BigTV English

YS Jagan: జగన్ తగ్గుతాడా? ఉప ఎన్నికకు సిద్ధం అవుతాడా?

YS Jagan: జగన్ తగ్గుతాడా? ఉప ఎన్నికకు సిద్ధం అవుతాడా?

YS Jagan: ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ లాజిక్కు లేని రీజన్‌తో అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ అనర్హత వేటు భయంతో సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే రూటు ఫాలో అవుతున్నారు. మరో ఆరు నెలలు సభకు హాజరుకాకపోయిన ఫర్యాలేదన్న ధీమాతో ఉన్న జగన్‌కు సభా నిబంధనలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. జగన్‌ సభకు వచ్చి సంతకమైతే పెట్టి వెళ్లిపోయారు కానీ, దాన్ని హాజరుగా పరిగణించే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో జగన్ ఈ సెషన్స్‌లో మరోసారి సభకు హాజరుకాక పోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఆయనతో పాటు మిగిలిన పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా తప్పదంటున్నారు.


బడ్జెట్ సమావేశాల తొలిరోజు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. మొదటి రోజు శాసనసభ సమావేశాలకు వస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో మొత్తానికి మొండిపట్టు వీడి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షం శాసనసభకు వస్తుందని అంతా భావించారు. కానీ కొద్దిసేపటికే అందరి ఆశలు, అంచనాలను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారు.


నిముషాల వ్యవధిలోనే వాకౌట్ చేసిన జగన్ టీమ్

తన పదకొండు మంది టీమ్‌తో సభకు వచ్చిన జగన్ 11 నిముషాలు కూడా సభలో గడపకుండానే వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వాస్తవానికి ప్రజస్వామ్యాన్ని గౌరవించకుండా, ప్రజల నిర్ణయానికి భిన్నంగా తమకు ప్రతిపక్షహోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంపై చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఆయన వైఖరి బట్టి స్పష్టమైంది.

హోదా ఉంటే సభలో మాట్లాడానికి ఎక్కడ టైం వస్తుందని ప్రచారం

సమావేశాలకు హాజరుకాబోమని నేరుగా ప్రకటిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో.. ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి ప్రశ్నించేందుకు ఎక్కువ సమయం కావాలని, ప్రతిపక్ష నేత హోదా ఉంటే సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం వస్తుందనే ప్రచారంతో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి శాసనసభలోని మొత్తం సభ్యులలో పది శాతం సీట్లను సాధించిన పార్టీకి ప్రతిపక్షహోదా దక్కుతుంది. ప్రతిపక్షహోదా దక్కాలంటే ఎన్నిసీట్లు ఉండాలనే ప్రత్యేక నిబంధన లేకపోయినప్పటికీ అదొక సంప్రదాయంగా వస్తోంది.

ప్రస్తుతం పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా అసాధ్యమే

ఆ సంప్రదాయం ఐదేళ్లూ సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పటికీ తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదనేది సుస్పష్టం.

హోదా లేనప్పటికి సభలో మాట్లాడేందుకు తగిన సమయం

వాస్తవానికి శాసనసభ, శాసనమండలిలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు మాట్లాడే అవకాశం లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో సభ్యులు రిక్వెస్ట్ చేస్తే తగినంత సమయం కేటాయించే విచక్షణాధికారం స్పీకర్‌కు ఉంటుంది. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించేందుకు సభ్యులు ప్రయత్నం చేయవచ్చు. సమస్య తీవ్రత ఆధారంగా స్పీకర్ సభ్యుడికి ఎంత సమయం కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ సభలో మాట్లాడేందుకు తగిన సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు సభకు వచ్చి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకుండానే, తమకు హోదా ఇవ్వకపోతే తాము సభకు వెళ్లబోమని జగన్ భీష్మించుకుని కూర్చోవడం అభాసుపాలవుతుంది.

ఎమ్మెల్యేలతో కలిసి రిజిస్టర్‌లో సంతకం చేసిన జగన్

శాసనసభ్యుడిగా గతేడాది ప్రమాణ స్వీకారం చేశాక రెండోసారి సోమవారం జగన్‌ అసెంబ్లీకి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకుని అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించారు. పోర్టికో నుంచి ప్రవేశించగానే ఎదురుగా ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టేందుకు ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో ఆయన సంతకం చేశారు. తర్వాత సభలోకి వెళ్లి, కాసేపటికే బాయ్‌కాట్‌ చేసి ఇంటికి వెళ్లిపోయారు. 60 రోజులపాటు వరుసగా సభకు హాజరవకపోతే ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుందని సభాపతి, ఉప సభాపతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్‌ హాజరు కోసమే సోమవారం సభకు వచ్చారని అసెంబ్లీ ఆవరణలో విస్తృతచర్చ జరిగింది. జగన్‌ సభకు వచ్చి సంతకమైతే పెట్టి వెళ్లిపోయారు కానీ, దాన్ని హాజరుగా పరిగణించే అవకాశం లేదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

సభలో స్పీకర్‌ అధ్యక్షతన జరిగే సమావేశాలనే పనిదినాలు, సిట్టింగ్‌గా పరిగణిస్తారు. శాసనసభలో సమావేశమైన శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. వేదికపై శాసనమండలి ఛైర్మన్, శాసనసభాపతి కూడా ఉన్నారు. సభకు ముగ్గురు అధ్యక్షత వహించే పరిస్థితి ఉండదు కాబట్టి, ఈ ప్రసంగాన్ని సిట్టింగ్‌ కిందకు తీసుకోరని అంటున్నారు. గవర్నర్‌ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. గవర్నర్‌ ప్రసంగంపై మంగళవారం ధన్యవాద తీర్మానం చేయాల్సి ఉన్నందున, దానికి ముందుగా ఆ ప్రసంగాన్ని శాసనసభ, మండలిలో టేబుల్‌ చేస్తారు. అప్పుడే అది రికార్డుల్లోకి వస్తుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.

గతేడాది జులైలో సంతకం పెట్టి వెళ్లిన జగన్

కాబట్టి సాంకేతికంగా సోమవారం నాటి గవర్నర్ ప్రసంగాన్ని సిట్టింగ్‌గా పరిగణించరంట. ఆ రోజు సభ్యులు సంతకాలు పెట్టినా వాటిని హాజరుగా లెక్కలోకి తీసుకోరని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే గతేడాది జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశాక.. జులైలో జరిగిన సమావేశాల్లో కూడా గవర్నర్‌ ప్రసంగం రోజు మాత్రమే జగన్‌ సభకు వచ్చి ఇప్పటిలాగే సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఆ సంతకం కూడా హాజరుగా పరిగణించే పరిస్థితి ఉండదంటున్నారు.

ఈ సెషన్స్‌లో తిరిగి సభకు హాజరవుతారా?

అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు ఈ పరిణామం ఊహించని ఝలకే. అసెంబ్లీ రావడానికి ఇష్టపడని ఆయన తన టీమ్‌తో ఈ సెషన్స్‌లోనే తిరిగి సభకు వచ్చి కూర్చోవాలి. లేక పోతే ఆ పదకొండు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేసే విచక్షాధికారం స్పీకర్‌కు ఉంటుంది. మరి మొండి పట్టుదలకు మారు పేరైన జగన్ మెట్టు దిగి అసెంబ్లీకి వస్తారో? లేకపోతే అదే పంతంతో ఉపఎన్నికలకు సిద్దమవుతారో చూడాలి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×