MahaShivaRatri PrayagRaj Trains | ఉత్తర్ ప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా ముగియనుండడంతో.. మహాశివరాత్రి రోజున భక్తులు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది చేరుకున్నారు. ఈ కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత.. కోట్లాది మంది భక్తులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లనున్నారు. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమై.. ప్రయాగ్‌రాజ్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 350కు పైగా రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.
జనవరి 13 2025న మహా కుంభమేళా మొదలైంది. అయితే మహాశివరాత్రి రోజు అంటే ఫిబ్రవరి 26తో ఇది ముగియనుంది. ఈ 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన మహా కుంభమేళాకు మొత్తంగా 13,500 రైలు సర్వీసులను నడపాలని రైల్వే శాఖ తొలుత ప్రణాళికలు వేసుకుంది. కానీ, ఈ సంఖ్య కేవలం 42 రోజులకే ప్రత్యేక రైళ్లు కూడా కలిపి ఏకంగా 15,000 సర్వీసులను నడిపినట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
ఎటు చూసినా భక్తుల రద్దీ
మౌని అమావాస్య మాదిరిగానే, మహాశివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్య నాడు 360 రైళ్లను నడిపించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఆ రోజు 20 లక్షల మంది యాత్రికులను స్వస్థలాలకు సురక్షితంగా చేరవేసినట్లు తెలిపారు. ఇదే విధంగా, మహాశివరాత్రి రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అవసరమైతే వినియోగించేందుకు వీలుగా ప్రత్యేక బోగీలను ప్రయాగ్‌రాజ్ సమీపంలో సిద్ధంగా ఉంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. అంతేకాకుండా, ప్రయాగ్‌రాజ్ రీజియన్లలోని అన్ని స్టేషన్లలో 1,500 మంది రైల్వే ఉద్యోగులు మరియు 3,000 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని విధుల్లో ఉంచినట్లు వెల్లడించారు.
Also Read: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య భాషా గొడవ.. బస్సు సిబ్బందిపై ఇరువైపులా దాడులు
మహాకుంభమేళా నుంచి రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
రైల్వే శాఖ ప్రకారం.. గత రెండు రోజులుగా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తులతో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంది. భారీ సంఖ్యలో భక్తులు మహాశివరాత్రి సందర్భంగా అమృతస్నానం అనంతరం.. తిరిగి స్వస్థలాలకు వెళ్తారు. అందుకే రైల్వే స్టేషన్లు భక్తులతో, యాత్రికులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. పరిస్థితిని ముందే అంచనా చేసి నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, నార్తర్న్ రైల్వేలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవీఓ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వీటన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు మహాశివరాత్రిని పురస్కరించుకుని.. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం భక్తలతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. ఈ సమయంలో సాధారణ భక్తులకు దర్శన సౌకర్యాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసి, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఆలయ ట్రస్ట్ చర్యలు తీసుకుంది.