Vizag District YSRCP: వైసీపీలో జిల్లా అధ్యక్షుల మార్పుచేర్పుల పరంపర కొనసాగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఇద్దరిని మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికలకు ముందు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కోలా కురువులు ఉంటే ఎన్నికల తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ విశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు గడవక ముందే అమర్నాథ్‌ను మార్చి ఇప్పుడు విశాఖ జిల్లాకు కొత్త అధ్యక్షునిగా కేకే రాజుని నియమించింది. ఉత్తరాంధ్రకే కీలకమైన విశాఖ జిల్లా కొత్త అధ్యక్షుడు ముందున్న సవాళ్లు ఏంటి? అమర్నాథ్ మార్చడం వెనకున్న వైసిపి ఆలోచన ఏంటి? కేకే రాజు నియోజకవర్గాల ఇన్చార్జిలను సమన్వయం చేసుకోగలరా?
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజు
ఉత్తరాంధ్రకే తలమానికమైన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజును నియమించింది వైసీపీ అధిష్టానం. ఈనెల తొమ్మిదిన కేకే రాజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టమన్నారు. ఇప్పటివరకు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించి కేకే రాజును విశాఖ జిల్లా అధ్యక్షుడిగా జగన్ నియమించారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొనసాగుతున్న కేకే రాజుకు జిల్లా బాధ్యతలను ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే చర్చ కొనసాగుతుంది. విశాఖపట్నం జిల్లా అంతా విశాఖ నగర పరిధిలోనే ఉంటుంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇన్చార్జిలను అందరినీ సమన్వయం చేయడం అనేది ఇప్పుడు కేకే రాజుకు కత్తి మీద సాములాగా మారనుంది.
2019, 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలు
కమ్మిల కన్నపరాజు అలియాస్ కేకే రాజు విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కూడా విశాఖ నగరంలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. అప్పట్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో గంటా చేతిలో స్వల్ప ఓట్ల మెజారిటీతో కేకే రాజు ఓటమి చెందారు. 2019 నుండి 2024 ఎన్నికల ముందు వరకు కూడా విశాఖ నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు అనధికార ఎమ్మెల్యేగా కొనసాగారు. టీడీపీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో విశాఖ నార్త్ నియోజకవర్గ నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అక్కడంతా కేకే రాజు హవా నడిచింది.
గంటా రాజీనామాతో అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అయిన రాజు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు. గంట రాజీనామా చేసిన రోజు నుండి 2024 ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఉన్న కేకే రాజు అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేశారు. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండటంతో విశాఖ నార్త్ ఎమ్మెల్యే కేకే రాజు అన్న ప్రచారం భారీగానే సాగింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కేకే రాజు ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉండడంతో ఎన్నికల ముందు జరిగిన అన్ని సర్వేల్లోనూ వైసీపీ నుండి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కేకే రాజు మాత్రమే గెలుస్తాడన్న టాక్ వినిపించింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్‌రాజు ఆయన్ని ఓడించారు.
2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కన్నీరు పెట్టుకున్న రాజు
ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు..విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా ప్రజలు ఓట్లు వేయకుండా ఓటమి పాలు చేయడంతో 2024 ఎన్నికల తర్వాత కేకే రాజు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ కేకే రాజు రాజకీయాల నుంచి తప్పుకుంటారని అనుకున్నారు. కానీ వారం రోజులు తిరగకుండా కేకే రాజు మళ్లీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయిన రోజు నుండి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, పార్టీ మారకుండా వ్యాపారాలు సైతం పక్కనపెట్టి రాజు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతున్నా వైసీపీలో కొనసాగుతూ ఉండడంతో… జగన్ విశాఖ నార్త్ వైసిపి ఇన్చార్జిగా ఉన్న కేకే రాజును విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నం చేశారని కేసులు
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తున్న చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని అప్పట్లో కేకే రాజుపై కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులను బయటికి తీసి కేకే రాజును కూడా అరెస్టు చేస్తారని ప్రచారం సాగింది. అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినా, వ్యాపారాలను క్లోజ్ చేయిస్తారన్న ఆలోచన ఉన్నా కేకే రాజు మాత్రం వైసీపీలోనే ఉండడంతో జగన్ ఆయన విధేయతకు పట్టం కట్టారంటున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన కేకే రాజు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం కేకే రాజును పాత కేసులకు సంబంధించి ఇబ్బందులు పెడుతుందో లేదో తెలియదు కానీ… ప్రస్తుత పరిస్థితుల్లో కేకే రాజును వైసీపీలో ఎన్నో సవాళ్లు పలకరిస్తున్నాయి
వాసుపల్లి గణేష్, తైనాల విజయ్‌కుమార్, చిన్న శ్రీను, తిప్పల నాగిరెడ్డి
కేకే రాజుకు జిల్లా పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను సమన్వయం చేసుకోవడం కత్తి మీద సామే అంటున్నారు. ముఖ్యంగా విజయనగరం రాజకీయాల నుంచి విశాఖ రాజకీయాల్లో అడుగుపెట్టి, ఎమ్మెల్సీగా మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దానికి తోడు విశాఖ నగరంలో సీనియర్ నాయకులుగా ఉన్న విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్, భీమిలి వైసీపీ ఇన్చార్జ్, బొత్స మేనల్లుడు చిన్న శ్రీను, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి లాంటి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయడం ఆయనకు పెద్ద సవాలే.
Also Read: మోడీ తాండవం.. 25 నిమిషాల్లో ఎంత మందిని లేపేసారంటే!!
10 నెలల్లో జరగనున్న జీవీఎంసీ ఎన్నకలు
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు అంతా ఎమ్మెల్యేలుగా పనిచేసి విశాఖ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్నవాళ్లే. అలాంటి సీనియర్ రాజకీయ నాయకులను కేకే రాజు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని మరో 10 నెలల్లో రానున్న జీవీఎంసీ ఎన్నికలను ఎలా సమర్ధవంతంగా ఎదుర్కొంటారో? అన్న సందేహాలు వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇప్పటి నుండే రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులను సమయాత్త చేయాల్సిన బాధ్యత కూడా జిల్లా అధ్యక్షులు పైనే ఉంటుంది. ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న కొరసాల కన్నబాబు మేజర్ కార్యక్రమాలకు తప్ప జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం లేదు. ఏపీకే ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నగరానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కేకే రాజుకు పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకోవడంతో పాటు, కిందిస్థాయి కార్యకర్తలను కూడా సమాయత్తం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం పెద్ద సవాలే అంటున్నారు. మరి జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కేకే రాజు ఎంత వరకు నిలబెట్టుకుంటారో చూడాలి.