AP News: రాజకీయమంటేనే అంత! కొన్ని నిర్ణయాలు మేలు చేస్తే.. ఇంకొన్ని తప్పిదాలు.. చాలా బాధపెడుతుంటాయ్. ఇప్పుడు.. వైసీపీ కూడా అలాగే ఫీల్ అవుతోందట. బీజేపీని వదిలేసి.. జగన్ తప్పు చేశారనే భావనలో ఆ పార్టీ నేతలున్నారనే టాక్.. రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ డిబేట్‌కు దారితీసింది. అందుకోసం.. ఇప్పటి నుంచే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు వైసీపీ మొదలుపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. అసలు.. బీజేపీ విషయంలో వైసీపీ వైఖరి ఎందుకు మారింది? ఇన్నాళ్లూ లేనిది.. వైసీపీ నేతల నోటి వెంట బీజేపీ మాట ఎందుకొస్తోంది?
గత ఎన్ని్కల్లో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ
ఆంధ్రాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత.. పార్టీలో నేతల అంతర్గత విశ్లేషణల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఒకప్పుడు.. 175 అసెంబ్లీ స్థానాల్లో.. 151 స్థానాలతో తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ.. గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వై నాట్ 175 అంటూ ప్రచారం చేసిన వైసీపీని.. ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారు. దాంతో.. పార్టీ ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ నాయకుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయ్.
బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జగన్ తప్పుచేశారన్న నల్లపురెడ్డి
బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైఎస్ జగన్ చేసిన పెద్ద తప్పని ఆయన కుండబద్దలు కొట్టేశారు. మనసులో మాటని.. ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే నేతగా పేరున్న నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు వైసీపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయ్. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే.. బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చిన నల్లపురెడ్డి.. ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. దాంతో.. ఈ వ్యవహారంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోందట.
ప్రతి బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతిచ్చిన వైసీపీ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ లోక్‌సభ, రాజ్యసభల్లో సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు కూడా వైసీపీ మద్దతిచ్చినట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. అయితే.. ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. గడిచిన ఐదేళ్లు పార్లమెంట్‌లో కేంద్రానికి అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ.. సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీకి దూరమైంది.
బీజేపీ-వైసీపీ మధ్య పొత్తు అంశం చర్యకు వచ్చినట్లు ప్రచారం
2024 ఎన్నికల సమయంలోనూ.. బీజేపీ-వైసీపీ మధ్య పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అండగా నిలిచిన వైసీపీ.. ఎన్నికల్లోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తప్పు ఏముందనే చర్చ కూడా నడిచింది. అయితే పొత్తు విషయంలో వైసీపీ వైపు నుంచి ఆ దిశగా అడుగులు పడకపోవడంతోనే.. బీజేపీ చివరకు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందంటున్నారు.
ఎన్నికల సమయంలోనే బీజేపీపై వైసీపీ నేతల విమర్శలు
గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ పెద్దలు కూడా బీజేపీతో ఢిల్లీ స్థాయిలో సత్సంబంధాలు నడిపిన పరిస్ధితి ఉంది. కానీ.. ఎన్నికల సమయంలో మాత్రం దూరమైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎప్పుడూ బీజేపీ విధానాలను కానీ.. ఆ పార్టీ పెద్దలపై కానీ ఆరోపణలు చేసిన పరిస్ధితులు లేవు. కానీ.. ఎన్నికల సమయంలో బీజేపీపై విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అయితే.. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నేతల వైఖరిలో మార్పు వచ్చిందా.? లేక నాయకులతోనే పార్టీ స్టాండ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో వైసీపీ ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.
బీజేపీతో పొత్తు అంశాన్ని ఇప్పుడెందుకు తెరపైకి తీసుకొచ్చారు?
ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల గడువుంది. ఉన్నట్టుండి.. బీజేపీతో పొత్తు అంశాన్ని ఇప్పుడెందుకు తెరపైకి తీసుకొచ్చారు? అనే చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్య నేతలు తరచుగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని చెబుతుంటారు. అందుకు అనుగుణంగా.. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయ్.
ఎన్నికల తర్వాత బలపడిన బీజేపీ, టీడీపీ, జనసేన బంధం
అయితే.. ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బీజేపీ బయటకు వచ్చే పరిస్ధితులు లేవు. ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన బంధం మరింత బలపడిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో.. వైసీపీ నేతలు బీజేపీతో పొత్తు అంశాన్ని మాట్లాడటం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఒంటరిగా ఎన్నికలకు వెళితే.. వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని గ్రహించే.. ఆ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. కూటమి నుంచి బీజేపీని దూరం చేయాలని.. వైసీపీ అడుగులు వేస్తుందనే చర్చ కూడా సాగుతోంది.
Also Read: కేశినేని నాని మళ్లీ రాజకీయాల వైపు రీఎంట్రీ!
వైసీపీతో కలవాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సింది అధిష్టానమే!
అయితే.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్‌పై పార్టీ స్టాండ్ ఎంటనేది ఇంకా ప్రకటించనప్పటికీ.. ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసే.. బీజేపీతో కలిసి వెళితే లాభం ఉంటుందని ఆయన మాట్లాడి ఉంటారని.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అంటున్నారు. అయితే.. వైసీపీతో కలవాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సింది మాత్రం కేంద్ర నాయకత్వమే అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ మాత్రం.. ఓ అడుగు ముందుకేసి.. బీజేపీ, వైసీపీ.. ఉత్తర, దక్షిణ ధృవాలని.. భవిష్యత్‌లో అవి కలిసే పరిస్థితి లేదని అన్నారు.