Big Stories

Yashoda: యశోద మూవీ రివ్యూ.. 3.5/5

Share this post with your friends

Yashoda: విడుదల : 11, నవంబర్ 2022
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : హరి -హరీష్
సంగీతం : మణిశర్మ
మాటలు : పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
పాటలు : రామజోగయ్య శాస్త్రి
కెమెరా : ఎం. సుకుమార్
ఆర్ట్ : అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద,ప్రియాంకా శర్మ తదితరులు

‘యశోద’ అంటే ఎవరో తెలుసా?.. శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి. ఈ డైలాగ్ ‘యశోద’ మూవీ ట్రైలర్‌లో హైలైట్ అయింది. తమిళంలో ‘ఒరు ఇరవు’, ‘అంబులి’, ‘ఆ’, ‘జంబులింగం’ సినిమాలు తీసి మంచి పేరును తెచ్చుకున్న దర్శకద్వయం హరి-హరీష్ తెరకెక్కించిన ‘యశోద’ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు పాన్ ఇండియా సినిమాగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతో ఎంతో ఆసక్తిరేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ: చెల్లికి ఆపరేషన్ చేయించేందుకు డబ్బులు అవసరం పడడంతో అద్దె గర్భం(సరోగసి) కోసం ఒప్పుకుంటుంది యశోద(సమంత). ‘ఈవా’ పేరుతో సరోగసి ఫెర్టిలిటీ సెంటర్ నడిపే మధు(వరలక్ష్మీ శరత్ కుమార్) వద్దకు వెళ్తుంది. అక్కడ అద్దె గర్భం దాల్చిన ఎంతోమంది యువతులు ఉంటారు. వీరిని ఆరోగ్యంగా చూసుకునేందుకు మధుతో పాటు డాక్టర్ గౌతమ్(ఉన్ని ముకుందన్) కూడా ఈవా సెంటర్‌లో ఉంటాడు. దీనికంటే ముందు హాలీవుడ్ నటి ఒలీవియా ఇండియాలో అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. ఆ తర్వాత మోడల్ ఆరుషి, వ్యాపారవేత్త శివారెడ్డి కారు ప్రమాదంలో మరణిస్తారు. ఈ కేసు దర్యాప్తు కోసం మిలటరీ ఆఫీసర్‌ వాసుదేవ్‌(సంపత్‌) టీమ్‌ రంగంలోకి దిగుతుంది. వీరి మరణానికి, ఈవా ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధం ఉందా? యశోద ‘ఈవా’కి వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: ప్రతి సినిమాకూ కొత్త పాయింట్ చెప్పాలనుకునే హరి-హరీష్ ‘యశోద’ విషయంలోనూ సక్సెస్ అయ్యారు. సినిమా స్టోరీ, మేకింగ్ చాలా కొత్తగా అనిపిస్తాయి. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా సాగింది. తర్వాత ఏం జరుగుతుంది? అనే టెన్షన్ ప్రేక్షకుల్లో ఉంటుంది. సరోగసీ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. ఇందులో సరోగసి ఒక చిన్న పార్ట్ మాత్రమే. సరోగసి ముసుగులో నడిచే మెడికల్ మాఫియా గురించి ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూని అందిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం… ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు. ఈవా సెంటర్ నిర్మాణం కూడా చాలా కొత్తగా ఉంది. మాతృత్వం గురించి చెప్పిన విధానం బాగుంది. క్లైమాక్స్ ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

నటీనటుల పనితీరు: ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ‘యశోద’ సినిమాకు సమంత పాత్రే కీలకం. యశోద పాత్రలో సమంత తన లైఫ్ టైమ్ బెస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్‌లోనూ సమంత అదరగొట్టింది. ఫ్యామిలీమ్యాన్2 తర్వాత సమంత ఆ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌లో మెప్పించింది. ఈ సినిమాతో సమంత మరో మెట్టు ఎక్కడం ఖాయం. అరుదైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఈ సినిమా కోసం సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పడంతో విడుదలకు ముందే ఆమెపై సానుభూతి ఏర్పడడం కూడా సినిమాకు కలిసొచ్చింది. సినిమా చూశాక చాలామంది ఆమె త్వరగా కోలుకుని మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. సమంత పాత్ర తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్‌వే. వీరిద్దరూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. క్రాక్ మూవీ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో తనకు అలవాటైన లేడీ విలన్ పాత్రను చక్కగా పోషించారు. మిలిటరీ ఆఫీసర్ వాసుదేవ్‌గా సంపత్, పోలీస్ కమిషనర్‌గా మురళీశర్మ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నేత పాత్రలో రావు రమేష్ తనదైన శైలిలో మెప్పించారు. టెక్నికల్‌ విషయానికి వస్తే మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఈవా సెట్‌తో ఆర్ట్ డైరెక్టర్ తన ప్రతిభను కనబరచారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అలాగే పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి రాసిన మాటలు కథకు బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి.

సమంతను మరోమెట్టు ఎక్కించే ‘యశోద’.

రేటింగ్: 3.5/5


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News