాజ్ కోర్సులు ఏమీ చేయలేదు. దీంతో తన డైరెక్షన్‌పై పలువురు విమర్శలు కురిపిస్తుంటారు. వాటిపై తను రియాక్ట్ అయ్యాడు. ‘‘నేను ఇంకా మూడో సినిమానే డైరెక్ట్ చేస్తున్నాను. నేను ఫిల్మ్ డైరెక్షన్ చదువుకోలేదని కొందరు అంటుంటారు, కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ గురించి చాలా విషయాలు తెలుసు’’ అంటూ సమాధానమిచ్చాడు.
Also Read: తెలుగు తెరపై రణబీర్ కపూర్.. ఆ మెగా హీరోతో మల్టీ స్టారర్.?
ట్యూషన్ తీసుకుంటున్నా
‘‘నేను నటుడిగా వేరే దర్శకులతో పనిచేస్తూనే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను. ప్రతీరోజూ, ప్రతీ సీన్, సెట్స్‌లోని ప్రతీ షాట్ నాకొక ట్యూషన్ లాంటిది’’ అని గర్వంగా చెప్పాడు పృథ్విరాజ్ సుకుమారన్. ప్రస్తుతం పృథ్విరాజ్.. మోహన్ లాల్ (Mohanlal) హీరోగా ‘ఎల్2ఈ ఎంపురన్’ (L2E Empuraan) అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఆంటోనీ పెరుంబావూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఆంటోనీ లాంటి నిర్మాత దొరకడం వల్ల తనకు భారీ బడ్జెట్‌తో సినిమా చేయగలిగే ధైర్యం వచ్చిందని, ఇలాగే భారీ బడ్జెట్‌తో మరిన్ని సినిమాలు డైరెక్ట్ చేసే ఆలోచన ఉందని పృథ్విరాజ్ సుకుమారన్ బయటపెట్టాడు.