Ysrcp Party: రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన ఆ జిల్లాలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో కీలకమైన ఆ నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు కరువు అయ్యారట. వైసీపీ తరఫున గత మూడు ఎన్నికల్లో ముగ్గురికి అవకాశమిచ్చారు జగన్.. ఆ పార్టీ అక్కడ గెలిచింది మాత్రం ఒక్కసారే.. అయితే అభ్యర్థిగా పోటీ చేసిన నేతలు అంతా ఒక్కొక్కరుగా నియోజకవర్గాన్ని వదిలి పోతుండటంతో వైసీపీకి అక్కడ పెద్ద దిక్కు లేకుండా పోయిందంట. అసలింతకీ ఆ నియోజకవర్గం ఏది? పోటీ చేసిన నేతలు ఎందుకు సెగ్మెంట్‌ని వదిలి పెడుతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే కృష్ణా జిల్లాలో ఒకటైన పెనమలూరు నియోజవర్గం వైసీపీకి కలిసి రావడం లేదట. టీడీపీకి బలమైన కంచుకోట లాంటి ఆ పెనమలూరులో పాగా వేసేందుకు మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అధినేత చెయ్యని ప్రయత్నం లేదు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ముచ్చటగా మూడు సార్లు పోటీ చేసిన ఆ పార్టీ నాయకులు ఎవరూ ఇప్పుడు నియోజకవర్గంలో లేరు. ఎన్నికల్లో పోటీచేసిన ముగ్గురూ పెనమలూరు నియోజకవర్గానికి దూరం అయ్యారు.
టిడిపికి బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్న చోట ఎలాగైనా పట్టు పెంచుకుని విజయం సాధించాలని వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు క్యాండెట్లను మార్చేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఏరికోరి మరీ అభ్యర్థులను నియమించారు. మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటే సారి వైసిపి పెనమలూరులో విజయం సాధించింది. అలా 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన అప్పటి మాజీ మంత్రి పార్థసారథి ఎన్నికలకు ముందు వైసిపికి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరి పోయారు.
దీనితో రాజకీయాలకు కేంద్ర బిందువు అయిన క్రిష్ణా జిల్లాలో అందునా పెనమలూరు లాంటి నియోజకవర్గంలో వైసిపికి ఇప్పుడు పెద్ద దిక్కులేకుండా పోయింది. భవిష్యత్లో అయినా పెనమలూరు నియోజకవర్గానికి శాశ్వత నాయకుడు రాకపోతాడా అంటూ ఎదురు చూస్తున్నారట నియోజకవర్గం వైసిపి నేతలు. అక్కడ వైసిపి నుంచి మూడు సార్లు పోటీ చేసిన ముగ్గురు నేతలు ఆ నియోకవర్గానికి దూరంగానే ఉన్నారు. అందులో మొదట వరుసలో ఉంది మాత్రం ముంబై నటి జిత్వాని వేధింపుల కేసులో ఇటీవల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పారిశ్రామిక వేత్త కుక్కల విద్య సాగర్.
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పెనమలూరు బరిలోకి దిగిన కుక్కల విద్యాసాగర్ సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కుక్కల విద్యా సాగర్ అటు వైసిపికి ఇటు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు. తర్వాత ముంబై నటి కేసులో ఇరుక్కుని కోర్టులు, జైల్ల చుట్టూ తిరుగుతున్నారు. 2019 ఎన్నికల టైంకి కాంగ్రెస్ నుంచి 2009లో పెనమలూరు గెలిచి, మంత్రిగా పనిచేసిన పార్థసారథి వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. పార్థ సారథి 2014 లో వైసిపి తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో.. జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ చేశారు.
అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్థ సారథి విజయం సాధించినా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న పరిమాణాలు, వైసీపీలో నెలకొన్న విభేదాలతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పార్టీలో సీనియర్లను పట్టించుకోని జగన్ పార్థసారథికి అవమానాలే మిగుల్చారు. వైసిపిలో చోటు చేసుకున్న పరిణామాలు మింగుడుపడని పార్థసార్థి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ పంచన చేరి నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.
Also Read: నందిగం సురేష్ కథ రివర్స్.. కారణం ఇదేనా..?
ఆ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి పెడన ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేష్‌ని పెనమలూరు వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించి ఎన్నికల బరిలోకి దించారు. మైలవరం నియోజకవర్గం వాస్తవ్యుడైన జోగి రమేష్‌ను పెడన నుంచి షిఫ్ట్ చేసి పెనమలూరు నుంచి పోటీ చేయించడం ఆ పార్టీ వారికే మింగుడుపడలేదంటారు. ఆయన మళ్ళీ తిరిగి బోడే ప్రసాద్ చేతిలో ఓడిపోవడంతో మళ్ళీ సేమ్ సీన్ పెనమలూరులో రిపీట్ అయింది. అప్పటి వరకు పెనమలూరులో అభ్యర్థిగా హడావుడి చేసిన జోగి చివరకు మళ్ళీ సొంత నియోజకవర్గం మైలవరానికి షిఫ్ట్ అవ్వడంతో ఇప్పుడు పెనమలూరులో నాయకుడు కాదుకదా.. నియోజకవర్గంలో ఆఫీసు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని నియోజవర్గం వైసిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పెనమలూరులో ముగ్గురు నేతల షిఫ్టింగ్, జంపింగ్ తరువాత అదే నియోజకవర్గానికి చెందిన దేవభక్తుని చక్రవర్తిని తాత్కాలికంగా పెనమలూరు వైసీపీ ఇన్చార్జిగా వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి నియమించారు. స్థానికంగా సంపన్న కుటుంబానికి చెందిన దేవభక్తుని చక్రవర్తి రాజకీయాలకు కొత్త కావడం, వైసిపి స్థానిక నేతలతో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల పట్ల పూర్తిగా అవగాహన లేక.. నియోజకవర్గంలో ఇన్చార్జిగా ఉన్నామంటే ఉన్నట్లే ఉంటున్నారట. అత్యంత కీలకమైన పెనమలూరు నియోజకవర్గాన్ని కీలక నేతలు అంతా విడిచి వెళ్లడంతో ప్రస్తుతం వైసీపీకి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాజకీయ అనుభవం ఉన్న బలమైన నేత కోసం పెనమలూరు వైసీపీ కేడర్ ఎదురు చూస్తుంది.
ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, టిడిపికి బలమైన కంచుకోట లాంటి చోట తిరిగి పాగా వేయాలి అంటే ప్రస్తుతం నియమించిన చక్రవర్తితో సాధ్యం కాదన్న చర్చ పెనమలూరు వైసీపీలో నడుస్తుంది. ఇప్పటి వరకు వైసిపి తరఫున పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం నిర్వహించలేని పరిస్థితి పెనమలూరు వైసీపీలో నెలకొంది. ప్రస్తుతం బోడే లాంటి నేతను ఢీ కొట్టాలి అంటే నియోజకవర్గంలో పట్టున్న నేతను నియమిస్తే తప్ప మళ్ళీ పెనమలూరులో గెలుపు సాధ్యం కాదన్న చర్చ జోరుగా సొంత పార్టీలో నడుస్తోంది. మొత్తానికి కమ్మ సామాజికవర్గంగా పేరున్న పెనమలూరులో వైసీపీ పరిస్థితి అలా తయారైందిప్పుడు.