Foreign Ganja Seized: పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు శివరామ్. వయస్సు సుమారు 30ఏళ్లు ఉండొచ్చు. బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. డబ్బులకు కొదవలేదు.. ఐదంకెల జీతం కూడా. తక్కువ సమయంలో ఇంకా ఎక్కువ సంపాదించాలనే కోరిక కలిగింది. ఆ తర్వాత లైఫ్ లో హాయిగా సెటిలైపోవాలని భావించాడు. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. గంజాయి అమ్మకాలు సాగిస్తే తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తవచ్చని భావించాడు. చివరకు హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. మరో టెక్కీ పరారీలో ఉన్నాడు.
చాపకిందట నీరులా విస్తరించిన గంజాయిపై ఉక్కుపాద మోపుతోంది తెలంగాణ ప్రభుత్వం. దాని గురించి ఏ చిన్న వాసన, కబురు తెలిసినా ఏ ఒక్కర్నీ వదిలిపెట్టడం లేదు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫారెన్ గంజాయితోపాటు దేశీయ గంజాయిని సీజ్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలో ప్రశాంత్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయిని విక్రయిస్తున్న శివరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అతడి నుంచి గంజాయితోపాటు ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడు బెంగుళూరులో సాప్ట్ వేర్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఇదే క్రమంలో మరో టెక్కీ పరారీ అయ్యాడు. 170 గ్రాముల ఫారిన్ గంజాయి, కేజీ లోకల్ గంజాయిని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లక్ష్యంగా బిజినెస్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. స్మగ్లర్లు అమెరికా నుంచి గంజాయిని సిటీకి రప్పించి డబ్బులకు అలవాటు పడిన టెక్కీలతో అమ్మకాలు సాగినట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. అక్కడ అమ్మకాలు జరిపింది.. కొనుగోలు చేసింది కూడా టెక్కీలే.
ALSO READ: దారుణం.. బస్సులోంచి తల బయటపెట్టిన మహిళ.. ఆపై!
దీంతో లోగుట్టు బయటకు తీసే పనిలోపడ్డారు పోలీసులు. వాటిని ఎవరెవరికి సరఫరా చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఫారెన్ సరుకును ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రతీ వీకెండ్‌లో గంజాయి బిజినెస్ కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు టెక్కీలు. బెంగుళూరులో కొనుగోలు చేసి అక్కడి నుంచి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నట్లు తేలింది.
ఇక ఫారెన్ గంజాయిని అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్‌కు తెప్పించి అమ్ముతున్నారు ఆ టెక్కీలు. దీంతో తీగలాగితే ఫారెన్, దేశీయ గంజాయి గుట్టు బయటపడుతోంది. మరి పోలీసుల విచారణలో ఇంకెంతమంది టెక్కీలు, సినిమా వాళ్లు ఉంటారో చూడాలి.