AP Politics: ఒక్క ఓటమితో.. ఇక ఈ రాజకీయాల్లోనే నేనుండలేనన్నారు. మళ్లీ ఇటు వైపు రానన్నారు. కానీ.. పాలిటిక్స్‌కి దూరంగా ఉండటం ఆయన వల్ల కావట్లేదంటున్నారు. అందుకే.. మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. పొలిటికల్ రీఎంట్రీ కోసం పావులు కదుపుతున్నారట కేశినేని నాని. రాజకీయాలొద్దని వెళ్లిపోయిన నాని.. మళ్లీ అందులోకే.. ఎందుకు రావాలనుకుంటున్నారు? తన కోసమా? కూతురి కోసమా?
ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు నాని గుడ్ బై
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని.. మళ్లీ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారట. గత సార్వత్రిక ఎన్నికల్లో.. తెలుగుదేశం నుంచి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిన కేశినేని నాని.. తమ్ముడి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత.. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. గతేడాది జూన్ 10న.. ఇక రాజకీయాల్లోకి వచ్చేదే లేదని చెప్పారు. కానీ.. ఇప్పుడదే కేశినేని నాని.. బీజేపీ నాయకులతో రాజకీయ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది.
తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో.. ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలైంది. కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె కూడా విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో.. కేశినేని నాని తన కోసం అడుగులు వేస్తున్నారా? కూతురు రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
తెలుగుదేశం అధిష్టానాన్ని ధిక్కరించేలా నాని వ్యవహారశైలి
ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేశినేని నాని.. 2019లో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టాంతో విభేదాలొచ్చాయ్. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా.. నాని వ్యవహారశైలి కొనసాగింది. 2023 సెప్టెంబర్‌లో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో.. ఢిల్లీలో లోకేశ్ వెంట నడిచారు. ఆ సమయంలో.. వివాదాలు సమసిపోయాయని భావించిన తర్వాత.. కేశినేని నానికి పొగబెట్టారు. విజయవాడ ఎంపీ టికెట్‌ని.. ఆయన తమ్ముడు చిన్నికి ఖరారు చేయడంతో.. నానికి మండింది. దాంతో.. ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. ఎన్నికల్లో మాత్రం తమ్ముడిపై గెలవలేకపోయారు. అప్పట్నుంచి.. పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు.
ఓటమి తర్వాత పొలిటికల్‌గా సైలెంట్ అయిన నాని
రాజకీయాలకు దూరమయ్యాక.. పొలిటికల్‌గా పూర్తిగా సైలెంట్ అయ్యాక.. మళ్లీ ఈమధ్యకాలంలో కేశినేని నాని తరచుగా వార్తల్లో వినిపిస్తున్నారు. తాజాగా.. తమ్ముడు కేశినేని చిన్నిపై నిప్పులు చెరుగుతున్నారు. అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే.. రాజకీయ విమర్శలు చేస్తూ.. తాను రాజకీయంగా యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. బ్యాక్ ఎండ్‌లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన సన్నిహితుల్లో చర్చ ఉంది.
సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న నాని
చిన్ని టార్గెట్‌గా విమర్శలు చేస్తూ.. ఏపీ పొలిటికల్ వెదర్‌ని హీటెక్కిస్తున్నారు. ఇదే సమయంలో.. టీడీపీని, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుబడుతూ.. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇదంతా మళ్లీ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకే చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజంగానే కేశినేని నాని.. పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా? లేక.. తమ్ముడి మీద ఆరోపణలతోనే ఆగిపోతారా? అన్నది.. ఇంకొన్ని రోజుల్లోనే తేలిపోతుందంటున్నారు.