Afghanistan : అప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మహిళలు బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో, జిమ్స్‌లో కనిపించకూడదని క్రూరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. 2021లో అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లడం ప్రారంభించిన తరువాత.. ఆ దేశం అక్కడి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అనేక మంది ప్రజలు తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్‌లో ఉన్న విమానాన్ని ఎక్కే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన స్టార్ట్ అయి 15 నెలలు పూర్తయింది. హిజాబ్ ధరించకుండా ఏ మహిళా బయటకు తిరగరాదు. పరాయి పురుషులతో మాట్లాడరాదు. అయితే ఇప్పుడున్న ఈ నిబంధనను మరింత కఠినతరం చేసింది. జిమ్స్, పార్కుల్లో మహిళలకు ప్రవేశం లేదని.. నిషేధించామని తాలిబన్లు ప్రకటించారు.
“మహిళలను కంట్రోల్ చేయడానికి మేము ఎంతో ప్రయత్నించాము.. వారు హిజాబ్ ధరించడంలేదు..పురుషులు, మహిళలు కలిసి తిరగడాన్ని గమనిస్తున్నారు” వీటన్నింటికి పరిష్కారంగా ఈ నిబంధనను తీసుకొచ్చామని తాలిబన్లు సమర్ధించుకున్నారు. తాలిబన్లు విధించిన ఈ నిబంధనను పర్యవేక్షించి అమలు చేయడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించున్నారు. తాలిబన్ల ఈ నిర్ణయం పై ఐరాస మండిపడింది. సమాజంలో మహిళల పాత్రల్ని క్రమంగా దూరం చేయడానికి తాలిబన్లు ప్రయత్నించడం సరైంది కాదని ప్రకటించింది.