AP Politics: విజయసాయిరెడ్డి.. పొలిటీషియన్ అవతారమెత్తిన ఆడిటర్.. వైసీపీ అధ్యక్షుడికి అత్యంత నమ్మకస్తుడిగా దాదాపుగా పది సంవత్సరాలు పాటు వైసీపీలో ఆయన నెంబరు టూగా చక్రం తిప్పారు .. తాను చెప్పిందే వేదం అన్నట్లు నడిపించారు.. తనతో పాటు అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితం అనుభవించిన సాయిరెడ్డికి జగన్ కూడా అంతే వాల్యూ ఇస్తూ వచ్చారు.. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకి జగన్ కారణాలేవైనా ఆయన ప్రాధాన్యత తగ్గించారు .. కాలక్రమంలో విజయాసాయిని దూరం పెట్టడంతో.. రాజకీయ సన్యాసం ప్రకటించి పార్టీకి గుడ్‌బై చెప్పారు.. అలాంటి చార్టర్డ్ అకౌంటెంట్ తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారా? తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతానంటున్న ఆయన లెక్కలేంటి?
విజయ్ సాయి రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఆయన పేరు తెలియని వారు బహుశా ఉండరేమో .. దివంగత నేత వైఎస్అకాల మరణంతో జగన్‌కు కష్టాలు మొదలయ్యాయి. తండ్రి హయాంలో చేసిన నిర్వాకాలకు సంబంధించి జగన్ ఇప్పటికీ అక్రమార్జన కేసులు ఎదుర్కొంటున్నారు. ఆ కేసుల ఎఫెక్ట్‌తొ 16 నెలల పాటు జైల్లో ఉండి పోయారు. ఆ సమయంలోనే జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డి సైతం జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అప్పటినుంచి వైపీపీకి రాజీనామా వరకు జగన్ కు సంబంధించి ప్రతి అంశంలోనూ విజయసాయిరెడ్డి కీ రోల్ పోషించారు.
వైసీపీ ఏర్పాటు, జగన్ ను సీఎం చేయడంతో పాటు అనేక అంశాల్లో విజయసాయిరెడ్డి తన వంతు పాత్ర పోషించారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వైసీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సాయిరెడ్డిని రెండు సార్లు జగన్ రాజ్యసభకు పంపారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ కోటరీ ఉచ్చులో చిక్కుకున్నారని ఆరోపిస్తూ సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రెండో సారి రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడేళ్లు ఉండగానే ఆ పదవికి, పార్టీకి రాజీనామ చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాలకు టెంపరరీ రిటైర్‌మెంట్ ప్రకటించారు.
సాయిరెడ్డి ప్రలోభాలకు లొంగిపోయారని జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన వైసీపీని, జగన్ కోటరీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో లిక్కర్ స్కాంలో ఇటీవల ఈడీ విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి వైసీపీలోని కోటరీతో పాటు జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయంపై యూ-టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తనను విమర్శిస్తున్న జగన్, అలాగే తనను ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో తాను తట్టుకుని ముందుకు సాగాలంటే కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని, తాను వస్తాను అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
వాస్తవానికి ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు స్వీకరించినప్పుడు విజయసాయిపై అనేక వివాదాలు.. భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో విభేదాలు నడిచాయి. ఆ క్రమంలో ఇన్చార్జిని మార్చండి మహాప్రభో అంటూ ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి సాయి రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారంటే.. ఆయన డామినేషన్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ హయాంలో లిక్కర్ వ్యవహారంలో జోక్యం.. విశాఖపట్నంలో పార్టీ శ్రేణుల నుంచి వరుసగా ఫిర్యాదులు.. అవినీతి ఆరోపణలతో జగన్ ఆయన్ని ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి నుంచి తప్పించారు.. అప్పటినుంచి సాయిరెడ్డి కొన్ని రోజులు పాటు తాడేపల్లి కార్యాలయానికి పరిమితమయ్యారు.. ఆ తర్వాత కొన్ని రోజులకి యువజన విభాగానికి.. సోషల్ మీడియాకి ఇన్చార్జిగా నియమించారు.. కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్ రెడ్డికి.. యువజన విభాగం బాధ్యతలు చెవిరెడ్డికి జగన్ అప్పగించారు. అప్పటినుంచి సాయి రెడ్డి కోటరీ పై నిప్పులు చేరటం మొదలుపెట్టారు.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ పెట్టే వేధింపులు, అవమానాలు తట్టుకోలేకపోయానని, ఆ కోటరీయే తనను పొగబెట్టి నెమ్మదిగా పార్టీ నుంచి బయటకు పంపించిందని మండిపడ్డారు.
తాను ప్రలోభాలకు లొంగిపోయాయని గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకుంటేనే తదుపరి ఆలోచన ఉంటుందని తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన గతంలోనే అన్యాపదేశంగా సంకేతాలిచ్చారు. అయితే సాయి రెడ్డి మొదటి నుంచి జగన్ పై విమర్శలు చేయడం లేదు. కానీ జగన్ చుట్టూ ఉన్న కోటరీపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. దాంతో జగన్ పిలిస్తే తిరిగి పార్టీలోకి వెళ్లాలని సాయి రెడ్డి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.. కానీ జగన్ మాత్రం సాయి రెడ్డి చేసిన ఆరోపణల మూలంగా పార్టీతో పాటు వ్యక్తిగతంగా తన పరువు పోయిందని ఫీల్ అవుతున్నారంట.
Also Read: బంగారం పతనం స్టార్ట్.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే!
అసలు అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని.. సాయిరెడ్డి చేసే ఆరోపణలకి వివరణ కూడా ఇవ్వవద్దని పార్టీ నేతలకు జగన్ డైరెక్షన్ ఇచ్చినట్లు తెలిసింది.. అందుకేనేమో సాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం లేదు. సాయి రెడ్డి వ్యవహారంలో వైసీపీ కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.. దీంతో జగన్ కాకా బట్టేందుకు సాయి రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తిరిగి వైసిపిలోకి రావాలని ప్రయత్నిస్తున్న సాయిరెడ్డిని అడ్డుకోవాలని జగన్ కోటరీ ఫిక్స్ అయిందంట. మరి చివరికి విజయసాయి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.
Story By Apparao, Bigtv