Vivekananda Reddy Murder Case: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య చుట్టూ ప్రస్తుత రాజకీయాలు తిరుగుతున్నాయి. వివేకానందరెడ్డి (Vivekananda Reddy)హత్య జరిగిన ఏడేళ్లవుతున్నా… ఇప్పటికి ఎవరూ హత్య చేశారన్నది తెలియని పరిస్ధితి. ఈ కేసు విచారణపై వివేకా కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలోనే కేసు ద్యర్యాప్తుపై పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరంలేదంటూ ఆ చెల్లెలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. సరిగ్గా ఏడేళ్ల క్రితం.. 2019 మార్చి 15న కడప మాజీ ఎంపీ, వైఎస్ఆర్ తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసు విచారణ ఇంత వరకు ఒక కొలిక్కి రాలేదు. సీబీఐ విచారణలో సైతం అసలు నిందితుడు, కుట్రదారుడు ఎవరో గుర్తించలేదు. ఈ నేపధ్యంలో వివేకా వర్ధంతి రోజైన ఈ నెల 14న వైఎస్ సునీత మీడియా సమావేశం పెట్టి కేసు దర్యాప్తుపై మాట్లాడారు. సీబీఐ బాధ్యతాయుతంగా, లోతుగా దర్యాప్తు చేయలేదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనకు అందరూ అన్యాయం చేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులు చెప్పింది వినడమే తప్ప సీబీఐ లోతుగా దర్యాప్తు జరపలేదు. హత్యకు ముందు, తర్వాత నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదని సునీత ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన అర్ధాంగి భారతిని విచారించాల్సిన అవసరం ఉందని, కానీ సీబీఐ వారిని విచారించలేదని ఎత్తి చూపించారు. తాను ఇంతగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సునీత.. న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సునీత కామెంట్స్‌కు కౌంటర్‌గా కడప ఎంపీ, సునీతకు సోదరుడి వరుస అయ్యే వైఎస్ అవినాష్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. వివేకా మరణాన్ని గుండె పోటుగా సృష్టించిందే ఆయన కుమార్తె సునీత , ఆమె భర్త రాజశేఖర్ అని సంచలన ఆరోపణలు చేశారు. సునీతని అక్క అని సంభోదిస్తూ.. ఆమె 2019 మార్చి 16న సిట్ కి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ విషయం స్పష్టంగా చెప్పారన్నారు. ఆనాడు సునీత దంపతులు గుండె పోటు అని స్టేట్మెంట్ ఇచ్చారని ఆరోపించారు. పైగా వివేకా హత్య కేసులో అనేక కీలక అంశాలను కూడా ఆమె పక్క దోవ పట్టించారని ఆయన అంటున్నారు.
సునీత రెడ్డి న్యాయం కోసం పోరాటం చేస్తుందా?…చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పోరాటం చేస్తుందా ? అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. టిడిపి ఎంపీ డ్రగ్స్ కేసు పక్కదారి పట్టించేందుకు సునీతా రెడ్డి వివేకా హత్య కేసు ప్రెస్ మీట్ పెట్టారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సీబీఐని, కోర్టును విమర్శించేలా సునీత మాట్లాడుతున్నారని, సునీత భర్త రాజశేఖర్‌ను కాణిపాకం వెళ్ళమని చెప్పిన వివేకా భార్య సౌభాగ్యమ్మను విచారించమని సునీతా రెడ్డి ఎందుకు కోరలేదని కడప ఎంపీ అంటున్నారు. చంపే ముందు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుని హత్య చేశామని, తానే స్వయంగా చంపానని దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు అతని బెయిల్‌ను సునీత ఎందుకు అడ్డుకోలేదని అవినాష్‌రెడ్డి నిలదీశారు. సంబంధం ఉన్న విషయాలు వదిలేసి అనవసర విషయాలు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. వివేకా రెండో భార్య కొడుకుకు ఆస్తి వెళ్తుంది కాబట్టి ఆ కోణంలో హత్య జరిగి ఉండొచ్చని, అది కూడా సునీతా రెడ్డి అడగడం లేదన్నారు. తానే టార్గెట్‌గా దర్యాప్తు జరుగుతుందని, వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణ కొనసాగించేలా చేసి, ఎన్నికల ప్రచారం లో వాడుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయంశంగా మారాయి. సునీతకు మొదటి నుంచి మద్దతిస్తున్న షర్మిల తాజాగా మాట్లాడుతూ జగన్ లాంటి అన్న ఉంటే శత్రువలు అవసరంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న అనే పదానికి జగన్ కళంకం తేచ్చారని మండిపడ్డారు. వివేకాని హత్య చేసింది ఆయన కుమార్తె సునీత భర్త అంటున్నారని.. మరి ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఆ ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు బయటపెట్టలేదని షర్మిల ప్రశ్నించారు. వివేకా రెడ్డి హత్య కేసు గురించి ఆ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డి మాట్లాడడం చాలా దారుణమని, వివేకా రెడ్డి గుండెపోటుతో చనిపోవడం అనే వార్త సృష్టించింది సునీత అని అవినాష్ రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. సునీతకి ఎందుకు ఈ కర్మ, మీరు న్యాయం చేయలేదు కాబట్టే కదా చంద్రబాబును కలిసిందని షర్మిల ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు వివేకానంద రెడ్డి హత్యకు కారణం అవినాష్‌రెడ్డి కుటుంబ సభ్యులే అని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. వివేకాది గుండెపోటు అని వారి సొంత ఛానల్ లోనే ప్రచారం చేసుకున్నారని, ఎక్కడో ఉన్న తనపై, చంద్రబాబు నాయుడు, బీటెక్ రవిలపై .. వివేకాను హత్య చేశారని తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా ఇంటి వద్ద వున్న కుక్కను చంపి, కదిరిలో గొడ్డలి కొని హత్యకు ఉపయోగించినట్లు సీబీఐ దర్యాప్తులో రుజువైందని గుర్తు చేశారు. గతంలో తానే వివేకాను హత్య చేసినట్లు ఆరోపించిన కడప ఎంపీ ఇప్పుడేమో సునీతమ్మ, భర్త రాజశేఖర్ రెడ్డిపై నెపం వేస్తున్నారని ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డి వ్యవహారం దొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లు ఉందని విమర్శించారు. మొత్తంగా వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీలో అందరికీ రాజకీయ అస్త్రంగా మారిపోయింది. హత్య కేసు దర్యాప్తును సీబీఐ సమగ్రంగా విచారణ చేయడలేదని వివేకానందరెడ్డి కుమార్తె సునీత అంటుండటం, నాలుగేళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ కూడా దోషుల ఎవరో తేల్చకపోవడం మిస్టరీగా మారింది. ఈ నేపధ్యంలో నాయకుల మధ్య నడుస్తున్న మాటల యుద్ధంతో వివేకా హత్య కేసు సమాధానం దోరకని ప్రశ్నగా మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Story By Apparao, Big TV