అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో అంత వరకూ ఆ పార్టీకి పెట్టని కోటగా నిలిచిన కడప జిల్లాలో జగన్ పలుకుబడి మసకబారింది…ఎన్నికలలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ కేవలం మూడంటే మూడు స్థానాలలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. కడప పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థి, జగన్ పదే పదే చెబుతూ వస్తున్న చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి విజయం కూడా ఆ నియోజకవర్గం నుంచి షర్మిల రంగంలో నిలవడం వల్లనే సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జిల్లాలో వైసీపీ గెలిచిన మూడు ఎమ్మెల్యే స్థానాల్లో జగన్ పోటీ చేసిన పులివెందుల ఒకటి. పులివెందులలో జగన్ మెజార్టీ గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల పులివెందులలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది.
ఇక కడప కార్పొరేషన్ సైతం వైసీపీ చేజారడం ఖాయమైపోయింది. వైసీపీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. కడప మేయర్ పదవి చేజారితే రాష్ట్ర వ్యాప్తంగా అది వైసీపీకి మైనస్ అవుతుందని.. ఎలాగైనా దాన్ని దక్కించుకునే బాధ్యతలను జగన్ కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి అప్పగించారు. అయితే కడప కార్పొరేషన్లో అవినాష్‌రెడ్డి మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదంటున్నారు.
ఇక జిల్లాలోని మున్సిపాల్టీల వంతు వచ్చింది. పొద్దుటూరు మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఖచ్చితంగా కౌన్సిల్లో మెజారిటీ సాధించి మునిసిపాలిటీపై టిడిపి జెండా ఎగరవేయగలమనే నమ్మకంతో టిడిపి నేతలు ఉన్నారట. అయితే చైర్‌పర్సన్, ఇద్దరు వైస్ చైర్‌పర్సన్‌లపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి దించాలా? లేక మెజారిటీ సభ్యులతో కౌన్సిల్లో అంశాలు ఆమోదం పొందితే చాలా అనే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారట. పొద్దుటూరు మునిసిపాలిటీ చైర్మన్‌ను గద్దె దించాలంటే కౌన్సిలర్లలో మూడింట రెండు వంతులు మెజార్టీ ఉండాలి. కానీ కౌన్సిల్లో పలు అంశాలు ఆమోదం పొందాలంటే సగానికి కన్నా ఒక్కరు ఎక్కువ ఉన్నా చాలు .. ఈ మేరకు మెజారిటీ సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదని టిడిపి వర్గాలు భావిస్తున్నాయట.
ఏపీలో వైసిపి ప్రభుత్వం దిగిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలం గడిచిపోయింది. అయినా రాష్ట్రంలో స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, పంచాయతీలు అధిక భాగం ఇంకా వైసీపీ చేతిలోనే ఉన్నాయి. అధికారం మారడంతో సహజంగా కొందరు వైసీపీ నుంచి టీడీపీ లోకి జంప్ కావడం తప్ప, ప్రత్యేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ పాలక మండలాలను దక్కించుకోవడంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదంటున్నారు. మున్సిపల్ కౌన్సిళ్ల పదవీకాలం ముగియడానికి ఇక కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉంది. అందుకే పలువురు ఎమ్మెల్యేలు దృష్టి సారించడం లేదంట. అదీకాక నాలుగేళ్లు పూర్తిగా కానిదే మున్సిపల్ చైర్మన్, మేయర్‌లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వీలు లేదు .. అయితే త్వరలో రెండున్నర సంవత్సరాలకి అవిశ్వాస తీర్మానం పెట్టే ఆర్డినెన్స్ను కూటమి ప్రభుత్వం తీసుకురానుందని టిడిపి వర్గాలు అంటున్నాయి
వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, నాయకులపై అసంతృప్తితో అధికార పార్టీకి వెళితే సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతో పాటు వార్డులలో అభివృద్ధికి నిధులు సాధించవచ్చని ఉద్దేశంతో పలువురు వైసీపీని వీడేందుకు సుముఖంగా ఉన్నారు. అలాంటి వారికి పార్టీలోకి లాక్కొని పైసా ఖర్చు లేకుండా పాలకమండల్ని కైవసం చేసుకోవాలని టిడిపి నేతలు పావులు కదుపుతున్నారట. ఆ క్రమంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మెజార్టీ కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట.
పొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డులు ఉన్నాయి. కేవలం ఒకే ఒక వార్డులో టిడిపి కౌన్సిలర్ గెలుపొందారు. మిగతా 40 వార్డులను వైసిపి దక్కించుకుంది. అందులో 11 వార్డు నుంచి ఎన్నికైన రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన రాజీనామా చేశారు. అయితే టిడిపి నుంచి గెలిచిన 33 వ వార్డు కౌన్సిలర్ గాజుల శివ జ్యోతి సాధారణ ఎన్నికలకు కొద్ది రోజులు ముందు వైసీపీలో చేరారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లపై అసమ్మతితో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు అయిదుగురు టీడీపీ గూటికి వచ్చారు. మరో కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరారు.
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో వైసిపి నుంచి టీడీపీకి వలసల జోరు పెరిగింది. పలు విడతలుగా వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ బాట పడుతున్నారు. మొత్తం ఇప్పటివరకు 18 మంది టిడిపిలో చేరారట. అయితే కౌన్సిల్ లో పై చేయి సాధించాలంటే 40 మందికి గాను 21 మంది ఉండాలి అంటే మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరితే కౌన్సిల్లో మెజారిటీ వస్తుంది కౌన్సిల్లో అజెండాలోని అంశాలను ఆమోదించుకోవచ్చు అనే ఆలోచనలో టిడిపి నేతలు వున్నారట.
మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్స్‌న్‌లపై అవిశ్వాసం పెట్టి పదవుల నుంచి దించాలంటే టీడీపీకి కనీసం 28 మంది సభ్యులు ఉండాలి. టీడీపీ కి ఇప్పటికే 18 మంది సభ్యులు ఉన్నారు. మరో 10 మంది కౌన్సిలర్లు టిడిపికి అవసరం. వైసీపీలో మరో ముగ్గురు కౌన్సిలర్లు ఇప్పటికే టిడిపితో టచ్‌లో ఉన్నారంట. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టి వైసిపి చైర్ పర్సన్ ను పదవి నుంచి దించాక ఎవరిని మున్సిపల్ చైర్మన్ చేయాలా అనే సందిగ్ధత కూడా టిడిపిలో నెలకొందట. ఇప్పటికే టిడిపిలో మూడు నాలుగు వర్గాలు ఉన్నాయి ఒకరికి అనుకూలంగా చైర్మన్‌ను చేస్తే మరొక వర్గంలో అసమ్మతి తప్పదు. ఇటాంటి పరిస్థితుల్లో వైసిపి చైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టకుండా కేవలం కౌన్సిల్‌లో మెజారిటీకి పరిమితం అవ్వాలని ఎమ్మెల్యే వర్గం భావిస్తుందంట.
Also Read: షర్మిలపై ఫోకస్.. జగన్‌తో శైలజానాథ్ మంతనాలు
మరోవైపు పొద్దుటూరు మున్సిపాలిటీ పీఠాన్ని కాపాడుకునే యత్నాలు వైసిపి మొదలుపెట్టిందంట. అందులో భాగంగానే చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఆమె భర్త నాగరాజు టీడీపీలో చేరకుండా వారికున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాదరెడ్డి, ఆయన బావమరిది మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి ప్రయత్నిస్తున్నారంట. అంతే కాకుండా వైసిపి అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన కొందరు కౌన్సిలర్లు పార్టీ మరకుండా కట్టడి చేస్తున్నారట. కొందరు కౌన్సిలర్లకు తాము ఎన్నికల్లో పెట్టిన డబ్బు చెల్లించాకే పార్టీ మారాలని షరతులు పెడుతున్నారట. దీంతో కొంతమంది కౌన్సిలర్లు డబ్బులు చెల్లించే పరిస్థితి లేక విధి లేని పరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగుతున్నారంట. మరి చూడాలి పొద్దుటూరు మున్సిపాలిటీ రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో?