BigTV English

Canada Trump: కెనెడా అమెరికాలో ఒక రాష్ట్రమైతే.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Canada Trump: కెనెడా అమెరికాలో ఒక రాష్ట్రమైతే.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Canada Trump| అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెనెడా అమెరికాలో ఒక రాష్ట్రమైతే చాలా బాగుంటుందని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ చేశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనెడా కావాలని చాలా మంది కెనెడా పౌరులే కోరుకుంటున్నట్లు ఆయన తన పోస్ట్ లో రాశారు. కెనెడా డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి రాజీనామా చేసిన కొన్ని రోజుల తరువాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంపై చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో కెనెడా గురించి ట్రంప్ ఏం రాశారు?
“చాలా మంది కెనెడా పౌరులు తమ దేశం అమెరికాలో 51వ రాష్ట్రంగా కోరుకుంటున్నారు. దీని వల్ల ఇరు దేశాల పన్నులు, మిలిటరీ ఖర్చులు తగ్గిపోతాయి. కెనెడా అమెరికాలో 51వ రాష్ట్రమైతే చాలా బాగుంటుంది. ఇది అద్భుతమైన ఆలోచన. లెగర్ అనే సంస్థ చేసిన సర్వేలో 13 శాతం కెనెడా ప్రజలు తమ దేశం అమెరికాలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు తేలింది.” అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొన్ని రోజుల క్రితమే కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అమెరికాలోని ఫ్లోరిడాలో ట్రంప్ తో డిన్నర్ చేశారు. ఆ సమయంలో కూడా కెనెడా ప్రధాని ముందు ట్రంప్ ఈ మాటలన్నారు. అయితే ట్రంప్ మాటలకు అక్కడ చాలా మంది నవ్వుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే మాట్లాడారని అర్థమవుతోంది. మెక్సికో, అమెరికా సరిహద్దుల వద్ద ఫెంటానిల్ ట్రాఫికింగ్, అక్రమ వలసలు తగ్గించడానికి రెండు దేశాలు ఒకటైతే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. అమెరికా ప్రతి సంవత్సరం బిలియన్ డాలర్లు కెనెడాకు సబ్సిడీ ఇస్తోందని.. రెండు దేశాలు ఏకమైతే ఈ సబ్సిడీ కూడా మిగులుతుందని అన్నారు.


అయితే ట్రంప్ చేసిన సూచనలకు కెనెడాలో చాలామంది తమ దేశాన్ని అమెరికా తదుపరి అధ్యక్షుడు అవమానిస్తున్నారని.. దీన్ని తాము అమెరికా నుంచి ప్రమాదంగా భావిస్తున్నామని అన్నారు. ఒక సందర్బంలో అయితే ట్రంప్ కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడోని అమెరికాలో ఒక రాష్ట్ర గవర్నర్ గానే భావిస్తామని చెప్పారు.

మరోవైపు కెనెడా డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ వారం రోజుల క్రితం రాజీనామా చేయడంతో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై గద్దె దిగాలని రాజకీయంగా ఒత్తిడి పెరిగింది. దీంతో కెనెడాలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను ట్రంప్ అవకాశంగా తీసుకొని కెనెడా అమెరికాలో ఓ భాగమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ట్రూడో మాజీ సలహాదారుడు గెరాల్డ్ బట్స్ అభిప్రాయపడ్డారు. కెనెడా మాజీ ప్రధాన మంత్రి బ్రియాన్ ముల్‌రానే సెక్రటరీ నార్మన్ స్పెక్టార్ మాట్లాడుతూ.. కెనెడా దేశాన్ని అమెరికాలో విలీనం చేసేందుకు ట్రంప్ సీరియస్ గానే ఉన్నట్లు అనుమానం కలుగుతోందని చెప్పారు.

క్వీన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న స్టెఫానీ చౌఇనార్డ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెనెడాలో రాజకీయ అనిశ్చితిని ట్రంప్ అవకాశంగా భావిస్తున్నారని ఆమె అన్నారు.

ట్రంప్ ఒకవైపు కెనెడాపై మాటల దాడులు చేస్తున్నా.. కెనెడా కొత్త డిప్యూటీ ప్రధాని లీ బ్లాంక్ మాత్రం అమెరికాతో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని.. సరిహద్దుల వద్ద అక్రమ వలసలు, నేరాలు నియంత్రించడానికి అమెరికా అధికారులతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×